ఎర్రవల్లిలో ఆత్మీయ సమ్మేళనం రసాభాస
ABN , First Publish Date - 2023-03-30T02:44:19+05:30 IST
సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కుక్ మండలం ఎర్రవల్లిలో బుధవారం నిర్వహించిన బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనం రసాభాసగా ముగిసింది.
ఘర్షణకు దిగిన ఇరు వర్గాల నేతలు, కార్యకర్తలు
జగదేవ్‌పూర్, మార్చి 29: సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కుక్ మండలం ఎర్రవల్లిలో బుధవారం నిర్వహించిన బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనం రసాభాసగా ముగిసింది. హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మడుపు భూంరెడ్డి, ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దేవి రవీందర్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకొని తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తొలుత భూంరెడ్డి మాట్లాడుతుండగా ప్రసంగాన్ని ఆపాలంటూ పలువురు కార్యకర్తలు గొడవ చేశారు. భూంరెడ్డి మాట్లాడితేనే సభ కొనసాగించాలని, లేదంటే సభను నడువనిచ్చేది లేదని ఆయన వర్గీయులు మొండికేశారు. ఇరుపక్షాల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగి కార్యకర్తలు ఒకరినొకరు తోసుకోవడంతో ఎఫ్‌డీసీ చైర్మన్ వంటేరు ప్రతా్‌పరెడ్డి, ఎంపీపీ పాండుగౌడ్, పార్టీ మండలాధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు రాంచందర్‌యాదవ్ సముదాయించే యత్నం చేసినా వినలేదు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఘర్షణకు దిగారు. ఈ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో చివరికి వంటేరు ప్రతా్‌పరెడ్డి కలుగజేసుకొని సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించడంతో కార్యకర్తలు శాంతించారు.
కేసీఆర్ చెప్పుడు మాటలు వింటున్నారు: మడుపు భూంరెడ్డి
అంతకు ముందు సభలో మడుపు భూంరెడ్డి మాట్లాడుతూ.. ‘సీఎం కేసీఆర్ కళ్లు కనిపించడం లేదు.. చెవులు మాత్రమే పని చేస్తున్నాయి.. చెప్పుడు మాటలు వింటున్నారు.. పార్టీ కోసం పని చేసే వారిని పట్టించుకోవడం లేదు.. స్వయంగా ముఖ్యమంత్రే ఇక్కడ ఉన్నాక.. ఇతర నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ, మంత్రుల పెత్తనం ఏమిటి?’’ అని ధ్వజమెత్తారు. ఈ నియోజకవర్గంలో మొదటి నుంచి పని చేసిన ఉద్యమకారులం ఉన్నాం.. మా అందరినీ కాదని ఇతరులకు పెత్తనం ఇవ్వడమేమిటి’ అని పరోక్షంగా మంత్రి హరీశ్‌రావును ఉద్ధేశించి ప్రశ్నించారు.