రెవెన్యూ ముఖ్య కార్యదర్శిగా నవీన్‌ మిత్తల్‌

ABN , First Publish Date - 2023-02-01T03:31:00+05:30 IST

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో కలెక్టర్ల బదిలీలు జరిగాయి. ఒకేసారి 15 మందిని ప్రభుత్వం బదిలీ చేసింది. సాంకేతిక విద్య, కాలేజియేట్‌ విద్య కమిషనర్‌,

రెవెన్యూ ముఖ్య కార్యదర్శిగా నవీన్‌ మిత్తల్‌

పెద్ద ఎత్తున ఐఏఎస్‌ అధికారుల బదిలీలు

ఇద్దరు అదనపు కలెక్టర్లకు కలెక్టర్లుగా పోస్టింగ్‌

అమోయ్‌కుమార్‌, ఆర్‌వీ కర్ణన్‌కు రెండేసి జిల్లాల బాధ్యతలు

నిఖిల, ముషారఫ్‌ అలీ ఫారూఖీలకు దక్కని పోస్టింగులు

హైదరాబాద్‌, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో కలెక్టర్ల బదిలీలు జరిగాయి. ఒకేసారి 15 మందిని ప్రభుత్వం బదిలీ చేసింది. సాంకేతిక విద్య, కాలేజియేట్‌ విద్య కమిషనర్‌, ఇంటర్మీడియట్‌ బోర్డు సెక్రటరీ నవీన్‌ మిత్తల్‌ను బదిలీ చేసింది. ఆయనకు కీలకమైన రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా పోస్టింగ్‌ ఇచ్చింది. చాలా కాలంగా ఈ పోస్టు ఖాళీగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిన సోమేశ్‌కుమార్‌ ఇదివరకు రెవెన్యూ శాఖను పర్యవేక్షించేవారు. ఇప్పుడు నవీన్‌ మిత్తల్‌ను నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. రంగారెడ్డి కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌ను మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ హైదరాబాద్‌ కలెక్టర్‌గా మరోసారి అదనపు బాధ్యతలు అప్పగించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ బాధ్యతలు నిర్వహించాలని ఆదేశించింది. కరీంనగర్‌ కలెక్టర్‌ ఆర్‌వీ కర్నన్‌కు కూడా జగిత్యాల కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. వికారాబాద్‌ కలెక్టర్‌ కే నిఖిల, నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీలను బదిలీ చేసినప్పటికీ ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. సంగారెడ్డి అదనపు కలెక్టర్‌ రాజర్షి షాను మెదక్‌ కలెక్టర్‌గా, మహబూబ్‌నగర్‌ అదనపు కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ను వనపర్తి కలెక్టర్‌గా నియమించింది. ఉట్నూరు ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌ కర్నాటి వరుణ్‌రెడ్డిని నిర్మల్‌ కలెక్టర్‌గా నియమించింది.

Updated Date - 2023-02-01T03:31:01+05:30 IST