MLA Mynampalli : నన్ను టచ్‌ చేస్తే ఊర్కోను

ABN , First Publish Date - 2023-08-23T03:45:03+05:30 IST

‘మెదక్‌ నియోజకవర్గం నాకు రాజకీయ భిక్ష పెట్టింది. మల్కాజ్‌గిరి ప్రజలు ఊహించని విధంగా నన్ను ఆదరించారు. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వెళ్లిన తర్వాత ఈ రెండు నియోజకవర్గాల ప్రజలతో మాట్లాడి నా తదుపరి కార్యాచరణ ప్రకటిస్తా’ అని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి ..

 MLA Mynampalli : నన్ను టచ్‌ చేస్తే ఊర్కోను

స్వయంకృషితో పైకి వచ్చిన వాడిని.. దేనికీ నేను భయపడను

తిరుమలలో మైనంపల్లి వ్యాఖ్యలు

నేడు హైదరాబాద్‌కు రానున్న ఎమ్మెల్యే

ఆయన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ నిరసనలు

సస్పెన్షన్‌కు రంగం సిద్ధం చేస్తున్న పార్టీ

నియోజకవర్గంలో కొత్త పేర్ల పరిశీలన

మల్కాజ్‌గిరి బీఆర్‌ఎ్‌సలో సస్పెన్స్‌ థ్రిల్లర్‌

తిరుమల/ హైదరాబాద్‌/ హైదరాబాద్‌ సిటీ/ మల్కాజ్‌గిరి/ అల్వాల్‌, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): ‘మెదక్‌ నియోజకవర్గం నాకు రాజకీయ భిక్ష పెట్టింది. మల్కాజ్‌గిరి ప్రజలు ఊహించని విధంగా నన్ను ఆదరించారు. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వెళ్లిన తర్వాత ఈ రెండు నియోజకవర్గాల ప్రజలతో మాట్లాడి నా తదుపరి కార్యాచరణ ప్రకటిస్తా’ అని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ మంత్రి హరీ్‌షరావుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం బీఆర్‌ఎ్‌సలోనేగాక రాష్ట్ర రాజకీయాల్లోనూ తీవ్ర చర్చనీయాంశమైన నేపథ్యంలో, తిరిగి మంగళవారం మరోసారి శ్రీవారిని దర్శించుకుని ఆలయం ముందు మైనంపల్లి మీడియాతో మాట్లాడారు. ‘నిన్న నా వ్యక్తిగత అభిప్రాయాలను స్వామి ఆలయం ముందు వెల్లడించా. హైదరాబాద్‌ వెళ్లిన తర్వాత రెండురోజుల్లో మా నిర్ణయాలను తెలియజేస్తాం’ అని చెప్పారు. తన కుమారుడు ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నాడు కాబట్టే అతడిని ప్రోత్సహించాలని తాను నిర్ణయించుకున్నట్టు తెలిపారు. తన కుమారుడికి సీటు ఇస్తే బ్రహ్మాండంగా గెలిపించుకుని వస్తానని సీఎంకు విన్నవిస్తానన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీని కానీ, సీఎంను కానీ తాను ఏమీ అనలేదని స్పష్టం చేశారు. తాను హార్డవర్క్‌తో పైకి వచ్చినవాడినని, తెలంగాణ ఉద్యమ సమయంలోనూ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని పేర్కొన్నారు. తన జీవితంలో ఎవ్వరినీ ఇబ్బంది పెట్టలేదని, తనను ఎవరైనా ఇబ్బందిపెడితే మాత్రం ఊరుకోనని, వారిని తానూ ఇబ్బంది పెడతానని మైనంపల్లి హెచ్చరించారు. తాను దేనికీ భయపడని, కానీ తనను ఎవరైనా టచ్‌ చేస్తే ఊరుకోనన్నారు. ప్రాణం పోయే వరకు సొంత కృషిపైనే ఆధారపడి ఉంటానన్నారు.

బీఆర్‌ఎస్‌ సీరియస్‌... వేటుకు నిర్ణయం!

మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై వేటు వేసేందుకు బీఆర్‌ఎ్‌సలో రంగం సిద్ధమవుతోంది. పార్టీలో కీలక నేతగా ఉన్న హరీ్‌షరావుపై మైనంపల్లి తీవ్ర విమర్శలు చేయటాన్ని కేటీఆర్‌, కవిత ఖండించారు. మైనంపల్లి వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు నిరసన తెలిపాయి. పార్టీ నుంచి ఆయనను సస్పెండ్‌ చేయాలనే డిమాండ్‌ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయనపై వేటుకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ సిద్ధమవుతున్నట్లు సమాచారం. మల్కాజ్‌గిరి నియోజకవర్గాన్ని ఎవరికి కేటాయించాలనే విషయంలో ఇప్పటికే బీఆర్‌ఎస్‌ పార్టీలో చర్చ మొదలైంది. మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి, దివంగత మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు, అల్వాల్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ శాంతి శ్రీనివా్‌సరెడ్డి పేర్లను అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని పలువురు ఇతర నేతలు కూడా పావులు కదుపుతున్నట్లు సమాచారం.

మైనంపల్లి పయనమెటు?

మైనంపల్లి హనుమంతరావు బుధవారం ఉదయం హైదరాబాద్‌కు తిరిగి వస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఆయన భవిష్యత్‌ కార్యాచరణ ఎలా ఉండనుంది అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. మెదక్‌ నుంచి తన కుమారుడిని బరిలో దింపాలని ఆయన భావిస్తున్నారు. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ టికెట్‌ లభించకపోవటంతోనే ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కాంగ్రెస్‌, బీజేపీ అగ్రనేతలతో మైనంపల్లి సంప్రదింపులు జరిపారని.. కాంగ్రెస్‌ నుంచి తండ్రీకొడుకులిద్దరికీ టికెట్లు ఖరారయ్యాయని ప్రచారం సాగుతోంది. మైనంపల్లి పార్టీ మారితే ఆయనతోపాటు స్థానిక కార్పొరేటర్లూ వెళ్తారని అంటున్నారు. మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని ఆరుగురు బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లతోపాటు.. ఉప్పల్‌ నియోజకవర్గానికి చెందిన ఓ కార్పొరేటర్‌ కూడా మైనంపల్లికి అత్యంత సన్నిహితంగా ఉంటారు. ఈ క్రమంలో ఆయన తీసుకునే నిర్ణయానికి వారిలో ఎందరు కట్టుబడి ఉంటారన్నది తేలాల్సి ఉంది. హరీ్‌షరావుపై మైనంపల్లి ఆ స్థాయిలో వ్యక్తిగత విమర్శలు చేయకుండా ఉండాల్సిందని కార్పొరేటర్ల మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం. వివాదం సద్దుమణిగి మైనంపల్లి బీఆర్‌ఎ్‌సలో కొనసాగే అవకాశమూ లేకపోలేదని ఆయన ముఖ్య అనుచరుడొకరు తెలిపారు. మరోవైపు, ఎమ్మెల్యే వ్యాఖ్యల నేపథ్యంలో మల్కాజిగిరి బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణుల్లో ఆయోమయం నెలకొంది. అయినప్పటికీ, ఆయనకు పార్టీ టికెట్‌ కేటాయించడంతో సోమవారం సాయంత్రం పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకొన్నారు. పార్టీలకు అతీతంగా బలమైన క్యాడర్‌ మైనంపల్లికి ఉంది. ఆయన ఏ నిర్ణయం తీసుకున్న ఆయన వెంటే ఉంటామని కార్యకర్తలు పేర్కొనడం గమనార్హం. మైనంపల్లి తన కార్యాచరణను ప్రకటించేంతవరకు మల్కాజ్‌గిరి బీఆర్‌ఎ్‌సలో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

Updated Date - 2023-08-23T05:15:53+05:30 IST