కోడ్ కూసినా!
ABN , First Publish Date - 2023-02-14T23:42:33+05:30 IST
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నియామావళి (ఎలక్షన్‌కోడ్) అమల్లోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్నే వాయిదా వేసింది.
యథేచ్ఛగా ప్రజా ప్రతినిధుల శంకుస్థాపనలు
కంటి వెలుగు కేంద్రాలు ప్రారంభం
జడ్పీలోనూ స్థాయిసంఘ ఆదేశాలు
స్థానిక సంక్షేమ సంఘాలతో పనులు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యేలు
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 14): ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నియామావళి (ఎలక్షన్‌కోడ్) అమల్లోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్నే వాయిదా వేసింది. అయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎన్నికల కోడ్‌ఉల్లంఘన పలు చోట్ల యథేచ్ఛగా సాగుతోంది. ఎన్నికల కోడ్‌ను కొందరు ప్రజా ప్రతినిధులు ఖాతరు చేయడం లేదు. ఈ విషయంలో ఎన్నికల అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ఎన్నికల కోడ్‌కు తూట్లు పడుతున్నాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఈనెల 9వ తేదీ నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయా కూడల్లో ఉన్న నేతల విగ్రహాలకు సైతం ముసుగులు వేస్తున్నారు. కానీ ఉమ్మడి జిల్లాలో అనేక చోట్ల స్థానిక ప్రజాప్రతినిధులు పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూనే ఉన్నారు. అలాగే రంగారెడ్డి జిల్లా పరిషత్‌లో స్థాయి సంఘ సమావేశాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఒకవేళ ఈ సమావేశాలు నిర్వహించాల్సి వస్తే ఎన్నికల సంఘం అనుమతి తీసుకుని కేవలం పథకాలపై సమీక్ష చేయాల్సి ఉంటుంది. సభ్యులు తీర్మానాలు చేయకూడదు. కానీ రంగారెడ్డి జిల్లా స్థాయి సంఘ సమావేశాల్లో తీర్మానాలకు బదులు సభ్యులు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అలాగే పలు చోట్ల కంటి వెలుగు కార్యక్రమాలను స్థానిక ప్రజా ప్రతినిఽధులు ప్రారంభిస్తున్నారు. వాస్తవానికి ఎన్నికల కోడ్ కారణంగా ఈ కార్యక్రమాలను అధికారులు ప్రారంభించాల్సి ఉంది.
భలే తెలివి..
ఇదిలా ఉంటే కొందరు ప్రజా ప్రతినిధులు ఎన్నికల కోడ్ ఆంక్షలను తెలివిగా తప్పించుకుంటున్నారు. తమపరిధిలో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను స్థానిక కాలనీ సంక్షేమ సంఘాల నేతలతో చేస్తున్నారు. తరువాత వెళ్లి అక్కడ ప్రసంగిస్తున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఇదే బాట ఎంచుకుంటున్నారు. ఇక మరికొందరు ప్రజా ప్రతినిధులు చాటుమాటున కల్యాణలక్ష్మి . ఇతర పథకాల చెక్‌లను పంపిణీ చేసి లబ్ధిదారులను ఇళ్లకే పిలిపించుకుని కృతజ్ఞత కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు . ఇక ఈ మాదిరిగానే స్థానిక జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, సర్పంచ్‌లు కూడా రోడ్డు నిర్మాణ పనులు, ఇతర అభివృద్ధి కార్యక్రమలను ప్రారంభిస్తున్నారు. అధికార పార్టీకి పోటీగా బీజేపీ ప్రజా ప్రతినిధులు కూడా పలు చోట్ల కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి ఆరోగ్య యోజన పథకాలను ప్రారంభిస్తున్నారు.
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
జడ్పీ చైర్‌పర్సన్ తీగల అనితాహరినాథ్‌రెడ్డి
రంగారెడ్డి అర్బన్, ఫిబ్రవరి 14 : విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జడ్పీ చైర్‌పర్సన్ తీగల అనితాహరినాథ్‌రెడ్డి హెచ్చరించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో రెండు రోజులపాటు నిర్వహించిన స్థాయీ సంఘాల సమావేశాలు ముగిశాయి. మంగళవారం ఉదయం 10గంటలకు గ్రామీణాభివృద్ధి, (స్థాయీ సంఘం-2), ఉదయం 11-30గంటలకు విద్య, వైద్యం (స్థాయీ సంఘం-4), మధ్యాహ్నం 12-30గంటలకు ఆర్థిక, ప్రణాళిక (స్థాయీ సంఘం-1) పై సమీక్ష నిర్వహించారు. సమావేశానికి గైర్హాజరైన కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా స్థాయి సమావేశాలకు అధికారులు హాజరు కాకుండా.. కొందరు కిందిస్థాయి సిబ్బందిని పంపించడం సరికాదని హెచ్చరించారు. కడ్తాల్ మండలంలో ఎక్సో ఫాబ్‌మెటీరియల్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండియా నుంచి శబ్ధకాలుష్యం ఎక్కువగా ఉందని జడ్పీటీసీ దశరథ్‌నాయక్ చైర్‌పర్సన్ దృష్టికి తీసుకెళ్లారు. ఇబ్రహీంపట్నం కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌లో సర్జరీలు జరిగేలా చూడాలని డీసీహెచ్‌ఎ్‌స వరదాచారిని ఆదేశించారు. ‘మన ఊరు - మన బడి’ కింద 38పాఠశాలలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. గ్రామాల్లో వేలాడుతున్న విద్యుత్‌తీగలను సరిచేయాలని సభ్యులు చైర్‌పర్సన్ దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలో 2.07 లక్షల పింఛన్లు ఇస్తున్నట్లు, కొత్తగా 15వేల పింఛన్లు మంజూరైనట్లు తెలిపారు. బ్యాంకు లింకేజీ ద్వారా రూ.865 కోట్లకు రూ.666.75లక్షల బ్యాంకు రుణాలు డ్వాక్రా మహిళలకు అందించినట్లు చెప్పారు. మిగతావి ఈనెలాఖరు వరకు పూర్తిచేస్తామని తెలిపారు. పీఎంఎఫ్ ద్వారా 161 కొత్త యూనిట్లు మంజూరైనట్లు, అందులో 100 యూనిట్లను గ్రౌండింగ్ చేసినట్లు చెప్పారు. జిల్లాలో 89,451 లబ్ధిదారులు డబుల్‌బెడ్‌రూం ఇళ్లకు దరఖాస్తు చేసుకోగా 2,964మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు తెలిపారు. జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా పౌల్ర్టీ, డెయిరీఫాం, సెరికల్చర్, ఫిషరీస్ పరిశ్రమల ఏర్పాటుకు సబ్సిడీ ఇస్తున్నట్లు చెప్పారు. ‘కంటివెలుగు’ పథకం కింద రోజుకు పది వేల మంది లబ్ధిపొందుతున్నట్లు తెలిపారు. సమావేశంలో జడ్పీటీసీ సభ్యులు మహిపాల్, దశరథ్ నాయక్, కోఆప్షన్ సభ్యుడు అలీ అక్బర్‌ఖాన్, శ్రీలత, జంగమ్మ, వెంకట్‌రాంరెడ్డి, సీఈవో దిలీ్‌పకుమార్, డిప్యూటీ సీఈవో రంగారావు పాల్గొన్నారు.