ఎదగని వరి

ABN , First Publish Date - 2023-03-04T01:05:19+05:30 IST

ఆరుగాలం శ్రమించిన రైతుల రెక్కలకష్టం వృథా అవుతోంది. యాసంగి వరికి పెట్టుబడి పెట్టి ఆశగా ఎదురుచూస్తుండగా, పైరు ఎదగకుండానే కంకులు రావడంతో బావురుమంటున్నారు. నాటేసిన నెలకే జానెడు ఎత్తులో వరి పొలం ఈతకు వచ్చింది. అందులో కొన్ని కంకులు రాగా, మరికొన్ని పొట్టదశకు వచ్చాయి.

ఎదగని వరి

నకిలీ విత్తనాలతో భారీగా నష్టం8 నాటిన నెల రోజుల నుంచే ఈత

కొన్ని కంకులు ఈతకురాగా, మరికొన్ని పొట్టదశలో

మిర్యాలగూడ, మార్చి 3: ఆరుగాలం శ్రమించిన రైతుల రెక్కలకష్టం వృథా అవుతోంది. యాసంగి వరికి పెట్టుబడి పెట్టి ఆశగా ఎదురుచూస్తుండగా, పైరు ఎదగకుండానే కంకులు రావడంతో బావురుమంటున్నారు. నాటేసిన నెలకే జానెడు ఎత్తులో వరి పొలం ఈతకు వచ్చింది. అందులో కొన్ని కంకులు రాగా, మరికొన్ని పొట్టదశకు వచ్చాయి. చివరి వరికర్రలు ఈతకు వచ్చి ధాన్యం అయ్యేలోగా, ఇప్పటికే ఈతకు వచ్చిన కంకుల గింజ రాలిపోతుందని, సగానికి పైగా దిగుబడి దక్కకుండా పోతుందని, నకిలీ విత్తనాలతో నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ డివిజన్‌ వేములపల్లి మండలం సల్కునూరు గ్రామానికి చెందిన యువరైతు శ్రీనివాసాచారి తనకున్న ఏడెకాలకు తోడు మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నాడు. యాసంగిలో చింట్లు సన్నరకం ధాన్యం సాగుచేయాలని విత్తనాల కోసం గడ్డిపల్లి ప్రైవేట్‌ సీడ్‌ వ్యాపారిని సంప్రదించగా, తనవద్ద కేవలం సాయిపూజ రకం విత్తనాలు ఉన్నాయని వాటిని అంటగట్టాడు. సహజంగా మంచి వంగడాలైతే వరి 110 నుంచి 120 రోజుల్లో కోతకు రావాలి. విత్తనాల రకాలను బట్టి 2 నుంచి 2.5 అడుగుల ఎత్తుకు పంట పెరగాలి. నాటిన 60 రోజులకు ఈత పట్టి అన్ని వరి దుబ్బులు ఒకేసారి కోతకు వస్తాయి. అయితే నాటి నెలరోజులకే జానెడు ఎత్తు కూడా లేని పంట ఈతకు రావడం ప్రారంభమైంది. ఎకరాకు రెండు బస్తాల డీఏపీ, మూడుసార్లు యూరియా, రెండు మార్లు పొటాష్‌ చల్లినా వరిలో ఎదుగుదల లేదు. పిలకలు కూడా ఎక్కవగా రాకపోడంతో విత్తన డీలర్‌ను సంప్రదించగా, పైరును చూసి దిగుబడి తగ్గుతున్నందున ఎకరాకు రూ.10వేలు పరిహారం ఇప్పిస్తానని చెప్పి, ప్రస్తుతం తనకు ఏ సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు చొరవ తీసుకుని తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరాడు. కాగా, ఉమ్మడి జిల్లా పరిధిలో చాలాచోట్ల ఇదే పరిస్థితి ఉంది.

జానెడు ఎత్తులోనే ఈత మొదలైంది : సంతోష్‌, ఏఈవో, మిర్యాలగూడ

నాటు వేసిన నెల రోజులకే జానెడు ఎత్తులో వరి తల్లి కర్రలు ఈతకు వచ్చాయి. కంకులకు ధాన్యం పడింది. తక్కువ పిలకలు వచ్చాయి. వాటిలో పిలకలు కొన్ని ఈనుతుండగా, మరి కొ న్ని పొట్టదశలో ఉన్నాయి. దిగుబడి ఎంత వచ్చేది ఇప్పడే చెప్పలేం. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం విచారణ నిర్వహించి నడుచుకుంటాం.

Updated Date - 2023-03-04T01:05:19+05:30 IST