KCR : దిగొస్తున్న గులాబీబాస్‌!

ABN , First Publish Date - 2023-09-26T02:46:22+05:30 IST

నిన్నమొన్నటి దాకా పార్టీని కనుసైగతో శాసించారు. ఎవరైనా తనకు వ్యతిరేకంగా మాట్లాడితే.. నిర్దాక్షిణ్యంగా పార్టీ నుంచి పంపించేవారు. ఇతరులు ముఖ్యమంత్రిని కలవాలంటే కుదిరేది కాదు.

KCR : దిగొస్తున్న గులాబీబాస్‌!

అసంతృప్త నాయకులకు బీఆర్‌ఎస్‌ అధినాయకత్వం బుజ్జగింపులు

ధిక్కార స్వరాలు వినిపించే వారిపై మౌనం.. చర్యలు తీసుకునేందుకు వెనకడుగు

అడిగిన వెంటనే అపాయింట్‌మెంట్‌.. సర్కారు చివరి దశలో పదవుల పందేరం

క్షేత్ర స్థాయిలో రోజురోజుకూ కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పెరుగుతుండడం వల్లే ఈ మార్పు!

హైదరాబాద్‌, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): నిన్నమొన్నటి దాకా పార్టీని కనుసైగతో శాసించారు. ఎవరైనా తనకు వ్యతిరేకంగా మాట్లాడితే.. నిర్దాక్షిణ్యంగా పార్టీ నుంచి పంపించేవారు. ఇతరులు ముఖ్యమంత్రిని కలవాలంటే కుదిరేది కాదు. తాను కావాలనుకున్నవారు, కలవాలనుకున్న వారికి మాత్రమే ప్రగతి భవన్‌కు ఎంట్రీ ఉండేది. నో అంటే అపాయింట్‌మెంట్‌ కలలో కూడా కష్టమే అయ్యేది. కానీ, ఇప్పుడు పరిస్థితులు అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అది కూడా రాజకీయ పరిస్థితులు పార్టీకి ఇబ్బందిగా మారుతుండటంతో బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం దిగివస్తోంది. అసంతృప్తులను స్వయంగా ప్రగతిభవన్‌కు ఆహ్వానిస్తోంది. వారిని బుజ్జగిస్తూ పదవుల ఎర వేస్తోంది. క్షేత్రస్థాయిలో కాంగ్రె్‌సకు రోజురోజుకూ గ్రాఫ్‌ పెరుగుతుండటం, బీఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ పడిపోతుండటమే ఇందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గులాబీ పార్టీలో అంతర్మథనం మొదలైందని, టికెట్లు ప్రకటించినప్పటి ధీమా ఇప్పుడు పూటపూటకూ సడలుతోందని అంటున్నారు. అయినా పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తప్పులను సరిదిద్దుకునేందుకు పార్టీ పెద్దలు రంగంలోకి దిగుతుండడం, ముఖ్యంగా సీఎం కేసీఆర్‌ తన వైఖరికి విరుద్ధంగా ఒక్కో మెట్టు దిగుతుండడాన్ని ఉదహరిస్తున్నారు. ఇప్పటిదాకా ‘నేను ఇలాగే ఉంటాను.. నా వైఖరితో నష్టపోయిందేమీ లేదు’ అన్న భావనలో ఉన్న సీఎం కేసీఆర్‌.. ఆ వైఖరితో మొదటికే మోసం వస్తుందని గ్రహిస్తున్నారని, ముఖ్యంగా కొందరికి అడిగిన వెంటనే అపాయింట్‌మెంట్‌ ఇచ్చేస్తున్నారని చెబుతున్నారు. గతంలో ఏళ్ల తరబడి ఎదురుచూసినాసీఎం కేసీఆర్‌ దర్శనం కష్టతరమయ్యేది. ప్రజా గాయకుడు గద్దర్‌ లాంటివారే 40 సార్లు ప్రయత్నించినా సీఎంను కలవలేకపోయారు. మోత్కుపల్లి నర్సింహులు లాంటి సీనియర్‌ నేత కూడా ముఖ్యమంత్రిని కలిసేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించినా సాధ్యం కాలేదని తాజాగా వాపోయారు. ఇక 2014లో గెలిచినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రగతి భవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ను ముఖాముఖి కలిసిన ఎమ్మెల్యేలు, ఎంపీలను వేళ్ల మీద లెక్కబెట్టవచ్చని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ప్రగతిభవన్‌ అంటేనే ఓ దుర్గం అని, పార్టీ ఎమ్మెల్యేలు సైతం అక్కడికి వెళ్లలేని రాజకోటగా మారిందని, తమ ముఖ్యమంత్రే తమకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వరని క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు చేసిన ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లిందని ఆ నేత అన్నారు. ఇది కూడా పార్టీకి నష్టం కలిగిస్తోందని అభిప్రాయపడ్డారు. చివరి దశలో దీనిని సరిదిద్దుకునేందుకు పార్టీ పెద్దలు నానా తిప్పలు పడుతున్నారు. ఇప్పుడు అడిగిన వెంటనే అపాయింట్‌మెంట్‌ ఇస్తున్నా.. ఎన్నికల కోసమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అసంతృప్తులకు బుజ్జగింపులు..

మరికొద్ది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ రానుంది. బీఆర్‌ఎస్‌ ఇప్పటికే నాలుగు స్థానాలు మినహా మిగిలిన అన్ని స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించింది. అయితే టికెట్‌ ఆశించి భంగపడ్డ వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారిని మొదట్లో పెద్దగా పట్టించుకోని అధిష్ఠానం.. క్షేత్రస్థాయిలో వారితో జరుగుతున్న నష్టంతో మేల్కొంది. వారికి పదవుల ఆశచూపి బుజ్జగిస్తోంది. జనగాం, స్టేషన్‌ ఘన్‌పూర్‌ సిటింగ్‌ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య విషయంలో ఇదే జరిగింది. అధిష్ఠానం వీరికి టికెట్లు నిరాకరించడంతో.. రాజయ్య ఒక దశలో పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పార్టీ పెద్దలు ఆ ఇరువురిని ప్రగతి భవన్‌కు పిలిపించి బుజ్జగించారు. ఒకరికి రాష్ట్ర రైతుబంధు సమితి చైర్మన్‌ పదవి, మరొకరికి ఆర్టీసీ చైర్మన్‌ పదవి ఇస్తామని ఆశల హామీ ఇచ్చారు. అలాగే ఇతర నియోజకవర్గాల్లో కూడా పార్టీకి తీరని నష్టం కలిగిస్తారనుకున్న వారిని పిలిచి మాట్లాడుతున్నారు. ప్రభుత్వం చివరి దశకు చేరుకున్న సమయంలో.. ఏళ్లుగా భర్తీ చేయని పదవుల పందేరానికి కూడా శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో రెండేళ్లుగా ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు నూతన చైర్మన్‌, సభ్యులను నియమించారు.

ధిక్కార స్వరాలపై మౌనం..

పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించే వారి విషయంలో గతంలో సీఎం కేసీఆర్‌ వైఖరి చాలా కఠినంగా ఉండేది. పార్టీలో ఎక్కడా ధిక్కార స్వరాలు వినిపించేవి కావు. ఒకటీ అరా వినిపించినా.. గంటల వ్యవధిలో ఆ నోళ్లు మూతబడేవి. పార్టీపై, నేతలపై పెద్దలకు అంతలా పట్టుండేది. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. ధిక్కార స్వరాలు వినిపించే వారి జోలికి వెళ్లే సాహసం చేయడం లేదు. ఇంకా చెప్పాలంటే.. అటువంటి నేతలను పదవులిచ్చి మరీ ప్రోత్సహించే సంస్కృతి బీఆర్‌ఎ్‌సలో తొలిసారిగా కనిపిస్తోంది. ఉదాహరణకు.. రంగారెడ్డి జిల్లాకు చెందిన పట్నం మహేందర్‌ రెడ్డి అధిష్ఠానంపై అసంతృప్తితో కాంగ్రె్‌సలో చేరేందుకు సిద్ధం కాగా, ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. ప్రజాబలం ఉన్న నేత కావడం, ఆ జిల్లాపై ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో ఆయనపై వేటుకు బదులు.. మంత్రి పదవి ఇచ్చి చల్లబరిచారు. ఇక మంత్రి హరీశ్‌రావుపై, పార్టీ అధిష్ఠానంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు విషయంలో పార్టీ పెద్దలు మౌనమే వహించారు. చోటా మోటా నేతలే మైనంపల్లిపై స్పందించారు. వాస్తవానికి హన్మంతరావు చేసిన వ్యాఖ్యలు మరే ఇతర నేత చేసినా ఈ పాటికి వేటు పడి ఉండేది. వివిధ రకాల కేసులు కూడా నమోదయ్యేవి. కానీ, మైనంపల్లిపై ఎటువంటి చర్యలూ తీసుకునే సాహసం చేయలేదు. పార్టీ ఎలాగూ చర్య తీసుకునే పరిస్థితి లేకపోవడంతో ఆయనే బీఆర్‌ఎ్‌సకు బైబై చెప్పేశారు.

ముదిరాజ్‌ సామాజికవర్గానికి మొండిచేయి..

రాష్ట్రంలో ముదిరాజ్‌ సామాజికవర్గం చాలా బలమైనది. అటువంటి సామాజిక వర్గానికి ఈసారి ఒక్క టికెట్‌ కూడా కేటాయించకుండా కేసీఆర్‌ మొండిచేయి చూపారు. దీంతో ముదిరాజ్‌ వర్గమంతా ఒక్కసారిగా భగ్గుమంది. బీఆర్‌ఎ్‌సపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సామాజికవర్గ పెద్దలు, కుల సంఘాలు ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహించి.. తమకు టికెట్‌ ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. విషయం మరింత తీవ్రరూపం దాల్చడంతో అధినేత కేసీఆర్‌ దీనిపై దృష్టిసారించారు. వారిని ఎలా బుజ్జగించాలన్న విషయంపై పెద్ద కసరత్తే చేస్తున్నట్లు సమాచారం. చివరికి ఆ సామాజికవర్గాన్ని బుజ్జగించే బాధ్యతను పార్టీలోని ఓ ట్రబుల్‌ షూటర్‌కు అప్పగించారు. మరోవైపు కారు పార్టీకి కాలం కూడా కలసిరావడం లేదు. ఒక్కో అంశం బీఆర్‌ఎ్‌సకు, సీఎం కేసీఆర్‌కు మైనస్‌ అవుతూ వస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు చాలా వేగంగా ప్రజల్లోకి వెళ్లిపోతున్నాయి. మరోవైపు ఉద్యోగులకిచ్చిన పీఆర్సీ, ఐఆర్‌పై ఎటూ తేల్చకపోవడంపై వారంతా బీఆర్‌ఎ్‌సపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. సాధారణ ప్రజానీకం సైతం పదేళ్లు బీఆర్‌ఎ్‌సను చూశామని, మరొకరికి అవకాశమిద్దామన్న అభిప్రాయానికి వచ్చేస్తున్నారు. వీటితో పాటు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు వ్యవహారం కూడా మరో రకంగా బీఆర్‌ఎస్‌ మెడకు మెల్లమెల్లగా చుట్టుకుంటోంది. బాబు అరెస్టుపై కేసీఆర్‌ స్పందించకపోవడాన్ని గతంలో కారుకు ఓటేసిన సగటు టీడీపీ అభిమానులు సైతం తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈసారి వారి ఓట్లు బీఆర్‌ఎ్‌సకు పడటం అనుమానమేనని పార్టీలోని ఓ సీనియర్‌ నేత అన్నారు.

Updated Date - 2023-09-26T02:46:22+05:30 IST