ప్రైవేటు స్థలంలోకి ఎన్టీఆర్ విగ్రహం
ABN , First Publish Date - 2023-06-25T01:20:41+05:30 IST
ఖమ్మం నగరంలోని లకారం చెరువులో ఏర్పాటు చేయదలచిన ఎన్టీఆర్ విగ్రహాన్ని కోర్టు కేసు నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ప్రైవేటు స్థలంలో ఏర్పాటు చేయాలని నిర్వాహకులు నిర్ణయించారు.
కోర్టు కేసు నేపథ్యంలో ప్రత్యామ్నాయ చర్యలు
లకారం ట్యాంకుబండ్ సమీపంలో ఏర్పాటుకు చర్యలు
ఆగస్టులో విగ్రహావిష్కరణ: తాళ్లూరి జయశేఖర్
ఖమ్మం, జూన 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఖమ్మం నగరంలోని లకారం చెరువులో ఏర్పాటు చేయదలచిన ఎన్టీఆర్ విగ్రహాన్ని కోర్టు కేసు నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ప్రైవేటు స్థలంలో ఏర్పాటు చేయాలని నిర్వాహకులు నిర్ణయించారు. శ్రీకృష్ణుని అవతారంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఖమ్మంలో పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చెందుతున్న లకారం ట్యాంకుబండ్‌లో ఏర్పాటు చేయాలని తానా మాజీ అధ్యక్షుడు, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఎనఆర్‌ఐ తాళ్లూరి జయశేఖర్‌తో పాటు పలువురు ఎనఆర్‌ఐల ఆర్థిక సహకారంతో ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అనుమతి కూడా లభించింది. దాంతో శ్రీకృష్ణుని అవతారంలో ఉన్న విగ్రహాన్ని నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రతా్‌పవర్మ అనే శిల్పితో తయారుచేయించి ఖమ్మం తీసుకువచ్చారు. 54అడుగుల ఎత్తు కలిగిన ఈ విగ్రహాన్ని ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా మే 28న జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించాలని నిర్ణయించారు. అయితే శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎలా ఆవిష్కరిస్తారని, అలాగే తాగునీటిచెరువుగా ఉన్న లకారంలో విగ్రహం ఏర్పాటుచేస్తే నీరు కాలుష్యం అవుతుందని కొందరు హైకోర్టుకు వెళ్లడంతో విగ్రహావిష్కరణ చేయవద్దని కోర్టు స్టే విధించింది. శ్రీకృష్ణుడి రూపంలోని ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం తగదని, తద్వారా తమ మనోభావలు దెబ్బతింటాయని పేర్కొంటూ ఆదిభట్ల శ్రీకళాపీఠం, భారతయాదవసమితి, యాదవ మేధావుల ఫోరం, ఆలిండియా యాదవ మహాసభకు చెందిన పలువురు హైకోర్టుకు వెళ్లడంతో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణపై స్టే విధించింది. దీంతో శ్రీకృష్ణుడి అవతారంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పిల్లనగ్రోవి, నెమలిపింఛం తొలిగించారు. అయినా విగ్రహ ఏర్పాటుకు కోర్టు అనుమతించలేదు. దీంతో విగ్రహం ఆవిష్కరణను వాయిదా వేశారు. ఇదిలా ఉండగా కోర్టు కేసులతో నిలిచిపోయిన ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణను ఎలాగైనా చేపట్టాలని భావించిన నిర్వాహకులు ఇందుకోసం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. ముందుగా అనుకున్న ప్రకారం ఎన్టీఆర్ విగ్రహాన్ని లకారం చెరువులో కాకుండా ఆ చెరువు పక్కనే ఉన్న ప్రైవేటు స్థలంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం సుమారు రూ.కోటితో స్థలాన్ని కొనుగోలు చేసి ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించేందుకు పనలు ప్రారంభించారు.
ఆగస్టులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ
తాళ్లూరి జయశేఖర్, తానా మాజీ అధ్యక్షుడు
ఖమ్మం లకారం చెరువు సమీపంలో ఆగస్టులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, ఆ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని తానా మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ పేర్కొన్నారు. శనివారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ ఎన్టీఆర్ విగ్రహాన్ని శ్రీకృష్ణుడి అవతారంలో లకారం చెరువులో ఆవిష్కరించాలని నిర్ణయించి అందుకు ఏర్పాటుచేశామని, అయితే కొందరు అభ్యంతరాలు, కోర్టు ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని శ్రీకృష్ణుడి ఆవతారంలోని విగ్రహంలో పిల్లనగ్రోవి, నెమలిపింఛాన్ని తొలిగించామని, ఇప్పుడు పూర్తిగా ఎన్టీఆర్ ఆకారంలోని విగ్రహం మాత్రమే ఆవిష్కరిస్తున్నామని తెలిపారు. ఎన్టీఆర్ పట్ల తెలుగు ప్రజల్లో ఉన్న అభిమానాన్ని దృష్టిలో ఉంచుకుని రాజకీయాలకు అతీతంగా తాము ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని జయశేఖర్ తాళ్లూరి తెలిపారు.