Aaryajanani: వర్నిలో ఆర్యజననికి అనూహ్య స్పందన
ABN , First Publish Date - 2023-02-27T14:37:26+05:30 IST
వందలాది మంది మహిళలకు ఆర్యజనని బృందం విలువలైన సలహాలు, సూచనలిచ్చింది.
వర్ని: నిజామాబాద్ జిల్లా వర్ని ( Nizamabad, varni)లో గర్భిణులకు హైదరాబాద్ రామకృష్ణ మఠం (Hyderabad Ramakrishna Math) ఆర్యజనని (Aaryajanani) టీమ్ నిర్వహించిన వర్క్‌షాప్‌నకు అనూహ్య స్పందన లభించింది. కోటగిరి రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో మల్లారెడ్డి మెమోరియల్ స్కూల్‌లో నిర్వహించిన ఈ వర్క్ షాప్‌నకు వందలాది మంది మహిళలకు ఆర్యజనని బృందం విలువలైన సలహాలు, సూచనలిచ్చింది.
ఓ మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డకు రెండేళ్ళ వయసు వచ్చే వరకు అంటే 1,000 రోజుల వరకు గర్భిణులు పాటించవలసిన సూచనలను డాక్టర్ అంజలి వివరించారు. ప్రసవానికి ముందు యోగా, గాఢమైన విశ్రాంతి, శ్వాసించడం, ధ్యానం వంటివాటికి సంబంధించిన శక్తిమంతమైన చిట్కాలను తెలియజేశారు. బిడ్డను పోషించడం, చనుబాలు ఇవ్వడం, శిశువుకు పోషకాహారం గురించి సమగ్ర సమాచారం ఇచ్చారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా గ్రామీణ మహిళలకు అర్థమయ్యేలా ఆకట్టుకునేలా వివరించారు. గర్భిణులకు యోగా నిపుణురాలు దీప్తి యోగా, ప్రాణాయమంలో శిక్షణ ఇచ్చారు.
వారం వారం రామకృష్ణ మఠం ద్వారా నిర్వహించే ఆర్యజనని వర్క్‌షాపునకు హాజరుకావాలనుకునేవారు https://aaryajanani.org/ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 9603906906 వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా సంప్రదించవచ్చని ఆర్యజనని టీమ్ సభ్యులు మాధురి సముద్రాల, నారాయణరావు తెలిపారు. గర్భధారణ, మాతృత్వం గురించి ప్రయోజనకరమైన సమాచారాన్ని తెలుసుకునేందుకు నిపుణులతో మాట్లాడవచ్చునని, అనుభవజ్ఞులైన దంపతులు, తల్లులతో సంభాషించవచ్చునని ఆర్యజనని నిర్వాహకులు తెలిపారు.
ఆర్యజనని వర్క్‌షాప్‌నకు అనూహ్య స్పందన లభించడంపై ఆర్యజనని నిర్వాహకులు డాక్టర్ అనుపమా రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో ఆర్యజనని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు.
కార్యక్రమంలో మల్లారెడ్డి మెమోరియల్ స్కూల్ కరెస్పాండెంట్ జనార్ధన్, పాఠశాల సిబ్బందితో పాటు కోటగిరి రామకృష్ణ సేవా సమితి కన్వీనర్, వివేకానంద స్కూల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్, భైంసా వేదం స్కూల్ కరెస్పాండెంట్ శ్రీనివాసరెడ్డి దంపతులు పాల్గొన్నారు.