YS Sharmila: చంచల్‌గూడ జైలు నుంచి షర్మిలకు విముక్తి.. బెయిలొచ్చింది కానీ..

ABN , First Publish Date - 2023-04-25T13:34:28+05:30 IST

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు బెయిల్ (YS Sharmila Bail) మంజూరైంది. నాంపల్లి కోర్టు (Nampally Court) ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.30 వేలు, ఇద్దరి పూచీకత్తుతో..

YS Sharmila: చంచల్‌గూడ జైలు నుంచి షర్మిలకు విముక్తి.. బెయిలొచ్చింది కానీ..

హైదరాబాద్: వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు బెయిల్ (YS Sharmila Bail) మంజూరైంది. నాంపల్లి కోర్టు (Nampally Court) ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.30 వేలు, ఇద్దరి పూచీకత్తుతో షర్మిలకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి అని కోర్టు స్పష్టం చేసింది. పోలీసులపై దాడి కేసులో షర్మిల (Sharmila vs TS Police) సోమవారం నాడు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. నాంపల్లి కోర్టులో ఇరు పక్షాల వాదనలు నడిచాయి. షర్మిలను పోలీసులు అక్రమంగా అరెస్ట్‌ చేశారని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. షర్మిలపై నమోదు చేసిన సెక్షన్లన్నీ 6 నెలలు, మూడేళ్లలోపు జైలు శిక్ష పడేవేనని షర్మిల లాయర్‌ చెప్పారు.

2sharmilala.jpeg

హైకోర్టు నిబంధనలను పోలీసులు పట్టించుకోవట్లేదని షర్మిల లాయర్‌ వాదించారు. పోలీసు విధులకు షర్మిల ఆటంకం కలిగించారని పోలీస్‌ తరపు లాయర్‌ వాదించారు. షర్మిలపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని, షర్మిలకు బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టుకు విన్నవించారు. ఈ కేసులో ఇంకా సాక్షులను ప్రశ్నించాల్సి ఉందని పోలీసులు నాంపల్లి కోర్టుకు వెల్లడించారు. ఇరు పక్షాల వాదనలు విన్న నాంపల్లి కోర్టు షర్మిలకు బెయిల్ ఇచ్చేందుకే మొగ్గు చూపడం గమనార్హం.

ys-sharmila-bail.jpg

అసలేం జరిగిందంటే..

టీఎస్‌‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో సిట్‌ అధికారులను కలిసేందుకు వెళ్తున్న వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన ఆమె.. ఓ ఎస్సై స్థాయి అధికారిపై చేయిచేసుకోగా, మరో మహిళా కానిస్టేబుల్‌ను చేత్తో నెట్టేశారు. ఓ కానిస్టేబుల్‌ గాయాలపాలవడానికి కారణమయ్యారు. చివరకు షర్మిలను అరెస్టు చేసిన పోలీసులు.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గాంధీలో వైద్య పరీక్షల అనంతరం ఆమెను కోర్టులో హాజరుపర్చగా.. వచ్చే నెల 8వ తేదీ వరకు కోర్టు రిమాండ్‌ విధించింది. దీంతో ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరోవైపు.. షర్మిలను పరామర్శించేందుకు పీఎస్‌కు వెళ్లిన విజయలక్ష్మిని పోలీసులు అడ్డుకున్నారు. ఇలా ఉండగా వైఎస్‌ విజయలక్ష్మ్డి కూడా విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేశారా? లేదా? అన్న దానిపై పోలీసులు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. సోమవారం ఉదయం రాత్రి వరకు ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

sharmila.jpg

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌ అధికారులకు వినతిపత్రం ఇవ్వాలని షర్మిల భావించారు. ఈ మేరకు సోమవారం ఉదయం 10.30 గంటలకు లోట్‌సపాండ్‌లోని పార్టీ కార్యాలయం నుంచి షర్మిల బయలుదేరుతుండగా పోలీసులు ఆమెను చుట్టుముట్టారు. బయటకు వెళ్లేందుకు అనుమతి లేదంటూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. షర్మిల కారుకు ఎదురుగా నిల్చొని ముందుకు కదలనివ్వలేదు. దీంతో షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కారు నుంచి దిగి నడక ప్రారంభించారు. కొందరు మహిళా పోలీసులు షర్మిలను అడ్డుకోగా, ఓ కానిస్టేబుల్‌ను షర్మిల తోసివేసే ప్రయత్నం చేశారు. తనను హౌస్‌ అరెస్ట్‌ చేసేందుకు పోలీసులకు ఏం అధికారం ఉందని నిలదీశారు. తాను ధర్నాకు, నిరసనకు వెళ్లడం లేదని, వినతిపత్రం ఇచ్చి వస్తానని పోలీసులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

sharmila1.jpg

సొంత పనుల మీద బయటకు కూడా వెళ్లనివ్వరా? అంటూ వాగ్వాదానికి దిగారు. ఓ పార్టీ అధ్యక్షురాలి పట్ల మసులుకునే విధానం ఇదేనా అంటూ ప్రశ్నించారు. తనను అడ్డుకునేందుకు పురుష కానిస్టేబుళ్లు ముందుకు రావడంపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం కారులో ఎక్కుతుండగా అడ్డుకోబోయిన ఎస్సై రవీందర్‌పై ఆమె చేయి చేసుకున్నారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అతడిని తొక్కించేయి.. అంటూ డ్రైవర్‌ను ఆదేశించారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్‌ అరికాలి పైనుంచి కారు టైరు వెళ్లడంతో అతడికి గాయమైంది. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. షర్మిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. సోమవారం నాడు షర్మిలకు రిమాండ్ విధించిన కోర్టు, షర్మిల్ బెయిల్‌ పిటిషన్ దాఖలు చేయడంతో మంగళవారం నాడు వాదనల అనంతరం నాంపల్లి కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది.

Updated Date - 2023-04-25T13:34:28+05:30 IST