KTR: బరాబర్.. మాది కుటుంబ పాలనే!
ABN , First Publish Date - 2023-02-05T03:23:56+05:30 IST
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నారంటూ ప్రతిపక్షాలు పదే పదే చేస్తున్న విమర్శలకు మంత్రి కేటీఆర్ అసెంబ్లీ వేదికగా ఘాటైన సమాధానమిచ్చారు.
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు మా కుటుంబ సభ్యులే
మా కుటుంబ పెద్ద ముఖ్యమంత్రి కేసీఆర్
జై తెలంగాణ అని ఆయన అనకుంటే.. రాష్ట్రం వచ్చేదా?
డబుల్ ఇంజన్ కాదు.. కేసీఆర్‌తో డబుల్ ఇంపాక్ట్ సర్కారు
హంతకులే సంతాపం తెలిపినట్లుగా బీజేపీ నేతల వైఖరి
మోదీ లాంటి దుర్మార్గపు ప్రధాని ప్రపంచంలోనే లేడు
ఈడీ, ఐటీ, సీబీఐలను వేటకుక్కల్లా తిప్పుతున్నారు: కేటీఆర్
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మంత్రి
హైదరాబాద్, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నారంటూ ప్రతిపక్షాలు పదే పదే చేస్తున్న విమర్శలకు మంత్రి కేటీఆర్ అసెంబ్లీ వేదికగా ఘాటైన సమాధానమిచ్చారు. తమది కుటుంబ పాలనేనని, తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది తమ కుటుంబ సభ్యులేనని, ఈ కుటుంబానికి పెద్ద సీఎం కేసీఆర్ అని అన్నారు. శనివారం శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రభుత్వం తరపున మంత్రి సమాధానం చెప్పారు. ‘‘వంద శాతం చెబుతున్నా.. మాది కుటుంబ పాలనే. బరాబర్ కుటుంబ పాలనే. తెలంగాణలోని 4 కోట్ల మంది మా కుటుంబ సభ్యులే. ఈ కుటుంబానికి పెద్ద కేసీఆర్. ప్రతి కుటుంబంలోని అవ్వా తాతలకు పెన్షన్ ఇచ్చి పెద్ద కొడుకులా నిలబడ్దది కేసీఆర్ కాదా? 4 కోట్ల మంది తోబుట్టువులను దగ్గరుండి చూసుకుంటున్నది కేసీఆర్ కాదా? కంటి వెలుగుతో వృద్ధుల జీవితాల్లో కొత్త వెలుగు నింపుతున్నది కేసీఆర్ కాదా? లక్షలాది మంది పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తున్న పెద్దకొడుకు కేసీఆర్ కాదా? పసిబిడ్డలకు కేసీఆర్ కిట్ ఇస్తూ కంటికి రెప్పలా కాపాడుతున్న మేనమామ కేసీఆర్ కాదా? కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌తో 12 లక్షల మంది పేదింటి ఆడబిడ్డలకు పెళ్లి చేసిన మేనమామ కేసీఆర్ కాదా? అవును.. ఇది కుటుంబపాలనే! మాది వసుదైక కుటుంబం!’’ అని కేటీఆర్ అన్నారు. జై తెలంగాణ అని కేసీఆర్ అనకుంటే.. రాష్ట్రం వచ్చేదా? అని ప్రశ్నించారు. తెలంగాణతో కేసీఆర్‌కు ఉన్న పేగుబంధాన్ని తెంపే దమ్ము, ధైర్యం ఈ దేశంలో ఎవరికీ లేదని, బీజేపీ నేతలకు అసలే లేదని అన్నారు.
రైతు మరణాలపై దుర్మార్గంగా మాట్లాడిన మోదీ
నల్ల చట్టాలు తెచ్చి 700 మంది రైతుల ప్రాణాలు తీయటమే కాకుండా.. వాళ్లు నా కోసమేమైనా చనిపోయారా? అని ప్రఽధాని నరేంద్రమోదీ దుర్మార్గంగా మాట్లాడారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఉత్తరప్రదేశ్‌లో 8 మంది రైతులపైకి జీపు ఎక్కించిన చరిత్ర బీజేపీ నేతలకు ఉందన్నారు. ఆ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలు అసెంబ్లీలో మాట్లాడుతుంటే హంతకులే సంతాపం తెలిపినట్లుందని ఎద్దేవా చేశారు. రైతు రాజ్యం కావాలని తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంటే.. కార్పొరేట్ రాజ్యం కావాలని బీజేపీ పనిచేస్తోందని ఆరోపించారు. డిస్కమ్‌లను ప్రైవేటుపరం చేస్తామని, మోటార్లకు మీటర్లు పెట్టాలని, రాష్ట్రానికిచ్చే అప్పులకు ఎందుకు లింక్ పెడుతున్నారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ‘అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదాన్ని దేశం మొత్తం వినిపిస్తామని, ఒక రాష్ట్రంలో జరుగుతున్నపుడు దేశంలో ఎందుకు జరగదో చూస్తామని ప్రకటించారు. అనాగరికంగా ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపేసి, లోయర్ సీలేరును ఆంధ్రాకు కట్టబెట్టింది కేంద్రం కాదా? అని నిలదీశారు. ఒకప్పుడు పవర్ హాలిడేస్ ఉంటే.. ఇప్పుడు పవర్‌ఫుల్ డేస్ తెలంగాణలో ఉన్నాయన్నారు. గుజరాత్‌లో రైతులు కరెంటుకోసం ఇబ్బందులు పడుతున్నారని, పరిశ్రమలకు పవర్ హాలిడేలు ఇస్తున్నారని, నీటి కొరతపై మంత్రుల ఇళ్లను ప్రజలు ముట్టడిస్తున్నారని తెలిపారు.
తెలంగాణలో బీజేపీ పప్పులు ఉడకవు..
ప్రైవేటు గుత్తేదారులకు బీజేపీ నేతలు నిస్సిగ్గుగా కొమ్ము కాస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణలో మాత్రం కేసీఆర్ ఉండగా బీజేపీ నేతల పప్పులు ఉడకవని హెచ్చరించారు. కర్ణాటకలో ఎన్నికలున్నాయనే ఉద్దేశంతో అప్పర్ భద్రకు రూ.5,300 కోట్లు కేటాయించి, తెలంగాణకు నయాపైసా ఇవ్వకపోయినా.. బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. ప్రధాని మోదీ.. మన్‌కీ బాత్‌లోగానీ, ప్రసంగాల్లోగానీ తెలంగాణ గొప్పతనాన్ని ఏనాడూ ప్రస్తావించలేదని, తెలంగాణ పదం ఉచ్ఛరించటానికి కూడా మోదీకి మనసొప్పదని ఆరోపించారు. కాళేశ్వరానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వకుండా, నీటి వాటాలు తేల్చకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. నరేంద్రమోదీ పాలనలో 45 ఏళ్లలో ఎన్నడూలేని దుస్థితికి నిరుద్యోగం చేరిందని, ప్రపంచంలో అత్యధిక గ్యాస్ సిలిండఽర్ ధర భారత్‌లోనే ఉందని, పెట్రోలు ధరల పెరుగుదలలో ప్రపంచంలో మూడో స్థానంలో ఉందని తెలిపారు. ద్రవ్యోల్బణం కూడా అత్యధికంగా పెరిగిందన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తామని, దేశమంతా బుల్లెట్ రైళ్లు ఉరికిస్తామని, ప్రతి భారతీయుడికి ఇల్లు ఉంటుందని, 57 లక్షల ఇండ్లు కట్టిస్తానని, ప్రతి ఇంటికీ కరెంటు ఇస్తానని, ఎకానమీ 5 ట్రిలియన్ల డాలర్లు అవుతుందంటూ మోదీ అలవికాని హామీలిచ్చారని, ఒక్కటీ నెరవేర్చలేదని ఽధ్వజమెత్తారు.
వేటకుక్కల్లా దర్యాప్తు సంస్థలు..
ఈడీ, ఐటీ, సీబీఐలను కేంద్రం వేటకుక్కల్లా తిప్పుతోందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. అహ్మదాబాద్-ముంబై బుల్లెట్ రైలుకు రూ.లక్షా 10 వేల కోట్లు ఖర్చు చేయొచ్చుగానీ.. 45 లక్షల మంది రైతులకు ఉపయోగపడే కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్లు ఖర్చుచేస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఉచితాలు మంచివి కాదన్న మోదీ.. రూ.12 లక్షల కోట్లు కార్పొరేట్ దోస్తుల కోసం మాఫీ చేశారని అన్నారు. బీసీ గణన చేపట్టడంలేదని, పవర్‌లూమ్, హ్యండ్లూమ్ బోర్డు ఎత్తివేశారని, చేనేతపై 5 శాతం పన్ను వసూలు చేసే దుర్మార్గమైన ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారని ఆరోపించారు. ఉపాధి హామీ పథకానికి రూ.1,100 కోట్లు కేంద్రం విడుదల చేయడం లేదని, అందుకే సర్పంచులకు బిల్లుల చెల్లింపులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ ప్రజలను అవమానపరిచేలా మాట్లాడారని, ఇటుకతో కొట్టినట్లు మాట్లాడితే. రాయితో కొట్టినట్లు సమాధానం ఇస్తామని హెచ్చరించారు. ముడిచమురు ధరలు పెరగలేదని, కానీ.. ‘మోడీ’ చమురు ధరలు పెరిగాయని కేటీఆర్ విమర్శించారు. సబ్‌కా సాత్... సబ్‌కా వికాస్ అంటున్నారని, కానీ.. అంతా బక్వాస్ అని అన్నారు. ఈ దేశానికి డబుల్ ఇంజన్ సర్కారు అవసరం లేదని, కేసీఆర్ లాంటి డబుల్ ఇంపాక్ట్ సర్కారు కావాలని పేర్కొన్నారు.
దేశానికి టార్చ్ బేరర్‌గా తెలంగాణ..
‘‘ఎనిమిదిన్నరేళ్ల తెలంగాణ స్వపరిపాలన, సుపరిపాలన ఫలాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని మంత్రి కేటీఆర్ అన్నారు. పదేళ్లు దాటని తెలంగాణ.. భారతదేశానికి దారిచూపే దీపస్తంభంలా(టార్చ్ బేరర్) మారిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏ ఒక్క వర్గాన్ని కూడా విస్మరించలేదన్నారు. రైతుబంధు పథకంతో ఏడాదికి పంపిణీ చేస్తున్న రూ.15,500 కోట్ల నిధుల్లో 70 శాతం బడుగు, బలహీనవర్గాల ఖాతాల్లోనే పడుతున్నాయని, పదెకరాలకు పైగా భూమి ఉన్న రైతులు కేవలం 1.39 శాతమే ఉన్నారని వెల్లడించారు. రైతుబీమా పథఽకానికి ఏడాదికి రూ.1,450 కోట్లు వెచ్చిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. 94,500 కుటుంబాలకు రూ.4,725 కోట్లు పంపిణీ చేశామన్నారు. రాష్ట్రంలో విద్యుదుత్పత్తి 7,700 మెగావాట్ల నుంచి 18 వేల మెగావాట్లకు పెరిగిందని, ఒకప్పుడు రాష్ట్రంలో 19.03 లక్షలున్న వ్యవసాయ కనెక్షన్లు 27.13 లక్షలకు పెరిగాయని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో పీక్ డిమాండ్ 13,162 మెగావాట్లు ఉంటే... ఇప్పుడున్న తెలంగాణలో పీక్ డిమాండ్ 14,160 మెగావాట్లు ఉండటం విశేషమని పేర్కొన్నారు. థర్మల్ విద్యుత్ ఉత్పత్తిలో సింగరేణి అగ్రస్థానంలో ఉందన్నారు.
పెండింగ్ ప్రాజెక్టుల రన్నింగ్..
నత్తలే సిగ్గుపడేలా జలయజ్ఞం ప్రాజెక్టులు నడిస్తే.. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో పెండింగ్ ప్రాజెక్టులేవీ లేకుండా రన్నింగ్ ప్రాజెక్టులుగా మారాయని కేటీఆర్ అన్నారు. జలయజ్ఞంపై పదేళ్లలో రూ.38,405 కోట్లు ఖర్చు చేస్తే.. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొమ్మిదేండ్లలో 1లక్షా 46 వేల కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. యువ ఐఏఎస్, ఐపీఎ్‌సలకు పాఠాలు చెప్పే ముస్సోరిలోని లాల్ బహదూర్‌శాస్త్రి అకాడమీలో పాఠ్యాంశంగా తెలంగాణ విజయగాథలు ఉన్నాయని చెప్పారు. ముస్లిం మైనారిటీ బాలికల విద్యలో తెలంగాణ అగ్రభాగంలో నిలిచిందన్నారు. జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు ఇస్తామని, హైదరాబాద్ నలుదిశలా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తున్నామని ప్రకటించారు. కంటి అద్దాలు తెలంగాణలో ఉత్పత్తి అవుతున్నాయని, చాక్లెట్ నుంచి రాకెట్ దాకా, యాప్స్ నుంచి గూగుల్ మ్యాప్స్ దాకా... ప్రతి పరిశ్రమకు గమ్యస్థానం తెలంగాణేనని అన్నారు.
రాజేందరన్న ఇదివరకు మంచిగుండెటోడు
మంత్రి కేటీఆర్ తన ప్రసంగంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేరును పలుమార్లు ప్రస్తావించారు. ‘24 గంటలు కరెంటు ఇస్తే ముక్కు నేలకు రాస్తా అని మా రాజేందరన్న మాట్లాడిండు. ఇక్కడున్నపుడు మంచిగుండె.. అక్కడికిపోగానే మళ్లెట్లనో అయ్యిండు! బీజేపీలోకి పోగానే మనుషులు మారిపోతరు. కరెంటు తీగెలు పట్టుకోమని నేనంటలేను. మిగిలిందే ఇద్దరు... మీరిద్దరు బాగుండాలె’’ అని ఈటల రాజేందర్, రఘునందన్‌రావును ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు. సమాజంలో ఆర్థిక, అసమానతలు తొలిగించేందుకు దళితబంధు పథకం పెడితే.. హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం తెచ్చినట్లు ఆరోపించారని, ఈటల రాజేందర్ టీఆర్‌ఎ్‌సలో ఉన్నపుడే దీనిని బడ్జెట్‌లో ఆమోదించామని తెలిపారు. ‘‘సర్కారు దవాఖానల్లో ప్రసవాలు 31 శాతం నుంచి 61 శాతానికి పెరిగాయి. మా రాజేందరన్న కూడా ఆరోగ్యశాఖ మంత్రిగా కొంతకాలం పనిచేశారు. వారి హయాంలో కూడా కొంత పని జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్న వకీల్‌సాబ్ రఘునందన్‌రావు మొదటిసారి బడ్జెట్‌పై మాట్లాడిన తీరు సరిగాలేదు. బబ్రాజమానం భజగోవిందం అన్నట్లుగా ఉంది’’ అని కేటీఆర్ విమర్శించారు.
ఊకదంపుడు ఉపన్యాసాలు టీవీల్లో చెప్పుడు తప్ప దుబ్బాకలో చేసిందేమీలేదన్నారు. దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్న మోదీ.. ‘హమ్ దో.. హమారే దో! ఇద్దరమ్మాలె... ఇద్దరు కొనాలె!’ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ కామెంట్ రాహుల్‌గాంధీది అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అనగానే, ‘‘ఆయన మంచి మనిషి! ఆయన ఎక్కడున్నా మంచిగుండాలని కోరుకుంటున్నా’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పోడు భూములపై మాట్లాడుతుండగా... ఇంకా పంపిణీ చేయలేదని, సీఎం అసెంబ్లీలో ఇచ్చిన హామీ నెరవేరలేదని భట్టి వాదనకు దిగారు. మునుగోడు ఉప ఎన్నికను కేటీఆర్ ప్రస్తావించగానే... 100 మంది ఎమ్మెల్యేలు పోయారని భట్టి అనగానే, ‘‘మీ నాయకుడి లెక్క భయపడి పక్కనుంచి పారిపోం. బాజాప్తా ఎన్నికల క్షేత్రంలో కొట్లాడుతాం. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు ఉంటాయి. కేసీఆర్-2 సర్కారులో ఇది చివరి బడ్జెట్’’ అని కేటీఆర్ అన్నారు.
దేశ నిర్మాణంలో తెలంగాణ భాగస్వామ్యం
మండలిలో మంత్రి కేటీఆర్ ప్రసంగం
హైదరాబాద్, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): ప్రత్యక్ష, పరోక్ష పన్నుల ద్వారా తెలంగాణ ప్రజలు 8ఏళ్లలో కేంద్రానికి రూ.4.27 లక్షల కోట్లు చెల్లించారని మంత్రి కేటీఆర్ తెలిపారు. కానీ, రాష్ట్రానికి కేంద్రం తిరిగి ఇచ్చింది మాత్రం కేవలం రూ.1.95 లక్షల కోట్లేనన్నారు. మిగిలిన రూ.2.25 లక్షల కోట్లు దేశ నిర్మాణంలో తెలంగాణ ప్రజల భాగస్వామ్యమని పేర్కొన్నారు. శనివారం శాసనమండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన వారం రోజుల్లోనే కృష్ణా నుంచి 495 టీఎంసీల నీటిని తెలంగాణకు కేటాయించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాశారని, కానీ.. ఎనిమిదిన్నరేళ్లైనా ఇప్పటివరకు బవాబు రాలేదని విమర్శించారు. కేంద్రం సహకరించకపోయినా కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిచేసి నల్లగొండకూ నీళ్లిస్తామన్నారు. ఐటీ రంగంలో దేశం మొత్తంలో 4.5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తే.. ఇందులో అత్యదికంగా 1.5 లక్షల మందికి హైదరాబాద్‌లోనేనని చెప్పారు. కాగా, కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న పార్టీతో నిన్నటివరకు అంటకాగి.. తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకోవడంలో విఫలమయ్యారని కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి విమర్శించారు. దీంతో అధికార పార్టీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. చర్చలో మజ్లిస్ సభ్యుడు అఫెండీ, ఎ.నర్సిరెడ్డి, కవిత, బండ ప్రకాష్, యెగ్గె మల్లేశం, కౌశిక్‌రెడ్డి పాల్గొన్నారు.