ప్రగతిబాటలో తుక్కుగూడ మున్సిపాలిటీ

ABN , First Publish Date - 2023-06-26T00:03:39+05:30 IST

తుక్కుగూడ మున్సిపాలిటీ ప్రగతిబాటలో పయనిస్తూ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు.

ప్రగతిబాటలో తుక్కుగూడ మున్సిపాలిటీ
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న సబితాఇంద్రారెడ్డి

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం, జూన్‌ 25 : తుక్కుగూడ మున్సిపాలిటీ ప్రగతిబాటలో పయనిస్తూ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల ప్రత్యేక చొరవతో ఈ ప్రాంతానికి అనేక పరిశ్రమలు రావడంతో పరిశ్రమల హబ్‌గా తుక్కుగూడ తయారవుతుందని అన్నారు. ఆదివారం తుక్కుగూడ మున్సిపాలిటీలోని 10 వ వార్డుల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో నాళాలు, తాగునీరు సమస్యల పరిష్కారం కోసం రూ. 320కోట్లు కేటాయించినట్లు చెప్పారు. అదేవిధంగా సమీకృత మార్కెట్లు , వైకుంఠ ధామాలు నిర్మిస్తున్నామని.. సుమారు రూ.40 కోట్లతో పది చెరువుల సుందరీకరణ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. అభివృద్ధి సంక్షేమం మా నినాదం మా విధానమని సబిత అన్నారు. తుక్కుగూడ మున్సిపల్‌ కేంద్రంలోగల పురాతన బురుజు ఆధునీకరణకు రూ. 25లక్షలు మంజూరయ్యాయన్నారు. అదేవిధంగా మెట్రోరైలును తుక్కుగూడ వరకు పొడిగించాలని ముఖ్యమంత్రి కెసీఆర్‌ను కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ మధుమోహన్‌, వైస్‌చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్లు సప్పిటి లావణ్యరాజు, రవినాయక్‌, సుమన్‌, తేజశ్విని శ్రీకాంత్‌, బీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ అధ్యక్షుడు జెల్లల లక్ష్మయ్య, కమిషనర్‌ వెంకట్రాం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T00:03:39+05:30 IST