KTR: పట్టణాల అభివృద్ధికి నిధులివ్వండి

ABN , First Publish Date - 2023-01-09T02:33:31+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధికి నిధులివ్వాలని, తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నానికి తోడ్పాటునందించాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

KTR: పట్టణాల అభివృద్ధికి నిధులివ్వండి

ప్యాకేజీ అయినా ప్రకటించండి

తెలంగాణ ప్రభుత్వ కృషికి

తోడ్పాటు అందించండి

బడ్జెట్లో రూ.9838 కోట్లు ఇవ్వండి

రాష్ట్రంపై వివక్షతో అదనపు నిధులు కేటాయించడం లేదు

కేంద్రం సహకరించపోయినా అభివృద్ధి చేస్తున్నాం

కేంద్రానికి మంత్రి కేటీఆర్‌ లేఖ

హైదరాబాద్‌, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధికి నిధులివ్వాలని, తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నానికి తోడ్పాటునందించాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకోసం వచ్చే కేంద్ర బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించాలన్నారు. ప్రత్యేక నిధులైనా ఇవ్వాలని, లేదంటే హైదరాబాద్‌, వరంగల్‌ లాంటి పట్టణాలకు ప్రత్యేక ప్యాకేజీ అయినా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్‌ లేఖ రాశారు. తెలంగాణపై వివక్షతో కేంద్రంలోని బీజేపీ సర్కారు అదనంగా ఒక్కరూపాయి కూడా ఇవ్వడంలేదని ఆరోపించారు. కేంద్రం సహకరించకపోయినా తాము అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్‌ దూరదృష్టితో చేపట్టిన కార్యక్రమాల ద్వారా పట్టణాలన్నీ సమగ్రంగా అభివృద్ధి చెందుతున్నాయని, కేంద్రం ఇస్తున్న అవార్డులు, రివార్డులే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఆర్‌డీపీ)లో భాగంగా హైదరాబాద్‌లో చేపట్టిన స్కైవాక్‌, ఫ్లైఓవర్లు, జంక్షన్‌ల అభివృద్ధి మొదటి దశ పూర్తయిందని, ఈ భారీ కార్యక్రమానికి జీహెచ్‌ఎంసీ బాండ్లు, రుణాల రూపాల్లో డబ్బులను సమకూర్చుకుంటోందని తెలిపారు. కానీ, ఎస్‌ఆర్‌డీపీకి కేంద్రం నుంచి ఇప్పటి వరకు ప్రత్యేకంగా ఒక్క రూపాయి కూడా అందలేదని, రెండో దశకైనా భారీగా నిధులు ఇవ్వాలని కోరారు.

ఈ బడ్జెట్‌లోనైనా పరిశీలించండి..

మురుగునీటిని సంపూర్ణంగా శుద్ధి చేయాలన్న ప్రణాళికలో భాగంగా రూ.4961 కోట్ల అంచనా వ్యయంతో 1591 ఎంఎల్‌డీ సామర్థ్యంతో 41 ఎస్‌టీపీల నిర్మాణం, 2232 కిలోమీటర్ల మేర భారీ మురుగునీటి సరాఫరా నెట్‌వర్క్‌ను తమ ప్రభుత్వం రూ.3722 కోట్లతో నిర్మిస్తుందని పేర్కొన్నారు. ఈ రెండు ప్రాజెక్టులకు అవసరయ్యే రూ.8684 కోట్ల వ్యయంలో కనీసం మూడో వంతు (రూ.2894కోట్లు) స్వచ్ఛభారత్‌ మిషన్‌ లక్ష్యానికి అనుగుణంగా కేంద్రం భరించాలని కోరారు. వార్షిక ప్రణాళికలో భాగంగా హైదరాబాద్‌లో వరదలను అరికట్టేందుకు చేపట్టిన స్ర్టాటజిక్‌ నాలా డెవల్‌పమెంట్‌ కోసం గతంలో కోరిన రూ.240 కోట్లు ఇచ్చే అంశంపై ఈ బడ్జెట్‌లోనైనా పరిశీలించాలన్నారు. నగరంలో పారిశుధ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు రూ.400 కోట్ల మేర స్వచ్ఛ్‌ భారత్‌ మిషన్‌ నిధులను బడ్జెట్‌లో కేటాయించాన్నారు. మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌, ఈస్ట్‌ వెస్ట్‌ ఎక్స్‌ప్రె్‌సవే (రూ.11500 కోట్లు), ఎస్‌ఆర్‌డీపీ రెండోదశ (రూ.14వేల కోట్లు), డెవల్‌పమెంట్‌ ఆఫ్‌ ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణం- స్కై వేల నిర్మాణానికి (రూ.9,000 కోట్లు) అవసరమయ్యే రూ.34,500 కోట్లలో కనీసం పది శాతంగా రూ.3,450 కోట్లను ఈ బడ్జెట్లో కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. నగరంలో ప్రధాన రోడ్లపై భారీ ట్రాఫిక్‌ను తగ్గించేందుకు రూ.2400 కోట్లతో చేపట్టే 104 లింక్‌ రోడ్ల నిర్మాణ వ్యయంలో మూడోవంతుగా రూ.800 కోట్లను కేంద్ర ప్రభుత్వం భరించాలన్నారు. తెలంగాణ సానిటేషన్‌ హబ్‌ కోసం రూ.100 కోట్ల సీడ్‌ ఫండింగ్‌ ఇవ్వాలని, జీహెచ్‌ఎంసీ మూడో విడతగా చేపట్టిన మున్సిపల్‌ బాండ్లకు కేంద్రం నుంచి రావాల్సిన ప్రోత్సాహకాలను విడుదల చేయాలని, జాతీయ రహదారి-65పై ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన డీపీఆర్‌ సిద్థంగా ఉందని, దీనికి అయ్యే రూ.500 కోట్ల వ్యయాన్ని వచ్చే కేంద్ర బడ్జెట్లో కేటాయించాలని కోరారు.

దేశ ఆర్థిక ప్రగతికి చోదక శక్తిగా..

తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక ప్రగతిని సాధిస్తూ పన్నుల రూపంలో దేశ ఆర్థిక ప్రగతికి చోదక శక్తిగా ఉందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఎదుగుతున్న రాష్ట్రానికి మరింత మద్దతునందిస్తే.. దేశ ప్రగతి మరింత వేగవంతమవుతుందన్నారు. అభివృద్ధిలో ముందుండే రాష్ట్రాలను ప్రోత్సహించి కేంద్ర ప్రభుత్వం తన సమాఖ్య స్ఫూర్తిని చాటుకోవాలన్నారు. రాష్ట్రంలో చేపట్టే అభివృద్ధి పనుల కోసం కేంద్రం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో రూ.9838 కోట్లు కేటాయించాలని కేటీఆర్‌ కోరారు. ఇందులో.. హైదరాబాద్‌ మెట్రో రైలుకు అనుసంధానంగా ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ మెట్రో ప్రాజెక్టును తలపెట్టామని, రూ.6,250 కోట్లతో 31 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు వెంటనే సూత్రప్రాయ అంగీకారం తెలపడంతోపాటు ఆర్థికంగా మద్దతు ఇచ్చే విషయాన్ని కేంద్రం పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా మెట్రో రైలు కోసం కేంద్రం గతంలో ప్రకటించిన వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌లోని రూ.254 కోట్ల బకాయి విడుదల చేయాలన్నారు. నగరంలో 20 కిలోమీటర్ల మేర నిర్మించే మాస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ కోసం దాదాపు రూ.3050 కోట్లు ఖర్చవుతుందన్నారు. ఇందులో 15 శాతం మూలధన పెట్టుబడిగా రూ.450 కోట్లను కేంద్రం కేటాయించాలన్నారు. ఇక హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో చేపట్టిన సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, బయోమైనింగ్‌ వంటి ప్రాజెక్టుల కోసం రూ.3,777 కోట్లు ఖర్చవుతుందని, ఇందులో కనీసం 20 శాతంగా రూ.750 కోట్లను ఇవ్వాలన్నారు.

Updated Date - 2023-01-09T02:33:32+05:30 IST