నేటినుంచి ‘పాలేరు జేఎన్టీయూ’ తరగతులు
ABN , First Publish Date - 2023-09-25T01:06:44+05:30 IST
ఖమ్మం జిల్లాకు మంజూరైన పాలేరు జేఎనటీయూ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఖమ్మంరూరల్ మండలం మద్దులపల్లిలోని ఐటీడీఏకు చెందిన వైటీసీ భవనంలో ఈ తరగతులు ప్రారంభం కానున్నాయని విద్యార్థులకు అధికారులు సమాచారం అందించారు.

‘ఆంధ్రజ్యోతి’ కథనంతో అధికారుల్లో కదలిక
ఖమ్మం, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): ఖమ్మం జిల్లాకు మంజూరైన పాలేరు జేఎనటీయూ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఖమ్మంరూరల్ మండలం మద్దులపల్లిలోని ఐటీడీఏకు చెందిన వైటీసీ భవనంలో ఈ తరగతులు ప్రారంభం కానున్నాయని విద్యార్థులకు అధికారులు సమాచారం అందించారు. ఎంసెట్ కౌన్సెలింగ్ చివరి దశ సమయంలో ఈ కళాశాలకు అనుమతి రాగా.. భవనం దొరక్కపోవడంతో ప్రారంభంలో జాప్యం జరిగింది. తొలుత ఖమ్మంరూరల్ మండలంలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల భవనంలో ప్రారంభమవుతాయని, ఆ తరువాత ఈనెల 22 నుంచి వైటీసీ భవనంలో తరగతులు ప్రారంభవమవుతాయని విద్యార్థులకు సమాచారమిచ్చారు. కానీ అనుమతులు రాకపోవటంతో తరగతుల ప్రారంభాన్ని వాయిదా వేశారు. ఈ క్రమంలో.. ఖమ్మం జేఎన్టీయూ తరగతుల విషయంలో గందరగోళంపై ఈనెల 22న ‘జేఎన్టీయూ ఎక్కడ?’ శ్రీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. దీంతో విద్యార్థి సంఘాలు, కాంగ్రెస్ నాయులు స్పందించి జేఎన్టీయూ కాలేజీని సత్వరమే ప్రారంభించాలని, అధ్యాపక పోస్టులను భర్తీచేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో విద్యార్థులకు జరుగుతున్న నష్టాన్ని గుర్తించిన కలెక్టర్ వీపీ గౌతమ్, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో సోమవారం నుంచి తాత్కాలికంగా తరగతుల నిర్వహణకు ఆదివారం అనుమతిచ్చారు. అయితే ప్రస్తుతం మద్దులపల్లి వైటీసీ భవనంలో మొదటి సంవత్సరం విద్యార్థులకు మాత్రమే ప్రవేశాలున్నాయి. వచ్చే విద్యా సంవత్సరంలో సుమారు, 400 మంది విద్యార్థులు వచ్చే అవకాశం ఉన్నందున ఇక్కడ వసతుల సమస్యలు తలెత్తనున్నాయి. మద్దులపల్లిలో సూచించిన స్థలాన్ని అప్పగించి జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలకు భవన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ వినిపిస్తోంది.