Podu land : అక్రమాల ‘పోడు’!
ABN , First Publish Date - 2023-07-14T04:02:02+05:30 IST
: పోడు భూముల పట్టాల నమోదు లోపభూయిష్టంగా తయారైంది. కొందరు అధికారుల అవినీతి.. రెవెన్యూ, అటవీ, పంచాయతీ రాజ్ శాఖల సమన్వయలోపంతో అనేక అక్రమాలు
17 మంది ప్రభుత్వ ఉద్యోగులకు పట్టాలు
భూమిలేని వారికీ హక్కు పత్రాల జారీ
రైతుబంధు కోసం అధిక విస్తీర్ణం నమోదు
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో అక్రమాలు
నిర్మల్ జిల్లాలో గిరిజనేతరులకూ పట్టాలు
కొత్తగూడ, నిర్మల్, జూలై 13: పోడు భూముల పట్టాల నమోదు లోపభూయిష్టంగా తయారైంది. కొందరు అధికారుల అవినీతి.. రెవెన్యూ, అటవీ, పంచాయతీ రాజ్ శాఖల సమన్వయలోపంతో అనేక అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. మహబూబాబాద్, నిర్మల్ జిల్లాల్లో గిరిజనేతరులకు పట్టాలు జారీ చేయగా, పట్టాలు పొందిన వారిలో ఏకంగా ప్రభుత్వ ఉద్యోగులే ఉండడం అధికారుల తీరుకు అద్దం పడుతోంది. దీనికి తోడు పలు చోట్ల రైతు బంధు కోసం విస్తీర్ణాన్ని ఎక్కువగా చూపి పట్టాలు ఇచ్చారు. భూమి లేని వారికి కూడా పట్టాలు జారీ చేశారంటే అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో అర్థం చేసుకోవచ్చు. కొందరు అధికారులు, దళారులను ఏర్పాటు చేసుకొని వసూళ్ల దందాకు పాల్పడి ఈ అక్రమాలకు తెరలేపినట్లు తెలుస్తోంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో 6,114 మంది రైతులు పోడు పట్టాల కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోగా, ఇందులో 5,586 మంది రైతులకు 17,350 ఎకరాలకు పట్టాలను జారీ చేశారు. అయితే జారీ అయిన పట్టాల్లో 17 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లు గుర్తించిన అధికారులు వారికి పట్టా పుస్తకాలను పంపిణీ చేయకుండా నిలిపివేశారు. అంతేకాకుండా కొందరు భూమిలేని వారితో పాటు భూమి ఎక్కువగా నమోదు చేయించుకున్న వారికి సంబంధించిన 240 మంది పట్టాలను జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి (డీటీడీవో) కార్యాలయంలో నిలిపివేశారు. మండలంలో పోడు విస్తీర్ణం కంటే అధికంగా పట్టా పాస్ పుస్తకాలు జారీ అయినట్లు తెలుస్తోంది. పోడు పట్టాల కోసం వచ్చిన దరఖాస్తులను రెవెన్యూ, అటవీ, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో ఎఫ్‌ఆర్‌సీ కమిటీలకు అందజేసి క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక అందించాలి. ఈ నివేదికల ఆధారంగా ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేయాలి. కానీ, ఆన్‌లైన్ ప్రకియలో కొందరు అధికారులు, దళారులు ఎఫ్‌ఆర్‌సీ కమిటీ నివేదికలోని వివరాలను కాకుండా ఆన్‌లైన్‌లో భూములను అధిక విస్తీర్ణంతో నమోదు చేసినట్లు తెలిసింది. అంతేకాకుండా పంచాయతీ కార్యదర్శులు సమ్మెలో ఉన్న కాలంలో ఆన్‌లైన్ ప్రక్రియను రెవెన్యూ కార్యాలయానికి మార్చారు. రైతుల అవసరాన్ని ఆసరా చేసుకుని ఉన్న భూమికంటే ఎక్కువ నమోదు చేయిస్తామని, భూమి లేని వారికి రైతుబంధు వస్తుందనే ఆశను కల్పించి వారి నుంచి అధికారులు, ప్రైవేటు ఆపరేటర్లు, కొందరు వీఆర్‌ఏలతో కుమ్మక్కై డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో తహసీల్దార్ లాగిన్‌ను ఓ మీసేవ నిర్వాహకుడు తెలుసుకొని, కొందరు వీఆర్‌ఏల సహకారంతో అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.
డ్యాంగాపూర్‌తో ముగ్గురు అనర్హులకు పట్టాలు
నిర్మల్ జిల్లా నిర్మల్ మండలం డ్యాంగాపూర్‌లో ముగ్గురు గిరిజనేతరులకు అధికారులు పోడు హక్కు పత్రాలు ఇచ్చేశారు. అటవీ అధికారులకు, జిల్లా కలెక్టర్‌కు గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో ఈ అక్రమాల గుట్టు రట్టయింది. ఈ గ్రామంలోని మొత్తం ఆరుగురికి 20 ఎకరాలకు పోడు హక్కు పత్రాలు కేటాయించారు. ఈ ఆరుగురిలో ముగ్గురు గిరిజనేతరులు కావడం వివాదానికి కారణమైంది. వీరికీ 5 ఎకరాలు కేటాయించారు. ముగ్గురు గిరిజనులకు 15 ఎకరాలివ్వగా ఇందులో ఓ భార్య, భర్తకు 11 ఎకరాలు కేటాయించడం అనుమానాలకు తావిస్తోంది. గ్రామంలోని గిరిజనులు దీనిపై అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన అధికారులు ముగ్గురు గిరిజనేతరుల నుంచి హక్కు పత్రాలను వెనక్కి తీసుకుని, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారికి అప్పజెప్పినట్లు తెలిసింది. కాగా, డ్యాంగాపూర్‌లో గిరిజనేతరులు పోడు పట్టాల కోసం దరఖాస్తు చేసుకోవడంతో వారికి పట్టాలు మంజూరైన మాట వాస్తవమేనని, కానీ ఆ పట్టాలను తిరిగి స్వాధీనం చేసుకున్నామని నిర్మల్ రూరల్ ఎంపీడీవో సాయిరాం తెలిపారు.
అక్రమాలకు పాల్పడలేదు
పట్టాపాస్ పుస్తకాల నమోదు ప్రక్రియలో అక్రమాలకు పాల్పడలేదు. నా లాగిన్ పాస్‌వర్డ్ మాత్రం మీసేవ నిర్వాహకుడు ఒకరు రహస్యంగా కనుక్కొని భూములను నమోదు చేస్తున్నాడని తెలుసుకొని అతడిని పిలిచి మం దలించా. ఆపరేటర్లు సైతం ఇలాంటి పనులు చేయవద్దని హెచ్చరించా.
- చందా నరేష్, కొత్తగూడ, తహసీల్దార్