చవితి సందడి

ABN , First Publish Date - 2023-09-13T00:30:52+05:30 IST

జై బోలో గణేష్‌ మహరాజ్‌కీ.. జై! అని అనేందుకు ఇంకా ఎన్నో రోజులు లేదు. కేవలం ఏడు రోజులున్నాయి. వినాయక చవితి పండగ సమీపిస్తుండటంతో కళాకారులు విగ్రహాల తయరీని వేగవంతం చేశారు. షెడ్లలో తయారు చేస్తున్న వినాయక విగ్రహాలకు తయారీదారులు తుది మెరుగులు దిద్దుతున్నారు.

చవితి సందడి
చేవెళ్లలో తయారు చేసిన గణేష్‌ ప్రతిమలు

ప్రతిష్ఠకు సిద్ధమవుతున్న గణపతి విగ్రహాలు

గ్రామాలకు తరలుతున్న వినాయక ప్రతిమలు

భారీగా మండపాల ఏర్పాటు పనుల్లో నిర్వహకులు, ఉత్సవ కమిటీలు

ఈ నెల 18 నుంచి గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌, సెప్టెంబరు 12): జై బోలో గణేష్‌ మహరాజ్‌కీ.. జై! అని అనేందుకు ఇంకా ఎన్నో రోజులు లేదు. కేవలం ఏడు రోజులున్నాయి. వినాయక చవితి పండగ సమీపిస్తుండటంతో కళాకారులు విగ్రహాల తయరీని వేగవంతం చేశారు. షెడ్లలో తయారు చేస్తున్న వినాయక విగ్రహాలకు తయారీదారులు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇప్పటికే సిద్ధమైన విగ్రహాలు వివిధ రూపాల్లో చూపరులకు కనువిందు చేస్తున్నాయి. రెండు ఫీట్ల ఎత్తు వినాయకుడి నుంచి మొదలుకొని తొమ్మిది ఫీట్ల ఎత్తు లంబోదరుడి వరకు విగ్రహాలను తయారు చేస్తున్నారు. అలాగే ఆర్డర్ల ద్వారా విగ్రహాలను తయారు చేయించుకునే వారు కొన్ని రోజుల ముందే కొంత నగదు అడ్వాన్స్‌ ఇచ్చి తమకు నచ్చే ఆకృతిలో విగ్రహాలను తయారు చేయించుకున్నారు. ఈ నెల 18న వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఇప్పటి నుంచే వినాయక ఉత్సవ కమిటీలు విగ్రహాల తయారీ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. వినాయక నవరాత్రులను పురస్కరించుకొని మండపాలు రూపుదిద్దుకుంటున్నాయి. మండపాల ఏర్పాట్లలో ఉత్సవ కమిటీలు, యువత నిమగ్నమయ్యారు. విగ్రహాల తయారీ ప్రాంగణాల నుంచి గణనాథులను మండపాలకు తరలిస్తున్నారు. డీసీఎంలు, లారీలు, ట్రాలీల్లో గణనాథులను గ్రామాలు, పట్టణాల్లోని వీధులకు తరలిస్తున్నారు.

యువకులను ఆకట్టుకునే నేతల ప్రణాళిక

అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్నాయి. ఈ తరుణంలో వినాయక విగ్రహాలకు భలే గిరాకీ ఏర్పడింది. కరోనా ప్రభావంతో గడిచిన రెండేళ్లు వినాయక ఉత్సవాలను నామామాత్రంగా నిర్వహించారు. ఈ సారి భారీ సంఖ్యలో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి రెట్టింపు స్థాయిలో చవితి ఉత్సవాలను చేసుకునేందుకు భక్తులు, యువకులు సిద్ధమవుతున్నారు. కొద్ది రోజుల్లో జరిగే ఎన్నికల్లో పోటీచేయాలనుకుంటున్న వినాయక విగ్రహాలను తమ సొంత ఖర్చుతో ఏర్పాటు చేయిస్తామని, పది రోజుల పాటు ఉత్సవాలకు అయ్యే ఖర్చును సైతం తాము భరిస్తామంటూ ముందుకు వస్తున్నారు. అలాగే మరికొందరు నేతలు మండలపాల గెకరేషన్‌కు, సెట్టింగ్‌లకు అయ్యే ఖర్చులకు ఆర్థికసాయం చేస్తామంటూ ఓట్ల కోసం యువకులను బుట్టలో వేసుకునే పనిలో పడ్డారు. ఇదిలా ఉంటే ఇప్పటికే చాలా చోట్ల వివిధ రాజకీయ పార్టీల నాయకులు గణేశ్‌ విగ్రహాలకు ఆర్డర్లు ఇచ్చారు.

ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారి్‌స విగ్రహాలతో పర్యావరణ కాలుష్యం

వినాయకులను తయారు చేసే ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ నీటిలో కరగదు. మట్టిలో కలవదు. నిప్పునకూ దహనం కాదు. దీని ముడిపదార్థం జిప్సం. పీఓపీతో తయారు చేసిన వినాయక విగ్రహాలను చెరువుల్లో, ఇతర నీటి వనరుల్లో వేస్తాం. ఆ నీటిని మనుషులు, ఇతర జీవరాసులు వాడితో హాని కలిగించే ఆస్కారం ఉంది. విగ్రమాల తయారీలో వాడే హానికారక రసాయనాలతో డయేరియా, చర్మ వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. చర్మం రంగు మారడం, స్కిన్‌ క్యాన్సర్‌కు ఆస్కారం ఉంది. ఆర్సానిక్స్‌ వల్ల తల వెంట్రుకలు ఊడతాయి. సీసం ప్రభావంతో కడుపు నొప్పి వస్తుంది. శరీర పటుత్వం తగ్గుతుంది. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌, రంగులతో తయారు చేసిన వినాయక ప్రతిమలను నిమజ్జనం చేసిన నీటిని వినియోగిస్తే వివిధ రకాల వ్యాధులొస్తాయి. జల చరాలు, పశువులకూ ఆ నీటితో ముప్పే, అందుకే రసాయనాలతో చేసిన విగ్రహాలను తగ్గించాలంటూ ఏటా పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. వినాయక విగ్రహాలు వేసిన రసాయన నీటిని పొలాలకు మళ్లిస్తే భూసారం తగ్గి భూమి సహజ స్వరూపాన్ని కోల్పోతుంది. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌, ప్రతిమలతో అన్నీ ఇబ్బందులే. విగ్రహాల తయారీకి వాడే రసాయనాలు నీటిలో కరిగేందుకు 45రోజుల నుంచి ఏడాది వరకు సమయం పడుతుంది. వినాయక ప్రతిమల తయారీకి ఉపయోగించే క్లాడ్మియం చాలా ప్రమాదకర రసాయన పదార్థం. ప్రతిమల్లో అదనపు ఆకర్షణకు దీన్ని వాడతారు. పీవోపీ చిట్లినట్లు.. పగుళ్లు రాకుండా చూసేందుకు ప్రతిమ దృఢత్వానికి దీనిని వినియోగిస్తున్నారు. మనిషి మెదడుపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. బ్రెయిన్‌ క్యాన్సర్‌కు కారణమవుతుంది. తయారీ చోట గర్భిణులుంటే పుట్టబోయే శిశువులపైనా విషప్రభావం చూపుతుంది. వినాయక విగ్రహాల తయారీలో ఇలాంటి ప్రమాదకర రసాయనాలెన్నో వినియోగిస్తున్నారు.

మట్టి గణపతులకు పెరుగుతున్న ఆదరణ

పర్యావరణ హితాన్ని కాంక్షిస్తూ.. రసాయనాలు, పీఓపీల దుష్ప్రభావాలపై పెరుగుతున్న అవగాహనతో యేటేటా మట్టివిగ్రహాలకు ఆదరణ పెరుగుతోంది. పర్యావరణ ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థలు ఇళ్లలో పూజించుకునే మట్టి విగ్రహాలను ప్రజలకు ఉచితంగా ఇస్తుంటారు. పరిసరాలను మనం కాపాడితే అవి మనల్ని కాపాడుతాయనే భావనతో నవరాత్రుల్లో మట్టి వినాయకులనే పూజించాలనే స్పృహ ప్రజల్లోనూ ఏటికేడు ఎక్కువవుతోంది. చాలా చోట్ల మండపాలపై సైతం మట్టితో చేసిన వినాయకులను ప్రతిష్ఠించేందుకు ఆసక్తి చూపుతున్నారు. రంగుల దిద్దిన విగ్రహాలతో పోలిస్తే మట్టి విగ్రహాల ధర కూడా చలా తక్కువగా ఉంటుంది.

మట్టి విగ్రహాలను పూజించాలి : రామకృష్ణారావు, రాష్ట్ర పర్యావరణ వేత్త

మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలి. పర్యావరణ పరిరక్షణ కోసం 2005 నుంచి మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేస్తున్నా. గత ఏడాది నేను 600 వరకు మట్టి వినాయకులను పంపిణీ చేశాను. ఈ సారి వెయ్యి వరకు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేస్తా. ఇంట్లో పూజించుకునేందుకు చిన్నసైజు విగ్రహాలు, 20గ్రామాల్లో ఐదు ఫీట్ల ఎత్తున్న గణేష్‌ విగ్రహాలను ఉచితంగా అందించేందుకు నా వంతుగా కృషి చేస్తున్నా. వినాయక విగ్రహాల కోసం యేటా నా జీతంలో నుంచి కొంత వెచ్చిస్తున్నాను. ఈ సారి రూ.20వేల వరకు ఖర్చు చేసి చిన్న సైజు విగ్రహాలను భక్తులకు అందజేస్తున్నా.

ఈ సారి డిమాండ్‌ బాగుంది : మదన్‌, విగ్రహాల వ్యాపారి/కళాకారుడు

చేవెళ్లలో విగ్రహాలను తయారు చేస్తున్నాం. మూడేళ్ల క్రితం రాజస్థాన్‌ నుంచి చేవెళ్లకు వచ్చాం. ప్రతీ సంవత్సరం విగ్రహాలను తయారు చేస్తున్నాము. విగ్రహాల తయారీలో 12 మంది కూలీలకు ఉపాధి పొందుతున్నారు. వినాయక చవితికి నాలుగు నెలల ముందు నుంచి విగ్రహాల తయారీని ప్రారంభిస్తాం. ఈ సారి గణేష్‌ విగ్రహాలకు డిమాండ్‌ బాగానే ఉంది. నా వద్ద ఇప్పటికే 50 విగ్రహాలు బుక్‌ అయ్యాయి. ఇప్పటి వరకు 200 విగ్రహాల వరకు తయారు చేసి అమ్మకానికి సిద్ధం చేశాం. ఒక్కో విగ్రహం ధర 10వేల నుంచి 50వేల వరకు ఉన్నాయి. ముడి సరుకుల ధరలు పెరిగిన కారణంగా గతేడాది కంటే ఈ సారి విగ్రహాల రేట్లు 10శాతం వరకు పెంచాల్సి వచ్చింది. ప్రస్తుతం మా వద్ద అన్ని రకాల విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి.

ధూల్‌పేట్‌ నుంచి తెచ్చి అమ్ముతున్నాం : సత్యనారాయణసింగ్‌లోత, హిమాయత్‌నగర్‌, మొయినాబాద్‌ మండలం

కొన్నేళ్ల నుంచి విగ్రహాలు తయారు చేస్తున్నాం. మేము తయారు చేసే విగ్రహాలకు ఎంతో డిమాండ్‌ ఉండేది. విగ్రహాల ఏర్పాటుకు వినియోగించే రంగులు, ఇతర వస్తువుల ధరలు బాగా పెరిగాయి. దీంతో మాకు గిట్టుబాటు కావడం లేదు. నష్టం వస్తోందని విగ్రహాల తయారీ మానేశం. నగరంలోని ధూల్‌పేట నుంచి తెచ్చి అమ్ముతున్నాం. ఫీట్‌ ఎత్తు విగ్రహం నుంచి 9 ఫీట్ల విగ్రహాల వరకు అమ్ముతున్నాం. రూ.రెండు వేలు మొదలుకొని 30వేల వరకు విలువ చేసే విగ్రహాలు మా వద్ద ఉన్నాయి.

Updated Date - 2023-09-13T00:30:52+05:30 IST