భూముల కబ్జాపై అధికారుల నజర్
ABN , First Publish Date - 2023-04-26T00:30:45+05:30 IST
నగర కార్పొరేషన్‌కు ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూములపై అధికారులు నజర్ పెట్టారు. సర్వే నెంబర్‌ల ఆధారంగా భూములను గుర్తిస్తున్నారు.
సర్వే నెంబర్‌ల ఆధారంగా భూముల వివరాలు సేకరిస్తున్న అధికారులు
సర్కారు భూముల పరిరక్షణకు ప్రయత్నాలు
నిజామాబాద్, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నగర కార్పొరేషన్‌కు ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూములపై అధికారులు నజర్ పెట్టారు. సర్వే నెంబర్‌ల ఆధారంగా భూములను గుర్తిస్తున్నారు. పభుత్వ అవసరాలకు, వివిధ సంఘాలకు కేటాయించేందుకు భూములు లేకపోవడంతో నగర కార్పొరేషన్ చుట్టూ ఉన్న రూరల్, మోపాల్, ఎడపల్లి, మాక్లూర్, డిచ్‌పల్లి మండలాల పరిదిలోని భూములను పరిశీలిస్తున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్, దేవాదాయ, అటవీశాఖలతో పాటు ఇతర భూ ముల వివరాలను పరిశీలిస్తూనే భూములను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
పెరిగిన భూముల విలువ
నిజామాబాద్ కార్పొరేషన్‌గా ఏర్పడిన తర్వాత భూ ముల విలువ భారీగా పెరిగాయి. శివారు కాలనీలను కార్పొరేషన్ పరిధిలో కలిపారు. కొన్ని గ్రామాలను కూడా కార్పొరేషన్‌లో విలీనం చేశారు. నిజామాబాద్ దక్షణ, ఉత్తర మండలాలతో పాటు మోపాల్, మాక్లూర్, నిజామాబాద్ రూరల్, ఎడపల్లి మండలాలకు చెందిన పలు గ్రామాలు కార్పొరేషన్ పరిధిలో విలీనమయ్యాయి. కార్పొరేషన్ ఏర్పడకముందు మున్సిపాలిటీగా ఉన్న సమయంలో ప్రభుత్వానికి చెందిన వందల ఎకరాల భూములు ఆయా గ్రామాల పరిధిలో ఉన్నాయి. రెవెన్యూ, దేవాదాయ, ఇరిగేషన్ శాఖల పరిధిలో ఎక్కువగా ఈ భూములు ఉండేవి. వీటితో పాటు అటవీశాఖ భూములు కూడా ఉన్నాయి. ఇవేకాకుండా వక్ఫ్ బోర్డ్, మత్స్యశాఖ, ఇండస్ర్టియల్ కార్పొరేషన్‌తో పాటు మరికొన్ని ప్రభుత్వశాఖల భూములు ఉన్నాయి. నగర కార్పొరేషన్ కావడం, వివిధ సంఘాలకు, పేదలకు భూముల పట్టాలు ఇవ్వడంతో ఎక్కువగా ప్రభుత్వ భూ ములు వారి చేతిల్లోకి వెళ్లాయి. ఇదే సమయంలో కొంతమంది భూములకు కబ్జాలకు పాల్పడడం వాటిని పేదల ముసుగులో పట్టాలు పొందడంతో ఎక్కువ శాతం అన్యాక్రాంతమయ్యాయి. భూములు ఎక్కువ మొత్తంలో చేతులు మారడంతో పాటు పదేళ్ల కింది నుంచి వివిధ వ్యక్తుల పేరుమీద రిజిస్ర్టేషన్‌లు జరిగాయి. అప్పుడున్న శాఖల అధికారుల పట్టించుకోకపోవడం, ఒత్తిళ్లకు లొంగిపోవడం, డబ్బులుచేతులు మారడం వల్ల విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయి.
ప్రభుత్వ అవసరాలకు లభించని స్థలాలు
రాష్ట్ర ప్రభుత్వం నగరం చుట్టుపక్కల ఫుడ్‌ప్రాసెసింగ్ జోన్‌లు, ఇతర శాఖల భవనాల నిర్మాణాలు, విద్యాసంస్థల ఏర్పాట్ల కోసం భూములను పరిశీలిస్తే కావాల్సినంత దొరకడం లేదు. కొన్ని సంస్థలతో 50 నుంచి 100 ఎకరాలు కావాల్సి ఉండడంతో నగర శివారులో అధికారులు పరిశీలించిన కొన్నిచోట్లనే ఆ భూములు ఉన్నాయి. కొన్నిచోట్ల రికార్డులో భూములున్నా వాస్తవంగా సైట్‌మీద లేవు. మల్కాపూర్, సారంగపూర్, డిచ్‌పల్లి మండలాలను మినహాయిస్తే ఇతర మండలాల్లో రెండు నుంచి పదేకరాలలోపు భూములు దొరకడంలేదు. రికార్డులలో ఉన్న భూములు వాస్తవంగా లేకపోవడంతో ఆయా శాఖల పరిధిలో భూములను పరిశీలిస్తున్నారు. గడిచిన ఐదేళ్ల కాలంలో ఈ భూమలు ఆక్రమణ ఎక్కువగా జరిగినట్లు అధికారులు గుర్తించారు. కొన్నిచోట్ల బినామీ పట్టాలు రావడం, మరికొన్నిచోట్ల గతంలో పట్టాదారులుగా ఉన్నట్లు పత్రాలను సృష్టించి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ భూముల వివరాలు సేకరించిన తర్వాత పూర్తిస్థాయిలో చర్యలు తీసుకునే అవ కాశం ఉన్నట్లు సమాచారం.