రోడ్డు విస్తరణకు రంగం సిద్దం
ABN , First Publish Date - 2023-03-11T23:15:02+05:30 IST
మేడ్చల్ జాతీయరహదారి విస్తరణ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పనులకు అడ్డుగా ఉన్న కట్టడాలను తొలగించటానికి ముహూర్తం ఖరారైంది.
మేడ్చల్‌లో రహదారికి ఇరువైపుల
75 అడుగుల వరకు కట్టడాల తొలగింపు
బుధవారం నుంచి పనులు ప్రారంభం
మార్కింగ్ చేస్తూ సూచనలు చేస్తున్న ఎన్‌హెచ్‌హైవే సిబ్బంది
మేడ్చల్‌టౌన్, మార్చి11 : మేడ్చల్ జాతీయరహదారి విస్తరణ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పనులకు అడ్డుగా ఉన్న కట్టడాలను తొలగించటానికి ముహూర్తం ఖరారైంది. మేడ్చల్‌లో రోడ్డుకు ఇరువైపుల ఎన్ని అడుగుల మేరకు విస్తరణ పనులు చేపడుతారన్న విషయం పట్ల జాతీయర రహదారుల అధికారులు స్థానికులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. రోడ్డు మధ్య నుంచి ఇరువైపుల 75 అడుగుల వరకు రోడ్డు విస్తరణ చేపట్ట న్నట్లు ప్రకటించారు. విస్తరణకు అడ్డుగా ఉన్న కట్టడాలను పూర్తిగా తొలగించి రోడ్డు పనులను ప్రారంభించటానికి అధికారులు సిద్దమవుతున్నారు. ఈ మేరకు అధికారులు రోడ్డు ఇరువైపున ప్రత్యేకంగా సర్వే చేసి నిర్మాణంలో అడ్డుగా ఉన్న భవనాలకు మార్కింగ్ చేసి సదరు యజమానులకు తెలియ జేశారు. వచ్చే బుధవారం నాటికి మార్కింగ్ చేసిన కట్టడాలను స్వతహాగా తొలగించుకోవాలని సూచించారు. ఒక వేళ తొలగించని ఎడల రహదారుల అధికారులు వాటిని తొలగించనున్నారు. ప్రస్తుతం తొలగిస్తున్న కట్టడాలు మేడ్చల్ చెక్‌పోస్టు నుంచి అత్వెల్లి వరకు జాతీయరహదారికి ఇరువైపుల ఉన్నాయి.
తొలగనున్న ఫుట్‌పాత్ ఆక్రమణలు
మేడ్చల్ పట్టణంలోని జాతీయరహదారి ఇరువైపుల ఫుట్‌పాత్ ఆక్రమణలే అధికంగా ఉన్నాయి. చిరు వ్యాపారులు సర్వీసు రోడ్డుకు ఆనుకుని ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక దుకాణాలు, డబ్బాలను తొలగించనున్నారు. చాలా వరకూ పాత జాతీయ రహదారి- కొత్త జాతీయ రహదారి మధ్య ఉన్న కట్టడాలు రోడ్డు విస్తరణ పనుల్లో తొలగించనున్నారు. అదే విధంగా వివేకానంద చౌరస్తా రోడ్డు నుంచి ఎస్‌వీ రెసిడెన్సీ వరకు గల జాతీయరహదారికి ఇరువైపుల, సర్వీస్ రోడ్డు వరకు ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక షెడల్లను పూర్తిగా తొలగించనున్నారు. ఇప్పటికే రహదారుల అధికారులు స్థానిక భవనాల యజమానులకు పూర్తి సమాచారం ఇచ్చి తొలగించే కట్టడాలకు మార్కింగ్ చేసి పూర్తి సమాచారం అందించారు.