వేటుతో వేడి

ABN , First Publish Date - 2023-04-11T00:55:02+05:30 IST

బీఆర్‌ఎస్‌ అసంతృప్త నేతగా ఈ ఏడాది ప్రారంభం నుంచి సుమారు వందరోజుల పాటు ఆత్మీయ సమ్మేళనాలతో ధిక్కార స్వరాన్ని వినిపించిన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటిశ్రీనివాసరెడ్డిపై బీఆర్‌ఎస్‌ సస్పెన్షన్‌ వేటు వేసింది.

వేటుతో వేడి

బీఆర్‌ఎస్‌ నుంచి మాజీ ఎంపీ పొంగులేటి బహిష్కరణ

అధినాయకత్వ నిర్ణయంతో జిల్లాలో పొలిటికల్‌హీట్‌

భవిష్యత కార్యాచరణపై శ్రీనివాసరెడ్డి సమాలోచనలు

ఏ పార్టీలో చేరతారన్నదానిపై సర్వత్రా చర్చ

విలేకరుల సమావేశంలో కేసీఆర్‌, కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు

తండ్రీకొడుకులు నమ్మించి మోసం చేశారని ఆరోపణ

ఖమ్మం, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): బీఆర్‌ఎస్‌ అసంతృప్త నేతగా ఈ ఏడాది ప్రారంభం నుంచి సుమారు వందరోజుల పాటు ఆత్మీయ సమ్మేళనాలతో ధిక్కార స్వరాన్ని వినిపించిన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటిశ్రీనివాసరెడ్డిపై బీఆర్‌ఎస్‌ సస్పెన్షన్‌ వేటు వేసింది. ఈ ‘వేటు’తో ఉమ్మడి జిల్లాలో ఒక్కసారిగా రాజకీయ ‘వేడి’ పెరిగింది. ఇప్పటికే తొమ్మిది నియోజవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలతో తన అనుచరవర్గాన్ని సంఘటితం చేస్తూ రాబోయే ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో అధిష్ఠానం పొంగులేటితోపాటు ఆదివారం కొత్తగూడెం సమ్మేళనానికి హాజరై, తీవ్ర వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, నాగర్‌కర్నూలు జిల్లా నేత జూపల్లి కృష్ణారావును కూడా సస్పెండ్‌ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ధిక్కార స్వరం వినిపిస్తున్న పొంగులేటిపై అధినాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందా అన్న చర్చ జరిగిన నేపథ్యంలో జరిగిన ఈ సస్పెన్షన్‌ రాజకీయ అలజడి రేపింది. అసమ్మతినేతలంతా క్రమంగా సంఘటితమయ్యే అవకాశాలున్నాయన్న అంశాన్ని గుర్తించిన బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు వారి ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేలా సస్పెన్షన్‌ వేటు వేశారని తెలుస్తోంది. ఈ క్రమంలో పొంగులేటి రాజకీయ భవిష్యత ఏంటని, ఆయన ఏదైనా పార్టీలో చేరతారా? సొంతంగా పార్టీపేడతారా? అన్నదానిపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. సస్పెన్షన్‌ ప్రకటన వెలువడగానే సోమవారం ఉదయం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మంలోని తన నివాసంలో తన ముఖ్యఅనుచరులైన భద్రాద్రి జడ్పీచైర్మన కోరం కనకయ్య, డీసీసీబీ మాజీచైర్మన మవ్వా విజయ్‌బాబు, డీసీసీబీ డైరెక్టర్‌ తుళ్లూరి బ్రహ్మయ్య, రాష్ట్ర మహిళా ఆర్థిక సహకార సంస్థ మాజీచైర్మన మద్దినేని స్వర్ణకుమారి, నాయకులుపిడమర్తి రవి, అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, వైరా మునిసిపల్‌ చైర్మన సూతగాని జయపాల్‌, మార్క్‌ఫెడ్‌ వైస్‌చైర్మన బొర్రారాజశేఖర్‌, మేకల మల్లిబాబుయాదవ్‌ తదితరులతో సమావేశమయ్యారు. ఉమ్మడి జిల్లానుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులను కలిశారు. అనంతరం తన ఎస్‌ఆర్‌ కన్వెన్షన హాల్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

సస్పెన్షన్‌ హాస్యాస్పదం : పొంగులేటి

విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, పార్టీ, ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేసిన పొంగులేటి తనపై సస్పెన్షన్‌ వేటు వేసిన విధానం హాస్యాస్పదంగా ఉందన్నారు. ‘దొంగలుపడిన ఆరునెలలకు కుక్కలు మొరిగినట్టు’గా వందరోజులుగా విమర్శలు చేస్తుంటే ఇప్పుడు సస్పెండ్‌ చేయడమేంటోనని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ధైర్యం తెచ్చుకుని సస్పెండ్‌ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన, మంత్రి పువ్వాడ పలుమార్లు మాట్లాడుతూ తనకు పార్టీలో సభ్యత్వంలేదన్నారని, సభ్యత్వమే లేనప్పుడు సస్పెండ్‌ ఎలా చేశారని చేశారని ప్రశ్నించారు. తాను వైఎ్‌సఆర్‌సీపీలో ఎలా చేరింది, తాను ఎంపీగా గెలవడంతో పాటు మరో ముగ్గురిని ఎమ్మెల్యేలుగా ఎలా గెలిపించుకుంది, 2016లో పాలేరు ఉప ఎన్నికల సమయంలో తనను పార్టీలో చేరాలని మంత్రి కేటీఆర్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఎలా ఒత్తిడి చేశారో ఆయన స్పష్టంగా వివరించారు. పాలేరు ఉప ఎన్నికల్లో గెలవడానికి తనను పార్టీలోకి తీసుకున్నారన్నారని, తనకు సముచితస్థానం ఇస్తామని కేసీఆర్‌,కేటీఆర్‌ ఆ సయయంలో హామీ ఇచ్చి నమ్మించి మోసంచేశారన్నారు. తడిగుడ్డతో తన గొంతు కోయాలని చూశారని, తండ్రీకొడుకులు రాజకీయంగా తనను సమాధిచేయాలని చూశారని ఆరోపించారు. కేసీఆర్‌ను తండ్రిలా భావించి నమ్మితే నమ్మకద్రోహం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి వల్ల పార్టీ ఓటమి పాలైతే ఆ ఓటమికి తాను కారణమని చూపారని, కనీసం ఆ ఓటమిపై సమీక్ష కూడా చేయలేదన్నారు. కానీ అదే కారణం చూపి తనకు ఎంపీ సీటు ఇవ్వకుండా తర్వాత రాజ్యసభ ఇస్తామని చెప్పి మోసగించారన్నారు. ఏపదవి లేకపోయినా ప్రజలతో ఉంటూ వారి గుండెల్లో స్థానం సంపాదించుకున్నానని, వారికోసం, తన ఆశయసాధన కోసం పనిచేస్తానని వెల్లడించారు. 2014, 2018 ఎన్నికల్లో ఉమ్మడిజిల్లాలో బీఆర్‌ఎస్‌ రెండుసార్లు ఒక్కో స్థానం మాత్రమే గెలుచుకుందని, వచ్చే ఎన్నికల్లో ఆ ఒక్కటికూడా గెలవదని, ఇప్పుడున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను ఎవరినీ అసెంబ్లీ గేటు కూడా తాకకుండా చూస్తానని హెచ్చరించారు. పదవులు ఇవ్వకపోయినా స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా అంతా తిరిగి పార్టీ అభ్యర్థులను గెలిపించిన విషయాన్ని గుర్తుచేసిన పొంగులేటి.. సింగరేణి ఎన్నికల్లో కుటుంబాన్ని, పండుగలను పక్కనపెట్టి.. అక్కడే తిష్టవేశానన్నారు. ఉద్యమసమయంలో కోదండరాం, ఆలే నరేంద్ర, విజయశాంతి లాంటి మేధావులను వినియోగించుకున్న కేసీఆర్‌ ఆ తర్వాత వారిని మోసంచేశారన్నారు. రాష్ట్రం బంగారు తెలంగాణ కాలేదు కానీ కేసీఆర్‌ కుటుంబం మాత్రం బంగారు కుటుంబమైందని, నిధులు, నీళ్లు, నియామకాలు కేసీఆర్‌ కుటుంబానికి వచ్చాయి తప్ప సాధారణ ప్రజలకు, నిరుద్యోగులకు ఒరిగిందేమీ లేదన్నారు. అన్ని ప్రాంతాలు తిరిగి ప్రజలను సంఘటితం చేసి ఈప్రభుత్వాన్ని పడేస్తానని, త్వరలో తన రాజకీయ నిర్ణయం వెల్లడిస్తానన్నారు.

బీఆర్‌ఎస్‌తో తెగిన బంధం

బీఆర్‌ఎస్‌ నేతగా ఏడేళ్లుగా తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకొన్న పొంగులేటికి ఆ పార్టీతో బంధం తెగింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్లాస్‌1 కాంట్రాక్టర్‌గా ఉంటూ 2013లో వైఎస్‌ జగన్మోహనరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. అనతికాలంలోనే ఖమ్మం జిల్లా రాజకీయాల్లో చక్రంతిప్పి.. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి తాను ఖమ్మం ఎంపీగా గెలవడంతో పాటు వైరా, అశ్వారావుపేట, పినపాక నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించారు. ఇక రాష్ట్ర విభజన అనంతరం వైసీపీ తెలంగాణ అధ్యక్షుడిగా వ్యవహరించి పార్టీ మనుగడ కష్టమని భావించి 2016 ఏప్రిల్‌ 23న పాలేరు ఉపఎన్నికల నేపథ్యంలో అప్పటి టీఆర్‌ఎ్‌సలో చేరారు. ఆ తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో టీఆర్‌ఎ్‌సకు ప్రతికూల ఫలితాలు రావడం, వ్యతిరేకంగా పనిచేయడంలో పొంగులేటి పాత్ర ఉందని ఫిర్యాదులు వెళ్లడం, కొన్ని ఘటనల ద్వారా కేసీఆర్‌కూడా పొంగులేటి తీరును గమనించి 2019లో లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ అభ్యర్థిత్వాన్ని ఇవ్వలేదు. అప్పటినుంచి పార్టీలో ఉంటున్నా పొంగులేటికి పదవుల పరంగా ఎలాంటి అవకాశాలు కలిపించలేదు. దీంతో అసంతృప్తితోనే పార్టీలో కొనసాగుతున్న పొంగులేటికి రాజ్యసభ వస్తుందని, ఎమ్మెల్సీ ఇస్తారని పలు మార్లు ప్రచారం జరిగినా ఆ పదవులు కూడా రాలేదు. దీంతో ఈ ఏడాది ప్రారంభం నుంచి ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ప్రజలను కలుస్తూ బీఆర్‌ఎ్‌సపై తిరుగుబాటు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మంలోని పది స్థానాల్లో తన అభ్యర్థులు బరిలో ఉంటారని ప్రకటించి జిల్లాలో కాక పుట్టించారు. అప్పటినుంచి ఇప్పటి వరకు 9నియోజకవర్గాల్లో ఆత్మీయసమావేశాలు నిర్వహించిన పొంగులేటి కొన్నిచోట్ల వచ్చే ఎన్నికల్లో తన తరుపున పోటీచేసే అభ్యర్థులను ప్రకటించారు. భద్రాచలంలో తెల్లం వెంకటరావు, ఇల్లెందులో ప్రస్తుత భద్రాద్రి జడ్పీచైర్మన కోరం కనకయ్య, పినపాకలో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేటలో జారె ఆదినారాయణ, వైరాలో విజయబాయి, మధిరలో కోట రాంబాబు పోటీ చేయబోతున్నారని ప్రకటించారు. మిగిలిన నాలుగు నియోజకవర్గాలకు ఎవరి పేర్లు ప్రకటించలేదు.

పొంగులేటి వెంటే అనుచరులు

పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై వేటు పడిన నేపథ్యంలో ఆయన వెంటే తామూ ఉంటామని, బీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేస్తామని పలువురు అనుచరులు ప్రకటించారు. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జడ్పీచైర్మన కోరం కనకయ్య, డీసీసీబీ మాజీ చైర్మన మువ్వా విజయ్‌బాబు, డీసీసీబీ డైరెక్టర్‌ తుళ్లూరి బ్రహ్మయ్య, రాష్ట్ర మహిళ ఆర్థిక సహకార సంస్థ మాజీచైర్మన మద్దినేని స్వర్ణకుమారి, ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పిడమర్తి రవి, వైరా మునిసిపల్‌ చైర్మన సూతగాని జయపాల్‌, మార్క్‌ఫెడ్‌ వైస్‌చైర్మన బొర్రా రాజశేఖర్‌, నాయకులు అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, మేకల మల్లిబాబుయాదవ్‌తోపాటు పలువురు పొంగులేటికి మద్దతుగా నిలిచారు. తాము కూడా పొంగులేటి వెంటే ఉంటామని, పార్టీకి రాజీనామా చేస్తామని ప్రకటించారు.

భవిష్యత ఏంటి?

పొంగులేటి రాజకీయ అడుగులపై ఊహాగానాలు

బీఆర్‌ఎస్‌ అధినాయకత్వం, ప్రభుత్వ తీరుపై ధిక్కార స్వరం వినిపించి.. బహిష్కరణకు గురైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయ భవిష్యత ఏంటన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆయన బీజేపీ వైపు చూస్తున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుండగా.. అనుచరుల్లో ఎక్కువ శాతం మంది కాంగ్రె్‌సలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని బీఆర్‌ఎస్‌, ఇతర పార్టీల్లోని అసంతృప్త వాదులు, అన్యాయానికి గురయ్యామన్న భావనలో ఉన్న ఉద్యమకారులతో సొంతపార్టీ పెట్టబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబంతో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో పలు మార్లు పొంగులేటి వైటీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మితో భేటీ అవడం చర్చనీయాంశమైంది. పొంగులేటి వైటీపీలో చేరతారని, తన అభ్యర్థులను ఆ పార్టీ నుంచి పోటీచేయిస్తారన్న చర్చ కూడా జరిగింది. అయితే పొంగులేటి మాత్రం త్వరలోనే తనభవిష్యత కార్యచరణ ప్రకటిస్తానని సోమవారం విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. తాను ఏ పార్టీలో చేరినా పదిస్థానాల్లో తన అనుచరులకు అభ్యర్థిత్వాలు ఇప్పించుకుని గెలిపించుకునే సత్తా తనకుందని పొంగులేటి చెబుతున్నారు. ప్రస్తుతం మూఢాలు ఉన్నందున.. శుభ ముహూర్తాలు వచ్చిన తర్వాత అంటే మే 15న తర్వాత పొంగులేటి తన నిర్ణయాన్ని వెల్లడిస్తారని ఆయన వర్గీయులు చెబుతున్నారు.

పొంగులేటిపై బీఆర్‌ఎస్‌ నేతల ఫైర్‌

సీఎంపై అనుచిత వ్యాఖ్యలు సరికాదన్న ఎమ్మెల్యేలు

తిన్నింటి వాసాలు లెక్కించే తీరు పొంగులేటిదని వ్యాఖ్యలు

బీఆర్‌ఎస్‌ బహిష్కృత నేత, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. సోమవారం విలేకరులసమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌పై చేసిన విమర్శలకు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దీటుగా ప్రతి విమర్శలు చేశారు. ఆయా నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి పొంగులేటిపై ఘాటు విమర్శలు చేశారు. మణుగూరులో ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ పార్టీలో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడమే కాకుండా, జాతీయ అధ్యక్షుడు కేసీఆర్‌ను ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘తిన్నింటి వాసాలు లెక్కించిన’ చందంగా పొంగులేటి వైఖరి ఉందని, అందుకే ఆయన్ను సస్పెండ్‌ చేశామని రేగా పేర్కొన్నారు. సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి పొంగులేటిది దశ, దిశలేని రాజకీయం, తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్‌పై విమర్శలు చేస్తే తెలంగాణ సమాజం సహించదని, పొంగులేటి విధానాలు, ఏ రాజకీయపార్టీకూడా హర్షించదని విమర్శించారు. ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ మాట్లాడుతూ పొంగులేటిది డబ్బు అహంకారమని, డబ్బుతో రాజకీయాల్లో గెలవాలనుకోవడం అవివేకమని, అలాంటి వారికి ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు.

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పొంగులేటిపై మండిపడ్డారు. సీఎంపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేశారని, ఆయన మాటలు ఎవరూ నమ్మరన్నారు. అశ్వారావుపేటలో మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ పార్టీ, సీఎంపై విమర్శలు చేసినందుకే పొంగులేటిని సస్పెండ్‌ చేశారని, పార్టీని ధిక్కరించే వారిపై చర్యలు తప్పవన్నారు. పాలేరులో ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పార్టీ మారే హక్కు ఎవరికైనా ఉంటుంది. అంతమాత్రాన పార్టీలో ఉండి ఇప్పుడు కేసీఆర్‌పై విమర్శలు చేయడం తగదన్నారు. వైరాలో ఎమ్మెల్యే రాములునాయక్‌ మాట్లాడుతూ పొంగులేటి మతిభ్రమించిందని, ధనరాజకీయాలు పనిచేయవని, కేసీఆర్‌, కేటీఆర్‌పై విమర్శలు చేస్తే జనం విశ్వసరించరన్నారు. మధిరలో ఖమ్మం జడ్పీచైర్మన లింగాల కమల్‌రాజ్‌ మాట్లాడుతూ పొంగులేటి కేసీఆర్‌తో ప్రయోజనాలుపొంది ఇప్పుడు విమర్శలు చేయడంతగదన్నారు. ఏదేమైనా పొంగులేటిపై వేటు వేస్తూ బీఆర్‌ఎస్‌ తీసుకున్న నిర్ణయంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.

Updated Date - 2023-04-11T00:55:02+05:30 IST