Share News

జీవన్‌రెడ్డికి ఆర్టీసీ షాక్‌

ABN , First Publish Date - 2023-12-08T03:59:44+05:30 IST

బీఆర్‌ఎ్‌సకు చెందిన నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డికి ఆర్టీసీ అధికారులు షాక్‌ ఇచ్చారు.

జీవన్‌రెడ్డికి ఆర్టీసీ షాక్‌

సంస్థ స్థలంలో బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పేరిట మాల్‌

అద్దె 8 కోట్లు.. విద్యుత్తు బిల్లు 2 కోట్లు బకాయి

చెల్లించకుంటే 2 రోజుల్లో స్వాధీనం తప్పదని హెచ్చరిక

ఆర్మూర్‌ టౌన్‌, డిసెంబరు 7: బీఆర్‌ఎ్‌సకు చెందిన నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డికి ఆర్టీసీ అధికారులు షాక్‌ ఇచ్చారు. ఆర్మూర్‌లోని డిపో వద్ద ఉన్న జీవన్‌రెడ్డి మాల్‌ అండ్‌ మల్టీప్లెక్స్‌కు ఆర్టీసీ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు గురువారం నోటీసులు జారీ చేశారు. ఈ మాల్‌.. ఆర్టీసీకి రూ.7 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు బకాయి పడింది. పదేళ్ల క్రితం ఆర్మూర్‌కు చెందిన కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు విష్ణుజీత్‌ ఇన్‌ఫ్రా డెవలపర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌గా ఏర్పడి ఆర్టీసీ స్థలాన్ని 33 ఏళ్ల పాటు లీజుకు తీసుకున్నారు. అనంతర పరిణామాల్లో.. మాల్‌ అదే లీజు ఒప్పందంతో బీఆర్‌ఎ్‌సకు చెందిన ఆర్మూర్‌ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సతీమణి రజితారెడ్డి (మేనేజింగ్‌ డైరెక్టర్‌) పేరు మీదకు మారింది. నిర్మాణం పూర్తయి దాదాపు రెండేళ్లు గడుస్తోంది. భారీగా బకాయిలు పేరుకున్న నేపథ్యంలో ఆర్టీసీ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు, సిబ్బంది గురువారం జీవన్‌రెడ్డి మాల్‌ను సీజ్‌ చేస్తామంటూ నోటీసులిచ్చారు. 15 రోజుల క్రితమే నోటీసులు జారీ చేసినా బకాయిలు చెల్లించలేదని తెలిపారు. రెండు, మూడు రోజుల్లో చెల్లించకుంటే.. జీవన్‌రెడ్డి మాల్‌ను స్వాధీనం చేసుకుంటామని, కిరాయిదారులు జాగ్రత్తపడాలని సూచించారు. మరోవైపు జీవన్‌రెడ్డి మాల్‌, మల్టీప్లెక్స్‌కు రూ.2 కోట్ల వరకు విద్యుత్తు బకాయిలు ఉండడంతో ట్రాన్స్‌కో సిబ్బంది గురువారం సాయంత్రం విద్యుత్తు సరఫరా నిలిపివేశారు.

Updated Date - 2023-12-08T03:59:45+05:30 IST