వణికించిన వడగళ్లు
ABN , First Publish Date - 2023-03-17T00:23:45+05:30 IST
ఉమ్మడి జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వాతావరణంలో ఏర్పడిన మార్పులతో గురువారం పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.
వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షం
రాళ్లవానతో కశ్మీరును తలపించిన మర్పల్లి
కోటమర్పల్లి, పంచలింగాల, మర్పల్లిలో భారీగా పంటనష్టం
రాష్ట్రంలో అత్యధికంగా పొద్దుటూరులో 46 మి.మీ వర్షపాతం నమోదు
అకాల వర్షం ఉమ్మడి జిల్లాను వణికించింది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో గురువారం కురిసిన వడగళ్ల వాన ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. రాళ్లవానకు ఇళ్లు, పంటలు ధ్వంసమయ్యాయి. పలువురు గాయపడ్డారు. రోడ్లపై కుప్పలు తెప్పలుగా మంచు గడ్డలు పడటంతో పలు ప్రాంతాలు కశ్మీర్‌ను తలపించాయి.
రంగారెడ్డి అర్బన్, మార్చి 16 : ఉమ్మడి జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వాతావరణంలో ఏర్పడిన మార్పులతో గురువారం పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వికారాబాద్ జిల్లా మర్పల్లిలో భారీ వడగళ్ల వర్షం కురిసింది. కశ్మీరును తలపించేలా వడగళ్ల వాన కురిసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో శంకర్‌పల్లి మండలం పొద్దుటూరులో అత్యధిక వర్షం కురిసింది. రాష్ట్రంలో అత్యధికంగా పొద్దుటూరులో 46 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలో 29.0 మిల్లీమీటర్లు, అత్యల్పంగా మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ గాయత్రీనగర్‌లో 5.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
వికారాబాద్ జిల్లాలో...
మర్పల్లి/మోమిన్‌పేట్/వికారాబాద్/యాలాల/ఘట్‌కేసర్ రూరల్, మార్చి 16: మర్పల్లి మండలంలో గురువారం 40 నిమిషాల పాటు భారీ వడగళ్ల వాన కురిసింది. వడగళ్ల వర్షానికి మర్పల్లి, కోటమర్పల్లి, పంచలింగాల్ గ్రామాల్లో భారీగా పంటనష్టం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా కుప్పలుతెప్పలుగా వడగళ్ల పడటంతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. రోడ్లన్నీ వడగళ్లతో మంచు దుప్పటి కప్పినట్టు కన్పించాయి. తమ ప్రాంతంలో ఎప్పుడూ ఇలాంటి వడగళ్ల కురవలేదని వృద్ధులు తెలిపారు.
కశ్మీర్‌ను తలపించిన మర్పల్లి
మర్పల్లి మండలంలోని చాలా గ్రామాల్లో వడగళ్ల వాన కురిసింది. ఎక్కడ చూసినా మంచు రాళ్లు కప్పేయడంతో మర్పల్లి కశ్మీర్‌ను తలపించింది. రోడ్డుపై పడిన వడగళ్లపై నుంచి వాహనాలు వెళుతుంటే తాము ఎప్పుడూ లేని వింత అనుభూతి పొందామని, కశ్మీర్‌లో ఉన్నట్టు అనిపించిందని స్థానికులు, వాహనదారులు అన్నారు. చిన్నారులు బయటకొచ్చి వడగళ్లతో ఆడుతూ, పాడుతూ గడిపారు. మరి కొందరు ఇళ్ల ముందు పడిన వడగళ్లను గంపలతో బయట పారబోశారు.
పొలాలను పరిశీలించిన ప్రజాప్రతినిధులు
మండలంలో వడగండ్ల వర్షానికి భారీగా దెబ్బతిన్న పంటలను జడ్పీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, జడ్పీటీసీ మధుకర్, ఇతర ప్రజాప్రతినిధులు కోట్‌మర్పల్లి, మర్పల్లిలో పర్యటించి పరిశీలించారు. పాడైన పంటల వివరాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిహారం అందేలా చూస్తామని రైతులకు హామీ ఇచ్చారు. మోమిన్‌పేట్, సయ్యదలిపూర్, ఎన్కెపల్లి గ్రామాల్లో వడగళ్లు బీభత్సం సృష్టించాయి. సైదలిపూర్‌లో ఇంటి ఆవరణలో నిల్చున్న కేసారం లక్ష్మమ్మ అనే మహిళ తలపై వడగళ్లు పడటంతో గాయమైంది. ఇదే గ్రామంలో పులుమద్ది బుచ్చిరెడ్డి, మణెమ్మ, మరో వ్యక్తి పొలం నుంచి ఇంటికి వస్తుండగా తలపై మంచురాళ్లు పడి గాయాలయ్యాయి. స్థానికులు వారిని మోమిన్‌పేట్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఎన్కెపల్లిలో ఉల్లి, టమాట, మొక్కజొన్న, బొప్పాయ తోటలు ధ్వంసమయ్యాయి. అలాగే చెట్టుకున్న చింతపండు మొత్తం నాని పనికి రాకుండా పోయిందని రైతు విఠల్‌రెడ్డి వాపోయాడు. ఎన్కతల-టేకులపల్లి మార్గంలో ఇసుక వాగు వడగళ్ల వర్షానికి పొంగిపొర్లింది. జొన్న, క్యాలీఫ్లవర్, ఆలూ, క్యారెట్, వంకాయ, కొత్తిమీర పంటలు దెబ్బతిన్నాయి. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్‌ల సంఘం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు, సర్పంచ్ కొనింటి సురేశ్ డిమాండ్ చేశారు. వడగళ్ల వానకు మోమిన్‌పేట్ మండలంలో వెయ్యి ఎకరాల్లో పలు పంటలు దెబ్బతిన్నాయి. రైతులకు ఎకరానికి రూ.25వేల చొప్పున ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని కోరారు. వికారాబాద్ పట్టణం, సమీప గ్రామాల్లో వడగళ్ల వాన కురిసింది. చిరుజల్లులతో మొదలై చివరకు వడగళ్లు పడ్డాయి. వికారాబాద్‌లో జల్లులు, పీరంపల్లి, సిద్ధులూరు, పులుసుమామిడి గ్రామాల్లో వడగళ్లు కురిశాయి. యాలాల మండలంలో సాయం త్రం మోస్తరు వర్షం కురిసింది. కాగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఘట్‌కేసర్ మండలంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఎండ ఉండి, సాయంత్రం చిరుజల్లులు కురిశాయి. ఘట్‌కేసర్‌లో ఉదయం నుంచే మేఘావృతమైంది. పట్టపగలే చీకటిగా అన్పించింది.
భారీగా పంట నష్టం
వడగండ్లతో కూడిన భారీ వర్షానికి మర్పల్లితో పాటు కోట్‌మర్పల్లి, పంచలింగాల్ గ్రామాల్లో వందల ఎకరాల్లో మొక్కజొన్న, ఉల్లి, టమాట, క్యాలీఫ్లవర్, పుచ్చకాయ పంటలు దెబ్బతిన్నాయి. అసలే ధర లేక అల్లాడుతుంటే ఈ వడగండ్లతో పంట మొత్తం నష్టపోయామని ఉల్లి రైతులు వాపోయారు. వెయ్యి ఎకరాలకు పైగా ఉల్లి పంట దెబ్బతింది. మూడు గ్రామాల్లో వడగండ్ల వానకు వందలాది ఎకరాల్లోని కూరగాయల పంటలు దెబ్బతిన్నాయని, త్వరలోనే సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిన పంపుతామని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
రంగారెడ్డి జిల్లాలో...
ఆమనగల్లు / ఇబ్రహీంపట్నం / మంచాల/ మహేశ్వరం / కందుకూరు/శంషాబాద్/ కొందుర్గు/నందిగామ / కొత్తూర్/ చౌదరిగూడ/ చేవెళ్ల /షాబాద్/శంకర్‌పల్లి/ మొయినాబాద్/ మొయునాబాద్ రూరల్ / మాడ్గుల/ యాచారం, మార్చి16 : ఆమనగల్లు, కడ్తాల, తలకొండపల్లి మండలాల పరిధిలో గురువారం సాయంత్రం అకాల వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో అరగంట పాటు వడగళ్ల వాన కురిసింది. దీంతో రోడ్లు జలమయమయ్యాయి. పలుచోట్ల మామిడి చెట్లకు పూత రాలింది. ఇబ్రహీంపట్నంలో ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు మబ్బులు కమ్ముకున్నాయి. మంచాల మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. దాద్‌పల్లిలో వడగళ్ల వాన కురవడంతో వరి, కూరగాయ తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మహేశ్వరం మండలంతోపాటు తుక్కుగూడ మున్సిపల్ పరిధిలో గురువారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. కందుకూరు మండలంలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ వేడి తీవ్రంగా ఉండి.. ఒక్కసారిగా మబ్బులు కమ్ముకొని సుమారు 45నిమిషాలు వర్షం కురిసింది. శంషాబాద్ మున్సిపల్ కేంద్రంలోని వివిధ బస్తీల్లో గురువారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. బస్తీల్లో వర్షపునీరు వరదలై పారింది. కొందుర్గు మండల కేంద్రంలో అరగంటపాటు చిరుజల్లులు పడ్డాయి. అదేవిధంగా నందిగామ మండల కేంద్రంలో ఈదురుగాలులతో వర్షం కురిసింది. కొత్తూర్ మండలంలో గాలులతో కూడిన చిరుజల్లులు పడ్డాయి. చౌదరిగూడ మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో చిరుజల్లులు పడ్డాయి. చేవెళ్ల డివిజన్ పరిధిలోని చేవెళ్ల, షాబాద్, శంకర్‌పల్లి, మొయినాబాద్ తదితర మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. చేవెళ్ల మండలం ఆలూర్, తంగేడ్‌పల్లి, కౌకుంట్ల, తల్లారం, న్యాలట, సింగప్పగూడ తదితర గ్రామాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వాన పడింది. మాడ్గుల మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన పందుల లక్ష్మయ్యగౌడ్ (49) తాటిచెట్టుపై నుంచి పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. వర్షం కురిసిన తర్వాత చెట్టు ఎక్కడంతో జారిపడి తలకు తీవ్రగాయమైంది.
యాచారంలో వడగళ్ల బీభత్సం
యాచారం మండలం మొండిగౌరెల్లి, మంతన్‌గౌరెల్లి, నల్లవెల్లి తదితర గ్రామాలలో ఉరుములు, మెరుపులతో భారీ వడగళ్ల వర్షం కురిసింది. మంతన్‌గౌరెల్లిలో 120 వరకు రేకుల ఇళ్లు ధ్వంసమయ్యాయి. రెండు బాయిలర్ కోళ్లఫాంలలో కోడిపిల్లలు చనిపోయాయి. రేకుల ఇళ్లు ధ్వంసం కావడంతో లక్ష్మమ్మ(45), పదో తరగతి చదువుతున్న మమత(16) తీవ్రంగా గాయపడ్డారు. అదేవిధంగా వడగళ్ల కారణంగా యాదయ్య, వెంకటయ్య, లక్ష్మయ్య, థావ్‌నాయక్, రాములు నాయక్‌లకు చెందిన టమాట, వరి పంటలకు నష్టం వాటిల్లింది. మంతన్‌గౌరెల్లిలో కాకులారం శ్రీను, గణేష్, రమేష్‌లకు చెందిన కోళ్లఫాంల రేకులు ధ్వంసమై కోడిపిల్లలు చనిపోయాయి. దీంతో రూ.3లక్షల మేర నష్టం వాటిల్లిందని వారు చెప్పారు. మంతన్‌గౌరెల్లిలో కె.యాదయ్యకు చెందిన రెండెకరాల మామిడి తోట, సపావట్ శ్రీనుకు చెందిన డ్రాగన్‌ఫ్రూట్ తోట పూర్తిగా ధ్వంసమైంది. గ్రామంలో వడగళ్ల బీభత్సానికి పంటలతోపాటు ఇళ్లు ధ్వంసమైన వారిని ఎంపీపీ కొప్పు సుకన్యబాషా, ఎంపీడీవో విజయలక్ష్మి, ఎంపీవో ఉమారాణి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ వెన్నెల, ఇన్‌స్పెక్టర్ లింగయ్య, ఎస్సై గోపాల్ ఓదార్చారు. వడగళ్ల వానతో నష్టపోయిన వారిని ఆదుకుంటామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చెప్పారు. శుక్రవారం మంతన్‌గౌరెల్లిలో పర్యటించనున్నట్లు చెప్పారు.
ఉమ్మడి జిల్లాలో నమోదైన వర్షపాతం (మి.మీ.)
జిల్లా మండలం ప్రాంతం వర్షపాతం
రంగారెడ్డి శంకర్‌పల్లి పొద్టుటూర్ 46
రాజేంద్రనగర్ బూర్గంపహాడ్ 41.0
రాజేంద్రనగర్ శివరాంపల్లి 40.0
మొయినాబాద్ మొయినాబాద్ 35.3
చేవెళ్ల ధర్మసాగర్ 32.8
యాచారం గున్‌గల్ 32.0
మొయినాబాద్ కేతిరెడ్డిపల్లి 24.0
ఆమనగల్లు ఆమనగల్లు 23.0
కందుకూరు మీర్‌ఖాన్‌పేట్ 22.0
అబ్దుల్లాపూర్‌మెట్ తుర్కయంజాల్ 18.8
బాలాపూర్ మామిడిపల్లి 18.8
వికారాబాద్ మోమిన్‌పేట్ మోమిన్‌పేట్ 29.0
మర్పల్లి మర్పల్లి 28.0
దౌల్తాబాద్ దౌల్తాబాద్ 17.0
మేడ్చల్ కుత్బుల్లాపూర్ గాయత్రీనగర్ 5.5