Loan waiver : చేనేతలకు రుణమాఫీ!

ABN , First Publish Date - 2023-08-13T02:44:10+05:30 IST

చేనేత కార్మికుల రుణమాఫీ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రైతుల రుణమాఫీ తరహాలోనే సీఎం సానుకూలంగా స్పందిస్తారన్న విశ్వాసం తనకు ఉందని చెప్పారు. ఎంత

Loan waiver : చేనేతలకు రుణమాఫీ!

సీఎం కేసీఆర్‌తో చర్చించి నిర్ణయం.. నెలకు రూ.3 వేల చొప్పున సాయం

75 ఏళ్ల వరకు బీమా.. భూదాన్‌పోచంపల్లి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌

నిజాం కళాశాలలో హాస్టల్‌కు శంకుస్థాపన.. 15 నెలల్లో పూర్తికి హామీ

యాదాద్రి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): చేనేత కార్మికుల రుణమాఫీ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రైతుల రుణమాఫీ తరహాలోనే సీఎం సానుకూలంగా స్పందిస్తారన్న విశ్వాసం తనకు ఉందని చెప్పారు. ఎంత ఖర్చవుతుందో లెక్కలు తీసి, వెంటనే అమలు చేస్తామని చెప్పారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లిలో మంత్రి కేటీఆర్‌ పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో కేటీఆర్‌ పాల్గొన్నారు. రైతుల రుణమాఫీ చేస్తామని అనుకోలేదని, ముఖ్యమంత్రి మంచి మనసున్న నాయకుడని, రాష్ట్రంలో రూ.19 వేల కోట్ల రైతుల రుణాలు మాఫీ చేశారన్నారు. కేసీఆర్‌ నిర్ణయంతో కాంగ్రె్‌సకు మింగుడు పడటంలేదన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా చేనేత కార్మికులకు నెలకు రూ.3 వేల చొప్పున అందించనున్నామన్నారు. నేతన్నలకు బీమా ప్రస్తుతం 59 ఏళ్లలోపు వయసున్న వారికే వర్తిస్తోందని, దీన్ని 75 ఏళ్లకు పొడిగిస్తామని, ఎల్‌ఐసీ ద్వారా అమలుకు చర్యలు తీసుకుంటామన్నారు. చేనేత కార్మికులు చనిపోయినప్పుడు అంత్యక్రియల ఖర్చులకు ఇచ్చే రూ.5 వేలను రూ.25 వేలకు పెంచుతున్నట్లు తెలిపారు. నేతన్నలకు రూ.26 వేల విలువైన హెల్త్‌కార్డులు అందిస్తున్నామని తెలిపారు. త్వరలోనే సొసైటీలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. చేనేత ఉత్పత్తులపై 5శాతం జీఎస్టీ విధించిన దుర్మార్గ ప్రధాని మోదీ అని విమర్శించారు. మోదీ దేశాన్ని అమ్ముతున్నారని, కేసీఆర్‌ ప్రభుత్వ సంస్థలను కాపాడుతున్నారన్నారు. 75ఏళ్లలో ఏ ప్రఽధానీ చేయని తప్పులు మోదీ చేశారన్నారు. చేనేత వస్ర్తాలను ధరిస్తామని మంత్రి ప్రతిజ్ఞ చేయించారు. పద్మశాలీ నేతన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఓయూలో అభివృద్ధి

హైదరాబాద్‌ సిటీ: విద్యా శాఖకు కేటాయించిన నిధులకు అదనంగా హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో రూ.40.75 కోట్లు ఇచ్చినట్లు మునిసిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించిన ఉస్మానియా విద్యార్థులు, అధ్యాపకుల పట్ల తమకు గౌరవం ఉందని చెప్పారు. నిజాం కాలేజీ ఆవరణలో బాలుర నూతన హాస్టల్‌, తరగతి గదుల నిర్మాణానికి మంత్రులు మహమూద్‌ ఆలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్‌తో కలిసి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పేద విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించేందుకు చేపట్టిన ఈ నిర్మాణాలను 15 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. నిజాం కాలేజీకి గొప్ప పేరు ఉందని, నిజాం కాలేజీలో చదువుకున్నందుకు తనకు చాలా గర్వంగా ఉంటుందన్నారు. ఓయూ విద్యార్థులతో పాటు పక్కనే ఉన్న మాణికేశ్వర్‌ నగర్‌ బస్తీ వాసుల కోసం కొత్త ఆస్పత్రి భవనం నిర్మిస్తామని తెలిపారు. ఓయూలో రూ.144 కోట్లతో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఓయూ ఎన్‌సీసీ నుంచి అడిక్‌మెట్‌ రోడ్డు వరకు నూతన రహదారి నిర్మాణానికి రూ.16.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ప్రాంతానికి రూపాయి కూడా ఇవ్వనన్న మాజీ సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి... పూర్వ విద్యార్థి అయినప్పటికీ నిజాం కాలేజీకీ నిధులు ఇవ్వలేదని విమర్శించారు. మనిద్దరం చదివినా కాలేజీ ఒకటేనని, ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా నిధులు ఇవ్వలేదన్నారు.

Updated Date - 2023-08-13T02:44:10+05:30 IST