శ్రీనిధి ఇంజనీరింగ్‌ కళాశాలలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2023-09-05T00:24:13+05:30 IST

శ్రీనిధి ఇంజనీరింగ్‌కళాశాలలో సోమవారం ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు ఆందోళనకు దిగారు.

శ్రీనిధి ఇంజనీరింగ్‌ కళాశాలలో ఉద్రిక్తత
ఫర్నీచర్‌ ధ్వంసం చేస్తున్న యువకుడు

  • ఫర్నిచర్‌ ధ్వంసం చేసిన ఏబీవీపీ నేతలు

  • అడ్డువచ్చిన సెక్యూరిటీపై దాడి

  • 13మందిపై కేసు నమోదు

ఘట్‌కేసర్‌/ఘట్‌కేసర్‌ రూరల్‌, సెప్టెంబరు 4: శ్రీనిధి ఇంజనీరింగ్‌కళాశాలలో సోమవారం ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు ఆందోళనకు దిగారు. అడ్డువచ్చిన కళాశాల సిబ్బందిని చితకబాదారు. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని యంనంపేట్‌లో గల శ్రీనిధి ఇంజనీరింగ్‌ కళాశాలలో కొద్ది రోజులుగా విద్యార్థులు, యాజమాన్యం మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. కొంతమంది విద్యార్థులను కళాశాల యాజమాన్యం అకారణంగా డిటైన్‌ చేశారని గతనెల 31న ఈవిషయమై విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి ఏబీవీపీ నాయకులు కళాశాల వద్దకు వెళ్లి లోపలికి అనుమతించకపోగా వారిపై కళాశాల సెక్యూరిటీ సిబ్బంది దాడిచేసిన విషయం తెలిసిందే. దీంతో ఆగ్రహించిన ఏబీవీపీ నేతలు సోమవారం కళాశాలలోకి ప్రవేశించి అడ్డువచ్చిన వారిని చితకబాదారు. కళాశాలలో అద్దాలను, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పోచారం ఐటీ కారిడార్‌ పోలీసుస్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌రెడ్డి తన సిబ్బందితో వెళ్లి దాడులకు పాల్పడిన 13మందిని అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేశారు. దాదాపు రెండు నెలలుగా తరచూ శ్రీనిధి ఇంజనీరింగ్‌ కళాశాల ఆందోళనలతో దద్దరిల్లుతోంది. యూనివర్సిటీ అనుమతి లేకపోయాని విద్యార్థులను చేర్చుకొని కళాశాల యాజమాన్యం అక్రమాలకు పాల్పడిందని విద్యార్థి సంఘాలు విద్యార్థులకు మద్దతుగా ఆందోళనలు చేసిన విషయం పాఠకులకు తెలిసిందే. తాజాగా దాడులు, ప్రతిదాడులు జరుగుతుండటంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-09-05T00:24:13+05:30 IST