గోడ దూకుదామా?
ABN , Publish Date - Dec 18 , 2023 | 11:45 PM
అధికార కాంగ్రెస్ పార్టీకి ఇతర పార్టీల నుంచి వలసలు పొటెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి అధికారం చేపట్టిన విషయం తెలిసిందే.
అధికార పార్టీ వైపు బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల చూపు
స్థానిక ఎన్నికలకు ముందుగానే కాంగ్రె్‌సలోకి వెళ్లేందుకు సన్నాహాలు
కొందరు ఎమ్మెల్యేలు సైతం పక్కచూపులు
అందరిదీ గతంలో పార్టీ మారిన చరిత్రే
కండువా మార్చేద్దామంటూ కేడర్ నుంచి బడా నేతలపై పెరిగిన ఒత్తిళ్లు
పార్లమెంట్ ఎన్నికల్లోపే బీఆర్‌ఎ్‌సను దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్ వ్యూహం
బీఆర్‌ఎస్ నేతల రాకపై స్థానిక కాంగ్రెస్ నేతల నుంచి వ్యతిరేకత
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజకీయం మరింత రంజుగా మారనుంది. బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రె్‌సలో చేరేందుకు రాయబేరాలు నడుపుతున్నారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎ్‌సలోకి వివిధ పార్టీల నుంచి చేరిన నేతలంతా ఇప్పుడు మళ్లీ అధికార కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధపడుతున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలపై వారి అనుచరులు కూడా పార్టీ మారాలని తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. ప్రతిపక్షంలో ఉంటే మనుగడ అసాధ్యమని, అందుకే కాంగ్రె్‌సలో చేరాలని వారు తమ నేతలకు చెబుతున్నారు. ఇప్పుడే పార్టీలో చేరి స్థానిక ఎన్నికల్లో సీట్లు సాధించాలన్న తొందరలో పార్టీ నేతలు ఉన్నట్టు సమాచారం.
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి) : అధికార కాంగ్రెస్ పార్టీకి ఇతర పార్టీల నుంచి వలసలు పొటెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం బీఆర్‌ఎస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో ‘హస్తం’ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలో స్థానిక ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో అధికార పార్టీ కూడా క్షేత్రస్థాయిలో బలపడేందుకు చేరికలను ప్రోత్సహించాలని భావిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అధికార కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో బలపడలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో మినహా పట్టణ ప్రాంతాల్లో సీట్లు గెలవలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచినా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో టీఆర్‌ఎస్ పట్టు నిలుపుకుంది. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లోని 17 అసెంబ్లీ స్థానాలకు గానూ 10 చోట్ల టీఆర్‌ఎస్ విజయం సాధించింది. నగర శివార్లలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలను బీఆర్‌ఎస్ నిలబెట్టుకుంది. అయితే ఇపుడు బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన 10 మంది అభ్యర్థుల రాజకీయ భవిష్యత్తుపై ఊహాగానాలు మొదలయ్యాయి. వీరిలో కొందరు కాంగ్రె్‌సలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారం కోల్పోయిన పార్టీలో కొనసాగాలా? వద్దా? అనేదానిపై ఇప్పటికే కొందరు తర్జనభర్జన పడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఎన్నికల్లో భారీగా ఖర్చుపెట్టినందున వీటిని భర్తీ చేసుకోవాలంటే అధికార పార్టీలో చేరితేనే మనగలుగుతామని భావిస్తున్నట్లు సమాచారం. అలాగే వీరి అనుచరులు కూడా అధికార కాంగ్రె్‌సలో చేరాలని ఒత్తిడి తెస్తున్నారు. దీంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై పార్టీ మారాలంటూ రోజు రోజుకు స్థానిక నేతల నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. వాస్తవానికి శివార్లలో బీఆర్‌ఎస్ నుంచి ఇపుడు గెలిచిన 10 మంది కూడా గతంలో ఇతర పార్టీల నుంచి బీఆర్‌ఎ్‌సలో చేరిన వారే కావడం గమనార్హం. మహేశ్వరం నుంచి విజయం సాధించిన మంత్రి సబితారెడ్డి గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించి తరువాత బీఆర్‌ఎ్‌సలో చేరి మంత్రివర్గంలో చేరారు. అలాగే మేడ్చల్ నుంచి గెలిచిన మంత్రి మల్లారెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో టీడీపీ నుంచి గెలిచి తరువాత అధికార బీఆర్‌ఎ్‌సలో చేరారు. ఇక శేరిలింగంపల్లి నుంచి విజయం సాధించిన ఆరికపూడి గాంధీ, రాజేంద్రనగర్ నుంచి గెలిచిన ప్రకా్‌షగౌడ్, కుత్బుల్లాపూర్ నుంచి విజయం సాధించిన వివేకానందగౌడ్ 2014లో టీడీపీ నుంచి గెలిచి తరువాత అధికార బీఆర్‌ఎ్‌సలో చేరారు. ఇక ఎల్‌బీనగర్ నుంచి విజయం సాధించిన సుధీర్‌రెడ్డి గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసి గెలిచిన తరువాత బీఆర్‌ఎ్‌సలో చేరారు. అలాగే ఉప్పల్ నుంచి బీఆర్‌ఎస్ తరుపున విజయం సాధించిన లక్ష్మారెడ్డి గతంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. మల్కాజిగిరి నుంచి పోటీ చేసి విజయం సాధించిన మంత్రి మల్లారెడ్డి అల్లుడు తొలుత టీడీపీలో పనిచేశారు. ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తే బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన వారిలో ఎంతమంది కారు పార్టీలో ఉంటారు? ఎంతమంది దిగిపోతారు? అనే దానిపై చర్చ జోరుగా నడుస్తోంది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలకు ముందుగానే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవాలని అధికార కాంగ్రెస్ భావిస్తోంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం చూస్తే చేవెళ్ల, మల్కాజిగిరి రెండు పార్లమెంట్ స్థానాల్లో కూడా బీఆర్‌ఎ్‌సదే పైచేయిగా ఉంది. అలాగే బీజేపీ కూడా క్రమంగా బలపడుతున్నట్లు ఓటింగ్ శాతం చూస్తే అర్ధమవుతుంది. దీంతో అధికార కాంగ్రె్‌సలో కలవరం రేకెత్తుతోంది. బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులను గంపగుత్తగా చేర్చుకునేందుకు కసరత్తు చేస్తోంది.
వ్యతిరేకిస్తున్న స్థానిక కాంగ్రెస్ నేతలు
స్థానిక ఎన్నికల ముందు ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు, నేతలు తమ పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తుండడాన్ని స్థానిక కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటి వరకు పార్టీ కోసం కష్టపడిన తమను కాదని బయట నుంచి వచ్చే వారికి స్థానిక ఎన్నికల్లో అవకాశం కల్పిస్తే సహించేది లేదంటున్నారు. వాస్తవానికి అనేక మండలాల్లో కాంగ్రెస్ నేతలంతా అప్పట్లో బీఆర్‌ఎ్‌సలో చేరినా కొందరు పార్టీలోనే ఉన్నారు. వీరంతా స్థానిక ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. తమ పార్టీ చేరికలను మరింత ప్రోత్సహిస్తే తమ పరిస్థితేంటని ఆందోళన చెందుతు న్నారు.
స్థానిక ప్రజాప్రతినిధులు సైతం..
త్వరలో పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో బీఆర్‌ఎస్, ఇతర పార్టీ నేతలు కూడా అధికార కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్‌కు ముందుగానే కాంగ్రె్‌సలో చేరి తమ సీట్లు ఖరారు చేసుకోవాలని భావిస్తున్నారు. కండువాలు మార్చుకునేందుకు ఇప్పటికే వందలాది మంది సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రె్‌సలో చేరేందుకు ఇప్పటికే కొందరు రాయబేరాలు నడుపుతున్నారు.