గోదావరి- కావేరి అనుసంధానంతోశ్రీశైలం, జూరాలకు ఇబ్బందులు
ABN , First Publish Date - 2023-11-14T02:54:19+05:30 IST
గోదావరి-కావేరీ అనుసంధానంలో భాగంగా తరలించే 148 టీఎంసీల్లో కర్ణాటకకు 16 టీఎంసీలను కేటాయించడం, కృష్ణా సబ్‌బేసిన్ కే-4(మలప్రభ)లోని ఆల్మట్టి రిజర్వాయర్ నుంచి ఆ నీటిని
కర్ణాటకకు ఇవ్వనున్న 16 టీఎంసీలను ఆల్మట్టి నుంచి వినియోగించుకోవడానికి అనుమతి ఇవ్వడం సరి కాదు
‘గోదావరి-కావేరీ’లో మాకు 50% వాటా కేటాయించాలి
ఇచ్చంపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని పునః పరిశీలించాలి
ఎన్‌డబ్ల్యూడీఏ డీజీకి తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ లేఖ
హైదరాబాద్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): గోదావరి-కావేరీ అనుసంధానంలో భాగంగా తరలించే 148 టీఎంసీల్లో కర్ణాటకకు 16 టీఎంసీలను కేటాయించడం, కృష్ణా సబ్‌బేసిన్ కే-4(మలప్రభ)లోని ఆల్మట్టి రిజర్వాయర్ నుంచి ఆ నీటిని వాడుకోవడానికి అనుమతి ఇవ్వడం సరికాదని తెలంగాణ పేర్కొంది. అలాంటి వెసులుబాటు కల్పిస్తే.. దిగువన ఉన్న జూరాల, శ్రీశైలం జలాశయాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు తరలించే 80 టీఎంసీలకు బదులుగా కర్ణాటక 21టీఎంసీలు, మహారాష్ట్ర 14 టీఎంసీలను వాడుకుంటున్న/వాడుకోవడానికి ప్రతిపాదనలు చేస్తున్నాయని గుర్తు చేసింది. తాజాగా మరో 16 టీఎంసీలను కర్ణాటక వాడుకోవడానికి వీలు కల్పిస్తే... శ్రీశైలం, జూరాలకు సమస్యలు ఎదురవుతాయని అభిప్రాయపడింది. ఈ మేరకు నదుల అనుసంధానం ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న జాతీయ నీటి అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్(ఎన్‌డబ్ల్యూడీఏ డీజీ)కు తెలంగాణ ఈఎన్‌సీ(జనరల్) సి.మురళీధర్ లేఖ రాశారు. కర్ణాటకలోని బెడ్తి-వార్ధా అనుసంధానంలో భాగంగా తరలించే 18 టీఎంసీల్లో 9 టీఎంసీల వాటాను తెలంగాణకు కేటాయించాలని కోరారు.
గోదావరి బేసిన్‌లో 968 టీఎంసీల నికర జలాల వినియోగానికి తెలంగాణ నుంచి ప్రతిపాదనలు ఉన్నాయని, పలు ప్రాజెక్టుల డీపీఆర్‌లు పరిశీలనలో ఉన్నాయని గుర్తు చేశారు. మహబూబ్‌నగర్‌లో 30 లక్షల ఎకరాలు, నల్లగొండలో 20.3 లక్షల ఎకరాలు, రంగారెడ్డి జిల్లాల్లో 12.2 లక్షల ఎకరాల సాగుభూమి ఉండగా, 86 శాతానికిపైగా భూములకు సాగునీటి వసతి లేదని పేర్కొన్నారు. గోదావరి-కావేరీ అనుసంధానంలో తెలంగాణకు 50శాతం వాటా కేటాయిస్తే... ఆయా ప్రాంతాలకు సాగునీటిని అందించే అవకాశం దక్కుతుందని తెలిపారు. గోదావరి-కావేరీ అనుసంధానంలో ఇచ్చంపల్లి వద్ద రిజర్వాయర్ కడితే..అక్కడి నుంచి విడుదలయ్యే నీటి ప్రభావం తుపాకులగూడెం(సమ్మక్కసాగర్) బ్యారేజీపై పడుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రిజర్వాయర్ ప్రతిపాదనపై పునఃపరిశీలన చేయాలని కోరారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలని నివేదించారు.