‘మార్గదర్శి’ ఆస్తులు అటాచ్‌

ABN , First Publish Date - 2023-05-30T04:57:34+05:30 IST

మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ సంస్థకు చెందిన ఆస్తులను జగన్‌ ప్రభుత్వం సీఐడీ ద్వారా అటాచ్‌ చేయించింది. మార్గదర్శికి సంబంధించిన

‘మార్గదర్శి’ ఆస్తులు అటాచ్‌
మార్గదర్శి ఆస్తులు అటాచ్‌ చేస్తూ ఏపీ సర్కార్‌ ఇచ్చిన జీవో

రూ.793 కోట్లకు పైగా జప్తు.. ఏపీ హోంశాఖ ఉత్తర్వులు

డిపాజిటర్ల సొమ్ము పరిరక్షణ కోసమే నిర్ణయం: సీఐడీ

అమరావతి, మే 29(ఆంధ్రజ్యోతి): మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ సంస్థకు చెందిన ఆస్తులను జగన్‌ ప్రభుత్వం సీఐడీ ద్వారా అటాచ్‌ చేయించింది. మార్గదర్శికి సంబంధించిన రూ.793.50కోట్ల విలువైన చరాస్తులను అటాచ్‌ చేస్తున్నట్లు ఏపీ హోంశాఖ వెల్లడించింది. ఈ కేసు తేలేవరకూ ఎటువంటి క్రయవిక్రయాలు జరిపేందుకు అవకాశం లేకుండా బ్రేకులేసింది. మార్గదర్శిలో చైర్మన్‌, ఎండీ, ఫోర్‌మెన్‌, ఆడిటర్లు కుట్రకు పాల్పడినట్టు సీఐడీ తెలిపింది. చిట్స్‌ద్వారా మార్గదర్శి సేకరించిన సొమ్మును హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ ఆఫీస్‌ ద్వారా మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినట్లు వివరించింది. ఆంధ్రప్రదేశ్‌లో 1989 చిట్స్‌ గ్రూపులు, తెలంగాణలో 2,316 చిట్స్‌ గ్రూపులు క్రియాశీలకంగా ఉన్నాయని తెలిపిన సీఐడీ, ఖాతాదారులకు వెంటనే డబ్బులు చెల్లించే పరిస్థితుల్లో సంస్థ లేదని తెలిపింది. చందాదారుల ప్రయోజనాలు రక్షించేందుకే అటాచ్‌మెంట్‌ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మార్గదర్శిలో నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ కేసులు నమోదు చేసిన సీఐడీ, రాష్ట్ర వ్యాప్తంగా ఆ సంస్థ కార్యాలయాలపై పలుమార్లు సోదాలు చేపట్టింది.

అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకూ చేపట్టిన సోదాల్లో పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న సీఐడీ అధికారులు... మార్గదర్శి మేనేజర్లను అరెస్టు చేశారు. ఐపీసీ 120(బి), 409, 420, 477(ఏ), రెడ్‌ విత్‌ 34కింద ఏడు ఎఫ్‌ఐఆర్లు నమోదు చేసిన దర్యాప్తు సంస్థ....ఏపీ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ డిపాజిటర్స్‌ ఇన్‌ పైనాన్సియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ 1999లో సెక్షన్‌ 5తోపాటు చిట్‌ ఫండ్‌ యాక్ట్‌ 1982లోని 76,79సెక్టన్ల ప్రకారం దర్యాప్తు చేస్తున్నట్లు సీఐడీ గతంలో తెలిపింది. మార్గదర్శి చైర్మన్‌ రామోజీ రావు, ఎండీ శైలజా కిరణ్‌ను నిందితులుగా చేర్చి గత నెలలో హైదరాబాద్‌లో ప్రశ్నించి స్టేట్‌ మెంట్స్‌ రికార్డు చేసింది. తాజాగా ఆస్తుల అటాచ్‌మెంట్‌ నిర్ణయం తీసుకుంది. సోదాల సమయంలో తమకు లభించిన ‘రశీదు’లు నిబంధనల అతిక్రమణ జరిగిందనడానికి కీలక ఆధారాలంటూ సీఐడీ ఏడీజీ సంజయ్‌ తెలిపారు.

Updated Date - 2023-05-30T04:57:34+05:30 IST