ఎన్టీఆర్ విగ్రహం.. శ్రీకృష్ణుడి రూపంలో వద్దు
ABN , First Publish Date - 2023-05-13T02:45:29+05:30 IST
శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు అంశంపై వివాదాలు మొదలయ్యాయి. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఖమ్మంలోని లకారం ట్యాంకుబండులో 54 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
యాదవ సమితి నేతల అభ్యంతరం
ఖమ్మం, మే 12 (ఆంధ్రజ్యోతి): శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు అంశంపై వివాదాలు మొదలయ్యాయి. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఖమ్మంలోని లకారం ట్యాంకుబండులో 54 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఎన్టీఆర్ శతజయంతి రోజైన 28న ఆయన మనవడు, సినీహీరో జూనియర్ ఎన్టీఆర్ చేతులమీదగా ఆవిష్కరింపజేసేందుకు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ విగ్రహ ఏర్పాటు అంశంపై సోషల్‌మీడియా వేదికగా చర్చోపచర్చలు సాగుతున్నాయి. శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం నెలకొల్పడమేంటని కొందరు సామాజిక వేత్తలు, కుల సంఘాల నాయకులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో సినీనటి కరాటే కల్యాణితో పాటు భారత యాదవ సమితి నాయకులు దాసరి నగేశ్ యాదవ్, రమేశ్ యాదవ్‌తదితరులు శుక్రవారం ఖమ్మం అదనపు కలెక్టర్ మధుసూదన్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే విగ్రహ ఏర్పాటు పనులు నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పలు టీవీ చానళ్లలో చర్చాకార్యక్రమాలు జరగ్గా.. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుచేస్తే తమకు అభ్యంతరంలేదు కానీ శ్రీకృష్ణుడి రూపంలో విగ్రహం పెడితే కోర్టుకు కూడా వెళతామని సినీ నటి కరాటే కల్యాణి హెచ్చరించారు. అయితే తాము శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహంగానే చెబుతూ ఏర్పాటు చేస్తున్నామని, అది శ్రీకృష్ణుడి విగ్రహం కాదని బీఆర్‌ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు, యాదవ సంఘం నాయకుడు పగడాల నాగరాజు స్పష్టం చేశారు.