Sarath Chandra Reddy: అప్రూవర్‌గా శరత్ చంద్రారెడ్డి!?
ABN , First Publish Date - 2023-05-30T03:11:53+05:30 IST
ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుడు, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రా రెడ్డి అప్రూవర్‌గా మారనున్నారా!? అందుకే, కేంద్ర ప్రభుత్వం ఆయనకు వై కేటగిరీ భద్రత కల్పించనుందా!? ఈ మేరకు హోం శాఖ ఆదేశాలు జారీ చేసిందా!? ఈ పరిణామంతో, సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత పేరు ఢిల్లీ మద్యం స్కాంలో మరోసారి తెరపైకి రానుందా!?
ఆయనకు వై కేటగిరీ భద్రత.. హోం శాఖ ఆదేశాలు
ఇప్పటికే అప్రూవర్‌గా కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు
మరోసారి తెరపైకి కవిత పేరు వచ్చే అవకాశం
ఢిల్లీ మద్యం స్కాంలో ఆమె పాత్రను శరత్ వెల్లడించే చాన్స్
అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ భేటీ తర్వాత కీలక పరిణామం
ఢిల్లీ మద్యం కుంభకోణంలో పావులు కదుపుతున్న కేంద్రం
న్యూఢిల్లీ, మే 29 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుడు, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రా రెడ్డి అప్రూవర్‌గా మారనున్నారా!? అందుకే, కేంద్ర ప్రభుత్వం ఆయనకు వై కేటగిరీ భద్రత కల్పించనుందా!? ఈ మేరకు హోం శాఖ ఆదేశాలు జారీ చేసిందా!? ఈ పరిణామంతో, సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత పేరు ఢిల్లీ మద్యం స్కాంలో మరోసారి తెరపైకి రానుందా!? ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. ఏపీ సీఎం జగన్ ఆదివారం రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారి మధ్య ఢిల్లీ మద్యం స్కాం అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే, స్కాంలో నిందితుడైన శరత్ చంద్రా రెడ్డి అప్రూవర్‌గా మారనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆయనకు వై కేటగిరీ భద్రతను కల్పించాలని హోం శాఖ ఆదేశించినట్లు వివరించాయి. ఆయన అప్రూవర్‌గా మారి కుంభకోణంలో కవిత పాత్రను వెల్లడించే అవకాశాలున్నాయని ఆ వ ర్గాలు చెప్పాయి. ఢిల్లీ మద్యం వ్యాపారంలో సౌత్ గ్రూప్ తరఫున పాల్గొన్న వారిలో కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ రెడ్డి, వ్యాపారస్తుడు అరుణ్ రామచంద్ర పిళ్లై, కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు గోరంట్ల, శరత్ చంద్రారెడ్డి ఉన్న విషయం తెలిసిందే.
కవిత ప్రేరణతోనే తాను మద్యం వ్యాపారంలో పాల్గొన్నానని శరత్ చంద్రా రెడ్డి చెప్పే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే గోరంట్ల బుచ్చిబాబు అప్రూవర్‌గా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు శరత్ చంద్రా రెడ్డి కూడా అప్రూవర్‌గా మారితే కవిత పేరు మరోసారి తెరపైకి వచ్చే అవకాశం ఉంది. నిజానికి, స్కాంలో కవిత లావాదేవీల సమాచారం ఉన్నా కేంద్రం తగిన చర్యలు తీసుకోవడం లేదని రాష్ట్ర బీజేపీ నేతలు పలువురు ఢిల్లీ పెద్దలకు అనేక సార్లు చెప్పారు. కేసీఆర్ కుటుంబాన్ని కేసుల వలయంలో ఇరికిస్తే తప్ప బీఆర్‌ఎస్ బలహీనం కాదని, బీజేపీకి అవకాశాలు దక్కవని చెబుతూ వచ్చారు. ఢిల్లీలో బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య ఏదో అవగాహన ఉందనే ప్రచారం జరుగుతోందని, కాంగ్రెస్ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మడం మొదలు పెట్టారని, కవిత అరెస్టు అయితేనే బీజేపీపై నమ్మకం పెరుగుతుందని ఇటీవల బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.