Padma Devender Reddy : పద్మా దేవేందర్‌రెడ్డికి పొగ?

ABN , First Publish Date - 2023-05-10T02:24:50+05:30 IST

తెలంగాణ ఉద్యమ సమయం నుంచి బీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్నారు. మెదక్‌ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ శాసనసభకు తొలి డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించారు. సీనియర్‌ నేత అయివుండి.. మంత్రి పదవి ఇవ్వకపోయినా పార్టీకి..

Padma Devender Reddy : పద్మా దేవేందర్‌రెడ్డికి పొగ?
Padma Devender Reddy

ఎమ్మెల్యే సీటుకు సొంత పార్టీ నుంచే ఎసరు!

మెదక్‌పై కన్నేసిన మైనంపల్లి కుమారుడు రోహిత్‌

సేవా కార్యక్రమాల పేరుతో నియోజకవర్గ పర్యటన

బీఆర్‌ఎస్‌లో మరో వర్గంగా ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి

ఇఫ్కో సమావేశంలో అమిత్‌ షాను కలిసిన పద్మ భర్త

పద్మకు మంత్రి పదవి ఎందుకివ్వరన్న రఘునందన్‌

దంపతుల చూపు.. బీజేపీ వైపన్న ఊహాగానాలు

ప్రచారాన్ని ఖండించిన ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి

మెదక్‌, మే 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యమ సమయం నుంచి బీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్నారు. మెదక్‌ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ శాసనసభకు తొలి డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించారు. సీనియర్‌ నేత అయివుండి.. మంత్రి పదవి ఇవ్వకపోయినా పార్టీకి విధేయురాలిగా ఉంటున్నారు. అంత సీనియర్‌ అయినా.. మెదక్‌ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌ నుంచి బయటకు పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయా? పార్టీ అధిష్ఠానం తమకు సన్నిహిత వ్యక్తులను ఆ నియోజకవర్గంలో ప్రోత్సహించడం ద్వారా ఆమెను పొమ్మనకుండానే పొగ పెడుతోందా? అంటే.. నియోజకవర్గంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, జరుగుతున్న ప్రచారం ఇలాంటి అభిప్రాయాన్నే కలిగిస్తున్నాయి. మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు పద్మా దేవేందర్‌రెడ్డి ఓ వైపు కార్యక్రమాలు నిర్వహిస్తుండగానే.. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కుమారుడు డాక్టర్‌ రోహిత్‌ కూడా స్వచ్ఛంద సంస్థ పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తుండటం కలకలం రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో మెదక్‌ నుంచి మైనంపల్లి రోహిత్‌ బీఆర్‌ఎస్‌ టికెట్‌పై ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ఆయన వర్గం ప్రచారం చేసుకుంటోంది. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లతో హన్మంతరావుకు ఉన్న సన్నిహిత సంబంధాలతో రోహిత్‌కు టికెట్‌ హామీ లభించినట్లు చెబుతున్నారు. రెండు నెలలుగా మెదక్‌ నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్‌కు వెళ్లి మైనంపల్లి హన్మంతరావు, రోహిత్‌లను కలుస్తున్నారు. ఈ పరిణామాలను ఎమ్మెల్యే వర్గం జీర్ణించుకోలేకపోతోంది. మరోసారి తానే పోటీ చేస్తానని, వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్‌ సాధిస్తానని ఎమ్మెల్యే పద్మ చెబుతున్నారు. సీఎం కేసీఆర్‌ ఆశీస్సులు, జిల్లా మంత్రి హరీశ్‌రావు అండదండలు తమకే ఉన్నాయని పద్మ అనుచరులు చెప్పుకొంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులివ్వాలంటూ మంగళవారం మంత్రి కేటీఆర్‌ను ఆమె కలిశారు. మరోవైపు మెదక్‌ నియోజక వర్గానికే చెందిన మరో నేత, ఎమ్మెల్సీ శేరి సుభా్‌షరెడ్డి వర్గం కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్‌ తమ నేతకే వస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు. సీఎం రాజకీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న సుభా్‌షరెడ్డి ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లి పని చేస్తున్నారు. తరచూ నియోజకవర్గ పర్యటనలు చేస్తున్నారు. అన్ని మండలాల్లో సీసీ రోడ్లకు నిధులు ఇస్తున్నారు. అనారోగ్యం బారిన పడిన వారికి ఎల్‌వోసీలు, సీఎంఆర్‌ఎఫ్‌ ఇప్పిస్తున్నారు.

అమిత్‌ షాను దేవేందర్‌రెడ్డి కలవడంతో..

సొంత పార్టీలో ఇద్దరు నేతలతో పోటీ ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డికి ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ ఘటన ఇబ్బందికరంగా మారింది. ఎమ్మెల్యే పద్మ భర్త దేవేందర్‌రెడ్డి.. ఇఫ్కో డైరెక్టర్‌ హోదాలో ఏప్రిల్‌ 27న డిల్లీలో జరిగిన ఇఫ్కో సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఇది మర్యాదపూర్వకమే అయినా.. ఈ ఘటనతో కొత్త ప్రచారం మొదలైంది. వచ్చే ఎన్నికల్లో పద్మకు బీఆర్‌ఎస్‌ టికెట్‌ రాకపోతే బీజేపీ టికెట్‌పై పోటీ చేయాలని భావిస్తున్నారని, అందుకే దేవేందర్‌రెడ్డి అమిత్‌షాను కలిశారని ప్రచారం జరుగుతోంది. దీనికితోడు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు చేసిన వ్యాఖ్యలు కూడా ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చాయి. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు మంత్రి పదవులు ఇచ్చిన సీఎంకేసీఆర్‌.. బీఆర్‌ఎ్‌సలో సీనియర్‌ అయిన పద్మా దేవేందర్‌రెడ్డికి ఎందుకు మంత్రి పదవి ఇవ్వరని రఘునందన్‌ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. అయితే ఈ ప్రచారాన్ని దేవేందర్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇఫ్కో సమావేశానికి కేంద్ర సహకార శాఖ మంత్రి హోదాలో వచ్చిన అమిత్‌షాను కలిస్తే పార్టీ మారుతున్నట్లేనా? అని ప్రశ్నించారు. ఈ ప్రచారాన్ని ఆపాలన్నారు.

Updated Date - 2023-05-10T02:24:59+05:30 IST