రాష్ట్రానికి కొత్త వైద్య కళాశాలలు కష్టమే!
ABN , First Publish Date - 2023-08-31T03:59:52+05:30 IST
కొవిడ్ కల్లోలం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాకో ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
10 లక్షల జనాభాకు.. 100 సీట్లే
తాజా నిబంధనల్లో ఎన్‌ఎంసీ స్పష్టం
హైదరాబాద్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): కొవిడ్ కల్లోలం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాకో ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే 25జిల్లాల్లో మెడికల్ కాలేజీలున్నాయి. మరో ఎనిమిది జిల్లాల్లోనూ ఇవి ఏర్పాటైతే ఆ లక్ష్యం నెరవేరుతుంది. అంతేకాదు.. అన్ని జిల్లాల్లో వైద్య కళాశాలలున్న రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందుతుంది. అయితే.. జాతీయ వైద్య కమిషన్(ఎన్‌ఎంసీ) ఈ నెల 16న విడుదల చేసిన తాజా నిబంధనలు.. రాష్ట్ర సర్కారు లక్ష్యంపై నీళ్లుజల్లుతున్నాయి. ఆ నిబంధనల ప్రకారం.. రాష్ట్రానికి ఇక కొత్త వైద్య కళాశాల వచ్చే అవకాశమే లేదు..!
ఏమిటా నిబంధనలు?
ఎన్‌ఎంసీ తన తాజా నిబంధనల్లో జనాభా ప్రాతిపదికన వైద్య సీట్ల సంఖ్యకు ముడిపెట్టింది. ప్రతీ 10 లక్షల జనాభాకు 100 సీట్లతో కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతినిస్తామని స్పష్టం చేసింది. ముందు నుంచి జనాభాను నియంత్రిస్తూ వస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు ఈ నిర్ణయం వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రస్తుతం తెలంగాణ జనాభా 3,51,93,978. ప్రభుత్వ, ప్రైవేటు కలిపి మొత్తం 56 మెడికల్ కాలేజీలున్నాయి. వీటిల్లో 8,340 సీట్లున్నాయి. అంటే.. తెలంగాణలో ప్రతీ పది లక్షల జనాభాకు 234 ఎంబీబీఎస్ సీట్లున్నట్లు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం దేశంలో ప్రతీ పది లక్షలకు అత్యధిక ఎంబీబీఎస్ సీట్లున్న రాష్ట్రంగా రికార్డులకెక్కింది. జాతీయ వైద్య కమిషన్ తాజా నిబంధనల మేరకు మన దగ్గర 2.5 రెట్ల మేర ఎక్కువ ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ఒకవేళ కొత్త నిబంధనలను ఎన్‌ఎంసీ కచ్చితంగా అమలు చేస్తే.. మన రాష్ట్రంలో 3,250 సీట్లు మాత్రమే ఉండాలి. కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అవకాశమే ఉండదని నిపుణులు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది కొత్తగా మరో 8 మెడికల్ కాలేజీలను ప్రారంభించేందుకు చేస్తున్న సన్నాహాలకు అడ్డంకిగా ఎన్‌ఎంసీ నిబంధనలున్నాయి. ప్రభుత్వం ఈ కాలేజీల్లో వందేసి సీట్లను ప్రతిపాదించింది. ఈ కాలేజీలు ఏర్పాటైతే.. రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో సీట్ల సంఖ్య 4,590కి చేరుతుంది. అంతేకాదు.. ప్రతిజిల్ల్లాలో మెడికల్ కాలేజీలున్న రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందుతుంది.
ఇప్పటికే కేరళ సర్కారు అభ్యంతరం
వైద్యవిద్యతో సహా ఆరోగ్య రంగంలో సమగ్ర మానవ వనరుల అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్య విద్య నిపుణులు అభిపాయ్రపడుతున్నారు. ఇందుకోసం అన్ని ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. ప్రాంతీయ అవసరాలను పరిగణలోకి తీసుకోకుండా ఎన్‌ఎంసీ ఏక పక్షంగా నిబంధనలు సరికాదంటున్నారు. ఇప్పటికే కేరళ రాష్ట్రం ఎన్‌ఎంసీ కొత్త నిబంధనపై అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఆ రాష్ట్రంలో కొత్తగా వయానాడ్, కాసర్‌గఢ్‌లలో కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. కొత్త నిబంధనలతో నూతన కళాశాలల ఏర్పాటుపై ఆందోళన వ్యక్తం చేస్తోంది.