కోకాపేట్‌లో ప్రపంచంలోనే ఎత్తైన రాధాకృష్ణ మందిరం
ABN , First Publish Date - 2023-05-06T02:11:42+05:30 IST
ప్రపంచంలోనే ఎత్తైన శ్రీకృష్ణ మందిరం కోకాపేట్‌లో నిర్మితం కానుంది. ఈ ఆలయం ఎత్తు 400 అడుగులు. మొత్తం 8 ఎకరాల విస్తీర్ణంలో హరేకృష్ణ హెరిటేజ్ టవర్‌గా ఇది నిర్మాణం కానుంది.
నార్సింగ్, మే 5 (ఆంధ్రజ్యోతి): ప్రపంచంలోనే ఎత్తైన శ్రీకృష్ణ మందిరం కోకాపేట్‌లో నిర్మితం కానుంది. ఈ ఆలయం ఎత్తు 400 అడుగులు. మొత్తం 8 ఎకరాల విస్తీర్ణంలో హరేకృష్ణ హెరిటేజ్ టవర్‌గా ఇది నిర్మాణం కానుంది. ఈ ప్రతిష్ఠాత్మక ఆలయానికి 8న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని హరేరామ హరేకృష్ణ ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. శుక్రవారం నార్సింగ్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేంలో హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్ అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస ప్రభు, శ్రీకృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ప్రతినిధి కౌంటిన్య ప్రభు మీడియాకు ఈ వివరాలు వెళ్లడించారు. ఈ శ్రీకృష్ణ మందిరం దేవాలయంలో రాధాకృష్ణ స్వామితో పాటు శ్రీకృష్ణుడి ఎనిమిది భార్యల విగ్రహాలతో పాటు, తిరుమలను పోలినట్టు ఉండే వెంకటేశ్వరస్వామి ఏకశిల విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. నార్సింగ్‌లోని శ్రీకృష్ణ గోసేవా సమితి వారి స్థలంలో ఇది నిర్మితమవుతుందని, కొన్ని వందల సంవత్సరాలుగా గోవులు తిరిగిన ప్రదేశమని, అలాంటి స్థలంలో శ్రీకృష్ణ మందిరం నిర్మితం కావడం సంతోషంగా ఉందన్నారు. హిందూ సంస్కృతి, సంప్రదాయ ప్రకారం ఈ హెరిటేజ్ టవర్ ఉంటుందని, ఇందులో పెద్దపెద్ద సమావేశాలు, కన్వెన్షన్ హాల్, వయో వృద్ధులు, వికలాంగులకు ఎలివేటర్స్, ర్యాంప్‌లు నిర్మిస్తున్నామని, భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా విశాలమైన క్యూ హాల్స్ ఉంటాయన్నారు. భక్తులందరికీ ఉచిత భోజనం ఏర్పాటు చేస్తామని తెలిపారు.