ఎత్తిపోతల నుంచి రంగారెడ్డిని ఎత్తివేశారా?

ABN , First Publish Date - 2023-09-16T00:43:28+05:30 IST

సీఎం కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు వాలకం చూస్తుంటే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుంచి రంగారెడ్డి జిల్లాను ఎత్తివేసినట్టే ఉందని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎత్తిపోతల నుంచి రంగారెడ్డిని ఎత్తివేశారా?
బహిరంగ లేఖను ప్రదర్శిస్తున్న నాయకులు

లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ నిర్మాణం ఉట్టిమాటేనా?

సీఎం కేసీఆర్‌కు బీజేపీ నాయకుల బహిరంగ లేఖ

షాద్‌నగర్‌అర్బన్‌, సెప్టెంబర్‌ 15: సీఎం కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు వాలకం చూస్తుంటే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుంచి రంగారెడ్డి జిల్లాను ఎత్తివేసినట్టే ఉందని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. షాద్‌నగర్‌ బీజేపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్‌.శ్రీవర్ధన్‌రెడ్డి, అందె బాబయ్య, జిల్లా అధికార ప్రతినిధి కక్కునూరి వెంకటేష్‌గుప్తలు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ ప్రారంభం నుంచి కేసీఆర్‌ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ పేరును జపిస్తూనే ఉన్నారని గుర్తు చేశారు. 2009 పార్లమెంట్‌ ఎన్నికల్లో లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ పేరు చెప్పి కేసీఆర్‌ పాలమూరు పార్లమెంట్‌ సభ్యుడిగా ఎన్నికైనారని, 2014, 2018 ఎన్నికల్లో షాద్‌నగర్‌ ఎమ్మెల్యేగా అంజయ్యయాదవ్‌తో పాటు బీఆర్‌ఎస్‌ ఎంపీలు గెలుపొందారని గుర్తుచేశారు. గత మూడు ఎన్నికల్లో లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ పేరును వాడుకుని రైతుల ఓట్లను దండుకుని అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ పనులను ప్రారంభించకుండానే పాలమురు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడానికి కేసీఆర్‌ రావడం హాస్యస్పదంగా ఉందన్నారు. నాయకులు ప్రణిత్‌రెడ్డి, చెట్ల వెంకటేష్‌, మఠం రుషీకేష్‌, తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-09-16T00:43:28+05:30 IST