మలివిడతకు గొర్రెలేవీ?

ABN , First Publish Date - 2023-07-08T00:38:03+05:30 IST

గొర్రెల పెంపకందారుల కులవృత్తిని ప్రోత్సహించి వారికి ఉపాధి చూపించే గొర్రెలపంపిణీ పథకం లక్ష్యం ఘనంగానే ఉన్నా.. ఆచరణలో మాత్రం అంతంతమాత్రంగా ఉంది. మొదటి విడత ప్రక్రియ పూర్తయి.. రెండోవిడతలో గొర్రెలు ఇచ్చేందుకు అధికారులు దరఖాస్తు తీసుకోగా.. ఆ గొర్రెలు తమకెప్పుడొస్తాయోనని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.

మలివిడతకు గొర్రెలేవీ?

వాటా చెల్లించి ఎదురుచూస్తున్న లబ్ధిదారులు

లక్ష్యం ఘనం.. ఆచరణ అంతంతమాత్రం

ఖమ్మం, జూలై 7 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): గొర్రెల పెంపకందారుల కులవృత్తిని ప్రోత్సహించి వారికి ఉపాధి చూపించే గొర్రెలపంపిణీ పథకం లక్ష్యం ఘనంగానే ఉన్నా.. ఆచరణలో మాత్రం అంతంతమాత్రంగా ఉంది. మొదటి విడత ప్రక్రియ పూర్తయి.. రెండోవిడతలో గొర్రెలు ఇచ్చేందుకు అధికారులు దరఖాస్తు తీసుకోగా.. ఆ గొర్రెలు తమకెప్పుడొస్తాయోనని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో షెడ్యూల్‌ విడుదలయిన తర్వాత నోటిఫికేషన వెలువడే సమయానికి నెలరోజుల ముందునుంచే ప్రభుత్వ పథకాలన్నిటిని నిలిపివేయాల్సి ఉంటుంది. ఈనేపథ్యంలో గొర్రెల పంపిణీకి తక్కువ సమయం ఉందని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఖమ్మం జిల్లా యంత్రాంగం 16,750మంది లబ్ధిదారులకు గొర్రెల పంపిణీచేయాలని లక్ష్యం పెట్టుకోగా.. ఇందులో ఒక్కో యూనిట్‌లో 20గొర్రెలతోపాటు ఒక పొటేలు పంపిణీచేయాలి. ఒక్కో యూనిట్‌ ఖరీదు రూ.1.75లక్షలు. ఇందులో రూ.43,750 లబ్ధిదారులు వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తం సబ్సిడీ రూపంలో ప్రభుత్వం సహాయం అందిస్తుంది. జాతీయ సహకార సంస్థ సహకారంతో ఈపథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లాలో మొత్తం 35వేల కుటుంబాలు గొర్రెలు పెంపకంపై ఆధారపడి జీవిస్తుండగా మొదటి విడతలో సగం మందికి గొర్రెలు పంపిణీచేశారు. మిగిలిన సగం మందికి మలివిడత కింద యూనిట్లు పంపిణీ చేయాల్సి ఉంది. జిల్లాలో గొర్రెల ఉత్పత్తిదారుల సహకారసంఘాలు 385ఏర్పాటుచేసి 16,750మంది లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టగా ఇప్పటి వరకు కేవలం 72మందికి మాత్రమే 1440 గొర్రెలు పంపిణీచేశారు. జిల్లాలో ఇంకా 3,33,560గొర్రెలు కొనుగోలుచేసి జిల్లాలో పంపిణీ చేయాల్సి ఉంది. కర్ణాటకలోని రాయచూర్‌, ఏపీలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాకు గొర్రెల కొనుగోలుకు కేటాయించారు. ఇందుకు సంబంధించి గొర్రెల కొనుగోలుకోసం జిల్లానుంచి అధికారులు వెళ్లినప్పటికి అక్కడ సంతల్లో పెద్దగా గొర్రెలు లభించడంలేదు. రాష్ట్రంలో ఇతర జిల్లాల వారు కూడా గొర్రెల కోసం ఆయా జిల్లాల్లో వెళుతుండగా డిమాండ్‌ నెలకొంది. దీనికితోడు ఈపథకానికి నిధులు కూడా వెంటవెంటనే విడుదల కాకపోవడంతో గొర్రెల కొనుగోలు, పంపిణీ అధికార యంత్రాగానికి సవాల్‌గా మారింది.

తొలివిడత పంపిణీలో రీసైక్లింగ్‌ ఆరోపణలు

మొదటి విడతలో గొర్రెలు లభ్యం కాకపోవడంతో పెద్దఎత్తున రీసైక్లింగ్‌ జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. మొదట్లో కొన్నియూనిట్లు కొనుగోలు చేసి జిల్లాకుతేవడం, వాటినే మళ్లీ వెనక్కి పంపి మళ్లీ తేవడం జరిగింది. దీంతో దళారులు కూడా భారీగానే లబ్ధిపొందారు. ఇక రెండోవిడతలో అయినా యంత్రాంగం నిబంధనలను పక్కాగా అమలుచేయాలని, రీసైక్లింగ్‌ లేకుండా చూడాలని, మొత్తం గొర్రెలు కొనుగోలు చేసి పంపిణీ చేయాలన్న డిమాండ్‌ వినిపిస్తున్నా.. అసలు కొనేందుకు గొర్రెలే లభించని పరిస్థితి ఉంది. దీంతో రెండో విడతలో గొర్రెల యూనిట్లు పంపిణీ కష్టమేనన్న చర్చ జరుగుతోంది. ఆ తర్వాత లబ్ధిదారులు వాటిని సాదుకుంటున్నారా? అమ్ముకున్నారా? లక్ష్యం నెరవేరిందా? లేదా? అనేదానిపై పర్యవేక్షణ ఉండడంలేదు. దీంతో కొందరు గొర్రెలు యూనిట్లు తీసుకుని ఆవెంటనే అమ్ముకుని సబ్సిడీ సొమ్మును క్యాష్‌ చేసుకుంటున్నారు. ఈక్రమంలో దళారులు పెద్దఎత్తున సొమ్ముల స్వాహాకు పాల్పడుతున్నారు. మలివిడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో ప్రారంభించి జిల్లాలో 72మంది లబ్ధిదారులకు పంపిణీ ద్వారా మళ్లీ ఈపథకంపై పెద్దఎత్తున గొర్రెల పెంపకందారులు, ఉత్పత్తిదారులు పెద్దఎత్తున ఆశలు పెట్టుకున్నారు. గొర్రెల పెంపకాన్ని కులవృత్తిగా భావించి జీవిస్తున్న లబ్ధిదారులు రెండొవిడత గొర్రెలు ఎప్పుడువస్తాయోనని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు ఎన్నికల కోడ్‌ వచ్చి తమకు రావాల్సిన గొర్రెలు అందుతాయో లేదోనన్న ఆందోళన లబ్ధిదారుల్లో నెలకొంది. ఇప్పటికైనా అధికార యంత్రాగం ఇతర రాష్ట్రాలకు వెళ్లి లబ్ధిదారులకు అందిస్తేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరనుంది.

Updated Date - 2023-07-08T00:38:03+05:30 IST