Patnam Narender Reddy: భూ విక్రయ వివాదం.. కొడంగల్‌ ఎమ్మెల్యేపై కేసు

ABN , First Publish Date - 2023-06-12T02:36:30+05:30 IST

భూమిని విక్రయించిన అనంతరం తలెత్తిన వివాదంలో అధికార బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిపై క్రిమినల్‌ కేసు నమోదైంది.

Patnam Narender Reddy: భూ విక్రయ వివాదం.. కొడంగల్‌ ఎమ్మెల్యేపై కేసు

భూ వివాదంలో బాధితుడిని కొట్టిన పట్నం నరేందర్‌రెడ్డి

కమీషన్‌తో కలిపి రూ.3.65 కోట్లకు డీల్‌

రూ.3.05 కోట్లు చెల్లించిన ఇంద్రపాల్‌రెడ్డి

మిగతా డబ్బు చెల్లించేందుకు

గడువు కోరగా.. కుదరదన్న ఎమ్మెల్యే

పైగా.. బాధితుణ్ని కొట్టి, బెదిరించిన వైనం

పోలీసులు స్పందించకపోవడంతో

నాంపల్లి కోర్టును ఆశ్రయించిన ఇంద్రపాల్‌

కోర్టు ఆదేశాలతో కేసు ఫైల్‌ చేసిన బంజారాహిల్స్‌ పోలీసులు

బంజారాహిల్స్‌, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): భూమిని విక్రయించిన అనంతరం తలెత్తిన వివాదంలో అధికార బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిపై క్రిమినల్‌ కేసు నమోదైంది. బెదిరింపులకు పాల్పడడంతో పాటు దాడి చేసిన ఆరోపణలపై కొడంగల్‌ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డిపై కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడు సామ ఇంద్రపాల్‌రెడ్డి తొలుత గత ఏడాది జూన్‌లో బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు. అనంతరం హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ను కలవగా.. వెస్ట్‌జోన్‌ డీసీపీకి ఫిర్యాదు చేయాలని సూచించారు. అక్కడ ఫిర్యాదు చేసినా ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో బాధితుడు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు ఎట్టకేలకు ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డిపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు.

రాజేంద్రనగర్‌ ఉప్పర్‌పల్లికి చెందిన ఇంద్రపాల్‌రెడ్డి వ్యవసాయం చేస్తుంటారు. 2018లో భూమి కొనాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ సమయంలో ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి, శ్రీరామ్‌, రాకేశ్‌రెడ్డిలు తమ వద్ద కొంత భూమి ఉందని చెప్పారు. వారి కమీషన్‌తో కలుపుకొని రూ.3.65 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇంద్రపాల్‌రెడ్డి.. ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి, శ్రీరామ్‌, రాకేశ్‌రెడ్డిలకు రూ.90 లక్షల నగదు ఇచ్చా రు. మిగిలిన రూ.2.75 కోట్లకు ఆరు చెక్కులు ఇచ్చారు. 2018 మే 5న భూ యజమానులైన ఐలమ్మ, కాలమ్మ, పర్వతమ్మ తదితరులకు రూ.1.75 కోట్లను డిమాండ్‌ డ్రాఫ్ట్‌, నగదు రూపంలో చెల్లించి అదే నెలలో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. అదేసమయంలో ఎమ్మెల్యే, అనుచరులకు రూ.20 ల క్షలు చెల్లించారు. అనంతరం ఇచ్చిన సొమ్ముతో కలిపి, వారికి మొత్తం రూ.3.05 కోట్లు చెల్లించారు. ఇంద్రపాల్‌రెడ్డి తన చె క్కులను తిరిగి తీసుకున్నారు. మిగిలిన రూ.60 లక్షలు తనకు రుణం వచ్చాక ఇస్తానని చెప్పారు.

ఇంద్రపాల్‌రెడ్డికి రుణం రాలేదు. ఈ క్రమంలో ఎమ్మెల్యే తనకు డబ్బు కావాలని వేధించడం మొదలుపెట్టారు. రుణం రాలేదని, కొంత సమ యం ఇవ్వాలని అభ్యర్థించినా వినిపించుకోలేదు. గత ఏడాది జూన్‌ 26న ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి ఇంద్రపాల్‌రెడ్డి ఇంటికి వెళ్లి మరీ ఆయన లేని సమయంలో కు టుంబ సభ్యులను బెదిరించారు. ఇంద్రపాల్‌రెడ్డిని తన ఇం టికి రమ్మనిచెప్పి వెళ్లారు. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యే ఇంటికి వెళ్లగా ఒక గదిలోకి తీసుకెళ్లి.. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని నరేందర్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డి బెదిరించారు. ఎమ్మె ల్యే చేయిచేసుకున్నారు. వారినుంచి తప్పించుకున్న ఇంద్రపాల్‌రెడ్డి.. బంజారాహిల్స్‌ పోలీసులను ఆశ్రయించారు. కానీ, పోలీసులు స్పందించలేదు. అప్పటి నగర సీపీ, పశ్చిమ మండ లం డీసీపీకి ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఇంద్రపాల్‌రెడ్డి నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న కోర్టు.. ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డి, శ్రీరామ్‌లపై సెక్షన్‌ 342, 384, 323, 506 రెడ్‌విత్‌ 34 ఐపీసీ, 156(3) కింద కేసు నమోదు చేయాలని బంజారాహిల్స్‌ పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2023-06-12T04:12:46+05:30 IST