Manda Krishna Madiga: దొరల పాలన పోయి, పటేళ్ల పాలన వచ్చినట్లు కావద్దు
ABN , Publish Date - Dec 14 , 2023 | 09:06 AM
తెలంగాణ ప్రజలు ఆకలినైన భరిస్తారు కానీ, ఆత్మగౌరవం మీద దెబ్బ కొడతామంటే సహించరు.. అందుకే నియంతృత్వం
- ప్రజాస్వామ్య పాలన, సామాజిక న్యాయం అమలు జరగాలి
- మంద కృష్ణ మాదిగ
పంజాగుట్ట(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రజలు ఆకలినైన భరిస్తారు కానీ, ఆత్మగౌరవం మీద దెబ్బ కొడతామంటే సహించరు.. అందుకే నియంతృత్వం, అహంకారం, కుటుంబ పాలన నుంచి విముక్తి కోసమే బీఆర్‌ఎస్ పార్టీని, కేసీఆర్ ప్రభుతాన్ని ప్రజలు ఓడించారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ(Manda Krishna Madiga) ఆరోపించారు. సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా పరిపాలన ఉన్నంత కాలం ఈ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి అండదండలు ఉంటాయని అన్నారు. రిజర్వేషన్లు పెంచేంత వరకు మెగా డీఎస్సీ, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల నుంచే చేయూత, దివ్యాంగులకు పెంచిన పింఛన్లు అందించాలని కోరారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన, సామాజిక న్యాయం అమలు జరగాలన్నారు. నియంతృత్వ పాలన స్థానంలో కాంగ్రెస్ పాలన వచ్చిందని, అయితే, దొరల పాలన పోయి పటేళ్ల పాలన వచ్చినట్లు కావద్దని సూచిస్తున్నామని అన్నారు. కేసీఆర్ ప్రశ్నించే వారిని, విమర్శించే వారిని, నిలదీసిన వారిని శత్రువులుగా చూశారని, అందులో భాగంగానే తనను, రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కోదండరాంను జైలులో పెట్టారని అన్నారు. ప్రజలు ఈ నియంతృత్వ చర్యలు సహించలేకపోయారని ఆయన అన్నారు. ఈ సమావేశంలో ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు సోమశేఖర్ మాదిగ, ఎంఎంఎస్ రాష్ట్ర నాయకుడు జేపీ లత మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల్ల ఉపేందర్ మాదిగ, ఆయా సంఘాల నాయకులు కొమ్ము శేఖర్ మాదిగ, రాజు మాదిగ, నర్సింహ మాదిగ, డప్పు మల్లికార్జున్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.