ఎన్నికల బరిలోకి మూడోతరం ఒవైసీ
ABN , First Publish Date - 2023-10-26T04:00:44+05:30 IST
ఒవైసీ కుటుంబం నుంచి ఈ ఎన్నికల్లో మూడో తరం రాబోతోంది.
చార్మినార్ నుంచి అక్బరుద్దీన్ కొడుకు నూరుద్దీన్!
అక్కడి నుంచి పోటీపై ఇంకా కొలిక్కిరాని చర్చలు
సీటు వదులుకోవడానికి ఇష్టపడని సిటింగ్ ఎమ్మెల్యే
హైదరాబాద్, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ఒవైసీ కుటుంబం నుంచి ఈ ఎన్నికల్లో మూడో తరం రాబోతోంది. ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ తన కుమారుడు డాక్టర్ నూరుద్దీన్ ఒవైసీని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పరిచయం చేయబోతున్నారు. అక్బర్ సోదరుడు, పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సైతం ఇందుకు అంగీకారం తెలపడంతో ఆయన పోటీ ఖాయమైంది. అయితే నియోజకవర్గంపై కొద్దిరోజులుగా జరుగుతున్న చర్చలు కొలిక్కిరాలేదు. నూరుద్దీన్‌ను చార్మినార్ స్థానం నుంచి బరిలోకి దింపాలని అక్బర్ నిర్ణయించగా.. సీటు వదులుకునేందుకు అక్కడి సిటింగ్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ అంగీకరించట్లేదని సమాచారం. అక్కణ్నుంచీ నుంచి తనను తప్పించాలని పార్టీ నిర్ణయిస్తే.. పక్కనే ఉన్న యాకుత్‌పుర సీటు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. యాకుత్‌పుర నుంచి ముంతాజ్ ఖాన్ వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తొలిసారి 1994లో ఎంబీటీనుంచి విజయం సాధించిన ఆయన.. ఎంఐఎంలో చేరాక మరో నాలుగుసార్లు అక్కడినుంచే శాసనసభకు ప్రాతినిథ్యం వహించారు. ప్రస్తుతం యాకుత్‌పుర ఎమ్మెల్యేగా ఉన్న అహ్మద్ పాషా ఖాద్రీ అనారోగ్య సమస్యలతో ఈ ఎన్నికల్లో పోటీచేయట్లేదు. అయి తే నాంపల్లిలో తీవ్రమైన పోటీ ఉన్నందున అక్కడి సిటింగ్ ఎమ్మెల్యే జాఫ ర్ హుసేన్‌ను యాకుత్‌పురకు మార్చి.. నాంపల్లిలో మాజీ మేయర్ మాజిద్ హుసేన్‌ను బరిలో నిలపాలని పార్టీ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చింది. ముంతాజ్‌ఖాన్‌కు యాకుత్‌పుర కేటాయిస్తే.. నాంపల్లి నుంచి జాఫర్ హుసేన్, మాజిద్ హుసేన్‌లో ఒక్కరికే అవకాశం ఉంటుంది. ఈ విషయమై అక్బరుద్దీన్ ఇప్పటికే ముంతాజ్ ఖాన్ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. యాకుత్‌పుర ఇస్తేనే చార్మినార్ వదులుకుంటానని ఆయన స్పష్టం చేస్తున్నట్లు తెలిసింది.
మూడు తరాలు..
1976లో తన తండ్రి అబ్దుల్ వాహెద్ ఒవైసీ మరణానంతరం ఏఐఎంఐఎం అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ 1962లో తొలిసారి పత్తర్‌గట్టి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొత్తం ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఆరుసార్లు హైదరాబాద్ ఎంపీగా గెలుపొందారు. 2004 నుంచి ఆయన పెద్ద కుమారుడు అసదుద్దీన్ ఒవైసీ ఎంపీగా కొనసాగుతుండగా.. మరో కుమారుడు అక్బరుద్దీన్ ఒవైసీ చంద్రాయణగుట్ట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మూడోతరం వారసుడిగా పరిచయం కాబోతున్న డాక్టర్ నూరుద్దీన్ ఒవైసీ కొన్నేళ్లుగా తన కుటుంబానికి చెందిన ‘సాలార్ ఏ మిల్లత్’ ఎడ్యుకేషనల్ ట్రస్టు ట్రస్టీగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.