పైసా వసూల్
ABN , First Publish Date - 2023-03-08T23:42:51+05:30 IST
రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల రిజిస్ట్రేషన్ల శాఖ ఈ ఏడాది ఫుల్లుగా పైసా వసూల్ చేస్తోంది. గతంలో కంటే రికార్డు స్థాయిలో ఆదాయం ఆర్జిస్తోంది.
రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల రిజిస్ట్రేషన్ల శాఖకు భారీగా ఆదాయం
పుంజుకున్న రియల్ వ్యాపారం
గత ఏడాది రంగారెడ్డి జిల్లాకు రూ. 3,559 కోట్ల ఆదాయం..
ఈ సారి రెండు జిల్లాలకు ఇప్పటికే రూ.3,570 కోట్ల రాబడి
ఈ నెలాఖరుకు మరో రూ.500 కోట్ల వరకు రావచ్చని అంచనా
రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల రిజిస్ట్రేషన్ల శాఖ ఈ ఏడాది ఫుల్లుగా పైసా వసూల్ చేస్తోంది. గతంలో కంటే రికార్డు స్థాయిలో ఆదాయం ఆర్జిస్తోంది. స్థిరాస్తి క్రయవిక్రయాలు జోరుగా సాగుతుండటంతో ఖజానా గలగలమంటోంది. మున్ముందు భూముల ధరలు పెరిగే అవకాశం ఉండటంతో ప్లాట్ల విక్రయాలు పెరిగాయి. దీంతో కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు క్యూ కట్టారు.
షాద్‌నగర్, మార్చి 8 : రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో రిజిస్ర్టేషన్ శాఖకు భారీగా ఆదాయం వస్తోంది. ఈ ఏడాది జోరుగా రిజిస్ర్టేషన్లు జరుగుతున్నాయి. దీంతో ఆ శాఖకు భారీగా ఆదాయం సమకూరుతోంది. జిల్లాల్లో రియల్ వ్యాపారం ఊపందుకుంది. రాష్ట్ర రాజధానిలో కొంతభాగం రంగారెడ్డి జిల్లా కలవడం, ఆ పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున వెంచర్లు వెలిశాయి. భవిష్యత్తులో భూముల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని, దాంతోపాటు ప్లాట్ల ధరలు కూడా పెరుగుతాయన్న ఆలోచనలో ధనిక, మధ్య తరగతి కుటుంబాలు పెద్ద ఎత్తున ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. ఇదే అదును చూసి రియల్టర్లు ప్లాట్ల ధరలను విపరీతంగా పెంచేస్తున్నారు. ధరలు పెరిగినా భూముల క్రయ విక్రయాలు పెరిగాయి. దీంతో కొనుగోలుదారులు రిజిస్ర్టేషన్ కార్యాలయానికి క్యూ కట్టడంతో ఆ శాఖకు భారీ ఆదాయం సమకూరుతోంది.
ఇప్పటికే భారీ ఆదాయం
ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో 22 రోజుల గడువు ఉన్నప్పటికీ ఇప్పటికే రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల నుంచి రిజిస్ర్టేషన్ ఆఫీ్‌సకు చార్జీల రూపంలో రూ.3,570 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ నెలాఖరు వరకు మరో రూ. 500 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని సంబంధిత శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది 2.30లక్షల డాక్యుమెంట్లు రిజిస్ర్టేషన్ కాగా, కేవలం రూ.3,559 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఆర్థిక సంవత్సరం కంటే ఈ ఏడాది రూ.700 కోట్లకు పైగా అదనపు ఆదాయం సమకూరుతుందన్న అంచనాలో రిజిస్ర్టేషన్ శాఖ అధికారులు ఉన్నారు.
2.29లక్షల డాక్యుమెంట్లు రిజిస్ర్టేషన్
ఈ ఆర్థిక సంవత్సరం 2022- 2023లో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఇప్పటివరకు 2,29,689 డాక్యుమెంట్ల రిజిస్ర్టేషన్లు జరిగాయి. ఇందులో ఒక్క రంగారెడ్డి జిల్లా రిజిస్ర్టేషన్ కార్యాలయంలోనే 21,100 డాక్యుమెంట్లు రిజిస్ర్టేషన్ కాగా, ఆ ఒక్క కార్యాలయం నుంచే సుమారు రూ.938 కోట్ల ఆదాయం వచ్చింది. శంకర్‌పల్లిలో అతి తక్కువగా 5,898 డాక్యుమెంట్ల రిజిస్ర్టేషన్ కాగా, రూ.105.56 కోట్ల ఆదాయం వచ్చింది.
ధరలు పెరిగినా..
ప్లాట్ల ధరలు పెరిగినా కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదని సబ్‌రిజిస్ర్టార్లు తెలిపారు. ఇన్‌కంట్యాక్స్ నుంచి తప్పించుకునేందుకు హెచ్‌ఎండీఏ లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేస్తున్నందునే ఎన్నడూ లేనంతగా గత నెల ఫిబ్రవరిలో భారీగా రిజిస్ర్టేషన్లు జరిగాయని చెప్పారు. వెంచర్ల నిర్వాహకులు కూడా ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికి పెద్దఎత్తున ప్లాట్లను కొనుగోలు చేసి లెక్కలు చూపుతున్నట్లు సమాచారం.
త్రిబుల్‌ఆర్ తో డబుల్
రంగారెడ్డి జిల్లా పరిధిలో రీజినల్ రింగ్ రోడ్డు రాబోతుందన్న సమాచారంతో కడ్తాల్, ఆమనగల్, కేశంపేట, షాద్‌నగర్, కొందుర్గు, షాబాద్, చేవెళ్ల, శంకర్‌పల్లి పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు డబుల్ అయ్యాయి. ఈ ప్రాంతాల్లో మారుమూల గ్రామాల్లో సైతం ఎకరం స్థలం కోటి రూపాయలకు మించి పోయింది. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా త్రిబుల్ ఆర్ పేరిట ప్లాట్ల ధరలను అమాంతం పెంచారు. గతంలో ప్రకటించిన ధరలకు, ప్రస్తుత ధరలకు పొంతన లేకుండా పోయింది.
రిజిస్ర్టేషన్లు పెరిగాయి
గతంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో రిజిస్ర్టేషన్ల సంఖ్య పెరిగింది. గత నెల ఫిబ్రవరిలో పెద్ద ఎత్తున డాక్యుమెంట్లు రిజిస్ర్టేషన్ అయ్యాయి. ఈ నెలాఖరు వరకు షాద్‌నగర్ ఎస్‌ఆర్‌వో పరిధిలో 10వేల వరకు డాక్యుమెంట్ల రిజిస్ర్టేషన్ జరిగే అవకాశం ఉంది.
- సతీష్, సబ్‌రిజిస్ర్టార్, షాద్‌నగర్