Gouravelli Project : వద్దంటే పనులు చేపట్టడమేంటి?

ABN , First Publish Date - 2023-08-31T02:25:02+05:30 IST

గౌరవెల్లి ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని ఆదేశించినా ప్రభుత్వం పనులు కొనసాగిస్తుండడంపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) కన్నెర్ర జేసింది. రాష్ట్ర ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని కేంద్ర పర్యావరణ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ

Gouravelli Project : వద్దంటే పనులు చేపట్టడమేంటి?

రాష్ట్ర ప్రభుత్వంపై చర్యలు తీసుకోండి

‘గౌరవెల్లి’పై కేంద్ర పర్యావరణ శాఖకు

జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశం

న్యూఢిల్లీ, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): గౌరవెల్లి ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని ఆదేశించినా ప్రభుత్వం పనులు కొనసాగిస్తుండడంపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) కన్నెర్ర జేసింది. రాష్ట్ర ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని కేంద్ర పర్యావరణ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు చేపడుతున్నారంటూ పలువురు స్థానికులు పిటిషన్లు దాఖలు చేయగా... అనుమతులు పొందే వరకు పనులు చేపట్టరాదని గతంలో ఎన్జీటీ తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వం పనులను సాగిస్తోందంటూ పలువురు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై ఎన్జీటీ న్యాయ సభ్యురాలు జస్టిస్‌ పుష్పా సత్యనారాయణ, సభ్య నిపుణుడు కే సత్యగోపాల్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది శ్రవణ్‌ కుమార్‌ వాదిస్తూ.. ప్రభుత్వం పనులను పునఃప్రారంభించిందని, దానికి ఆధారాలుగా ఫోటోలు ఉన్నాయని చూపించారు. ఈ నెల 18 నుంచి 6 రోజుల పాటు రిజర్వాయర్‌లో దాదాపు 0.6 టీఎంసీల నీటిని నిల్వ చేశారని ట్రైబ్యునల్‌ దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ రామచందర్‌రావు వాదిస్తూ... పనులు చేయడం లేదని స్పష్టం చేశారు. అయితే, పనులు జరుగుతున్నట్లు ఫోటోల్లో స్పష్టంగా కనిపిస్తోంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర పర్యావరణ శాఖకు ధర్మాసనం అదేశించింది. ప్రాజెక్టు ప్రాంతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని గోదావరి బోర్డుకు ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - 2023-08-31T02:25:02+05:30 IST