తాండూరు నుంచి మంతట్టి రైల్వే స్టేషన్‌కు షంటింగ్
ABN , First Publish Date - 2023-05-06T00:03:31+05:30 IST
తాండూరు రైల్వే స్టేషన్‌లో సిమెంటు కర్మాగారాలకు చెందిన గూడ్స్ రైళ్ల షంటింగ్ (లోడింగ్, అన్‌లోడింగ్), విధానంతో పాటు దుమ్మూధూళితో సమీప ప్రజలు ఇబ్బందులు, పడుతున్నారు.
ఐదు సిమెంటు కర్మాగారాల రూఫ్ లైన్ ఇకపై మంతట్టి నుంచే..
ఫలించిన సామాజిక వేత్త ఆరేళ్ల పోరాటం
తాండూరు కోర్టులో రూ.20లక్షల పరిహారం చెల్లించాలని రిట్
దిగివచ్చిన రైల్వే శాఖ
తాండూరు, మే 5 : తాండూరు రైల్వే స్టేషన్‌లో సిమెంటు కర్మాగారాలకు చెందిన గూడ్స్ రైళ్ల షంటింగ్ (లోడింగ్, అన్‌లోడింగ్), విధానంతో పాటు దుమ్మూధూళితో సమీప ప్రజలు ఇబ్బందులు, పడుతున్నారు. పట్టాలకిరువైపులా నివసించే వారికి విపరీతమైన ధ్వని కాలుష్యం వస్తోంది. రాత్రి, పగలు అని తేడా లేకుండా పాత తాండూరు రైల్వే గేటు వద్ద షంటింగ్‌తో ఇబ్బందులు పడుతున్నామని సామాజిక వేత్త రాజ్‌గోపాల్ సార్డా తాండూరు కోర్టును ఆశ్రయించడంతో దక్షిణమధ్య రైల్వే శాఖ స్పందించింది. ఇప్పటికే 2015లో ఆయన పౌరుల ప్రాధాన్యత, హక్కులకు భంగం కలిగిస్తున్నారని రైల్వే అధికారులకు విన్నవించినా స్పందించలేదు. 2017లో హైకోర్టును ఆశ్రయించి రైల్వే అధికారులను ప్రతివాదులుగా చేర్చుతూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందుకు హైకోర్టు మూడు నెలల్లో సమాధానం ఇవ్వాలని రైల్వే శాఖను కోరినప్పటికీ ఆశాఖ స్పందించలేదు. ఎన్నో రిట్ పిటిషన్లు హైకోర్టులో దాఖలు చేసినప్పటికీ ఎలాంటి కదలేక లేకపోవడంతో తాండూరు న్యాయస్థానంలో రూ.20లక్షల నష్టపరిహారం కోరుతూ 2022లో పిటిషన్ వేశారు. దీంతో రైల్వే శాఖ స్పందించి తాండూరుకు 9 కిలో మీటర్ల దూరంలో ఉన్న మంతట్టి రైల్వే స్టేషన్‌కు గూడ్సురైళ్ల షంటింగ్ తరలించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు సిమెంటు ఫ్యాక్టరీల గూడ్స్ రైళ్లను మంతట్టి రైల్వే స్టేషన్‌లోనే షెంటింగ్ చేస్తామని దక్షిణ మధ్య రైల్వే శాఖ కోర్టుకు రాతపూర్వకంగా పేర్కొంది. తాండూరులో షంటింగ్‌కు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదంతోనే రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుందని, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా సిమెంటు ట్రాన్స్‌పరేషన్ కోసం సైడింగ్ రైల్వే కనెక్టివిటీని అందించడానికి మంతట్టి స్టేషన్‌ను అనుసంధించే బైపాస్ లైను మంజూరైందని, తద్వారా షెంటింగ్ కార్యక్రమాలను మంతట్టిలోనే నిర్వహిస్తామని, అక్కడ జన సంచారం తక్కువగా ఉన్నందున అక్కడ ఏర్పాటు చేస్తామని మంజూరు పత్రాన్ని, మ్యాప్‌ను డాక్యుమెంట్‌గా కోర్టుకు సమర్పించారు.
====================================