ఎండుతున్న పంటలు

ABN , First Publish Date - 2023-02-16T00:30:53+05:30 IST

విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో రైతులు వ్యవసాయ పంటలకు నీరందించలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ పనిచేయకపోవడంతో వారం రోజులుగా పంటలకు నీరు పెట్టలేదని, అవి పూర్తిగా ఎండిపోయే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎండుతున్న పంటలు
ఎండిన పంటను చూపిస్తున్న రైతు అమర్నాథ్‌

మరమ్మతుకు నోచుకోని విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌

విద్యుత్‌ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని రైతుల ఆవేదన

పూడూరు, ఫిబ్రవరి 15: విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో రైతులు వ్యవసాయ పంటలకు నీరందించలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ పనిచేయకపోవడంతో వారం రోజులుగా పంటలకు నీరు పెట్టలేదని, అవి పూర్తిగా ఎండిపోయే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం విద్యుత్‌ శాఖ అధికారులకు వివరించినా పట్టించుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆరోపిస్తున్నారు. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వికారాబాద్‌ జిల్లా పూడూరు మండల కేంద్రంలోని రైతు అమర్‌నాథ్‌ పొలంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు దాదాపు 30 కనెక్షన్లు ఉన్నాయి. ఇటీవల విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లో సమస్య తలెత్తడంతో రైతులు మరమ్మతు చేయాలని విద్యుత్‌ అధికారులు, సిబ్బందికి తెలిపినా పట్టించుకోవడం లేదన్నారు. దీంతో సాగు చేసిన పంటలు ఎండు ముఖం పడుతున్నాయని రైతులు వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో పంటలు చేతికందే పరిస్థితి లేదని, పెట్టుబడి రాక అప్పుల పాలు కావాల్సిన దుస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

విద్యుత్‌ సరఫరా లేక పంటలు ఎండుతున్నాయి : అమర్‌నాథ్‌, రైతు, పూడూరు

15 ఎకరాల్లో మొక్కజొన్న, చెరుకు పంటలను సాగు చేశాను. మొదట్లో విద్యుత్‌ సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడేది. ప్రస్తుతం విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ పనిచేయకపోవడంతో వారం రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాను. పంట ఎండిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతులు చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.

Updated Date - 2023-02-16T00:31:16+05:30 IST