జిప్సం కర్మాగారం మూసివేయాలి

ABN , First Publish Date - 2023-02-10T00:13:16+05:30 IST

తాండూరు మండలం గుంతబాస్పల్లి గ్రామ శివారులోని ఇండస్కేమ్‌ జిప్సం కర్మాగారంతోపాటు మరో కర్మాగారాన్ని వెంటనే మూసి వేయాలని ఆ గ్రామ సర్పంచ్‌ జగదీశ్వర్‌ గురువారం నగరంలోని మానవ హక్కుల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

జిప్సం కర్మాగారం మూసివేయాలి
జిప్సం కర్మాగారం వద్ద ఆందోళన చేస్తున్న గ్రామస్తులు(ఫైల్‌)

మానవ హక్కుల కమిషన్‌కు సర్పంచ్‌ ఫిర్యాదు

తాండూరు రూరల్‌, ఫిబ్రవరి 9 : తాండూరు మండలం గుంతబాస్పల్లి గ్రామ శివారులోని ఇండస్కేమ్‌ జిప్సం కర్మాగారంతోపాటు మరో కర్మాగారాన్ని వెంటనే మూసి వేయాలని ఆ గ్రామ సర్పంచ్‌ జగదీశ్వర్‌ గురువారం నగరంలోని మానవ హక్కుల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. తమ గ్రామ సమీపంలోని ఇండస్కేమ్‌ జిప్సం కర్మాగారంతోపాటు మరో కర్మాగారం ద్వారా గుంతబాస్పల్లి గ్రామ శివారులో వాయు, నీటి కాలుష్యం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఫిర్యాదులో పేర్కొన్నారు. గత నెల 21న గ్రామస్తులతో కలిసి కర్మాగారం గేటు ఎదుట బైఠాయించి 2 గంటలపాటు నిరసన వ్యక్తం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కర్మాగారాల వల్ల గుంతబాస్పల్లి, మిట్టబాస్పల్లి, మల్కాపూర్‌, కరన్‌కోట్‌, సంగెంకలాన్‌ గ్రామాల్లో తాగునీరంతా కాలుష్యమై శ్వాసకోశ వ్యాధులతో పాటు పంటలు పండటం లేదని, పశువులు సైతం తాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రెండు, మూడుసార్లు కర్మాగారంయాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయంపై కాలుష్య నియంత్రణా మండలి అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని, కర్మాగారం వల్ల గ్రామ ప్రజల ప్రాణాలకు ముప్పు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బోరుబావుల ద్వారా వచ్చే నీరు దుర్వాసనతోపాటు ఎరుపు రంగులో వస్తోందని, వీటితో స్నానం చేస్తే చర్మ వ్యాధులు వస్తున్నాయని తెలిపారు. త్వరలోనే కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫిర్యాదు చేస్తామని, కలెక్టర్‌ ఈ ప్రాంతాన్ని పరిశీలించి కర్మాగారం అనుమతులు రద్దు చేసి ప్రజలను కాపాడాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Updated Date - 2023-02-10T00:13:17+05:30 IST