Amazon: ఏడేళ్లలో 16 వేల కోట్లు

ABN , First Publish Date - 2023-01-21T02:13:33+05:30 IST

హైదరాబాద్‌లోని మూడు ప్రాంతాల్లో డేటా సెంటర్లు ఏర్పాటు చేసిన అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌.. మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించింది.

Amazon: ఏడేళ్లలో   16 వేల కోట్లు

హైదరాబాద్‌లోని 3 డేటాసెంటర్లపై

అమెజాన్‌ అదనపు పెట్టుబడులు

విస్తరణ ప్రణాళికలు ప్రకటించిన సంస్థ

స్వాగతించిన మంత్రి కేటీఆర్‌

2030నాటికి మొత్తం పెట్టుబడులు

రూ.36 వేల కోట్లకు చేరిక

హైదరాబాద్‌, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని మూడు ప్రాంతాల్లో డేటా సెంటర్లు ఏర్పాటు చేసిన అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌.. మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించింది. నగర పరిసరాల్లోని చందన్‌వెల్లి, ఫ్యాబ్‌ సిటీ, ఫార్మాసిటీలో అమెజాన్‌ మూడు డేటా సెంటర్లు ఏర్పాటు చేసింది. వీటి మొదటి దశ పూర్తికాగా ఇప్పటికే వినియోగదారులకు పూర్తి స్థాయిలో క్లౌడ్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వచ్చే ఐదేళ్లలో వీటిపై రూ.20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు అమెజాన్‌ గతేడాది ప్రకటించింది. అయితే ఈ కేంద్రాలపై మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నామని హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో శుక్రవారం జరిగిన అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ ఎంపవర్‌ ఇండియా ఈవెంట్‌లో సంస్థ ప్రకటించింది. హైదరాబాద్‌లోని మూడు డేటా సెంటర్లలో 2030నాటికి అదనంగా మరో రూ.16వేల కోట్లు ఖర్చు చేస్తామని, దీంతో మొత్తం పెట్టుబడులు రూ.36వేల కోట్లకు చేరుతాయని సంస్థ వెల్లడించింది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మంత్రి కేటీఆర్‌ స్వాగతించారు.

అమెజాన్‌ తన నిర్ణయాన్ని ప్రకటించిన అనంతరం విదేశీ పర్యటనలో ఉన్న మంత్రి అమెజాన్‌ ప్రతినిధులతో వీడియా కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. డేటా సెంటర్లలో పెట్టుబడులను అమెజాన్‌ విస్తరిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలోకి వస్తున్న అతిపెద్ద ఎఫ్‌డీఐలలో ఇదొకటన్నారు. ఇ-గవర్నెన్స్‌, హెల్త్‌కేర్‌, పురపాలక కార్యకలాపాలను మెరుగుపరచడానికి అమెజాన్‌తో కలిసి తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ క్యాంప్‌సలతో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతోపాటు స్టార్ట్‌పలకు ప్రయోజనం కలుగుతుందని కేటీఆర్‌ అన్నారు. అమెజాన్‌ భారీ పెట్టుబడులతో డేటా సెంటర్‌ ప్రధాన కేంద్రంగా తెలంగాణ మారుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అమెజాన్‌ విస్తరణ ప్రణాళికలకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు.

Updated Date - 2023-01-21T02:13:34+05:30 IST