Share News

మేడారం ఫైల్‌పై కొండా సురేఖ తొలి సంతకం

ABN , Publish Date - Dec 18 , 2023 | 03:37 AM

వేద పండితుల ఆశీర్వచనాల మధ్య దేవాదాయ, పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా కొండా సురేఖ ఆదివారం బాధ్యతలు చేపట్టారు.

మేడారం ఫైల్‌పై కొండా సురేఖ తొలి సంతకం

అటవీ జంతువుల దాడుల్లో మృతుల పరిహారం పెంపు పైనా.. మేడారం జాతరకు రూ.75 కోట్ల నిధులు విడుదల

అటవీ, దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరణ

‘జనవాణి - కాలుష్య నివారిణి’ యాప్‌ విడుదల

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, సనత్‌నగర్‌, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): వేద పండితుల ఆశీర్వచనాల మధ్య దేవాదాయ, పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా కొండా సురేఖ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. సచివాలయం నాలుగో అంతస్తులో కేటాయించిన కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆమె.. మేడారం సమ్మక్క, సారక్క మహా జాతరకు రూ.75 కోట్ల నిధుల విడుదల, అటవీ జంతువులు దాడుల్లో మృతి చెందినవారి కుటుంబాలకు పరిహారం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు ఫైళ్లపై తొలి సంతకాలు చేశారు. పరిహారం పెంపునకు సంబంధించి ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి. వివిధ కార్యక్రమాలు, ఉత్సవాలకు ఇతర రాష్ట్రాల నుంచి ఏనుగులను తీసుకొచ్చేందుకు అనుమతి ఇస్తూ మరో ఫైల్‌పైనా కొండా సురేఖ సంతకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిత్యం అందుబాటులో ఉంటానని చెప్పారు. అధికారులు, సిబ్బంది నిజాయతీతో పనిచేయాలని కోరారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పథకాలు, పనులను అటవీ సంరక్షణ అధికారి (పీసీసీఎఫ్‌, హెచ్‌వోఎ్‌ఫఎ్‌ఫ) ఆర్‌ఎం డోబ్రియల్‌ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. హరిత హారంలో పచ్చదనం పెంపు, వచ్చే ఏడాది లక్ష్యాలపై మంత్రి ఆరా తీశారు. కాంపా నిధుల సాధన, చేపట్టిన పనులను అడిగి తెలుసుకున్నారు. అర్చక ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ ఆలయాల నుంచి వచ్చిన సుమారు వంద మంది అర్చకులు, వేద పండితులు కొండా సురేఖకు వేద ఆశీర్వచనం అందజేశారు.

కాలుష్యంపై ప్రజల్లో అవగాహన పెరగాలి

కాలుష్య కారకాలపై ప్రజల్లో మరింత అవగాహన పెరగాలని మంత్రి సురేఖ పేర్కొన్నారు. బాధ్యతల స్వీకరణ అనంతరం కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఆమె సమావేశమయ్యారు. మంచి వాతావరణం కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కోరారు. పర్యావరణ రక్షణ, పచ్చదనం పెంపు లక్ష్యాలకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నిర్మాణ వ్యర్థాలు, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధం, వాహన కాలుష్యంపై అవగాహన పెంచేలా తయారు చేసిన పోస్టర్లను ఆవిష్కరించారు. కాలుష్య కారకాలపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ‘జనవాణి - కాలుష్య నివారణి’ యాప్‌ను విడుదల చేశారు.

Updated Date - Dec 18 , 2023 | 03:38 AM