Share News

BJP Kishan Reddy : ఎస్సీ వర్గీకరణ వేగిరానికే కమిటీ

ABN , First Publish Date - 2023-11-14T03:09:21+05:30 IST

ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

BJP Kishan Reddy : ఎస్సీ వర్గీకరణ వేగిరానికే కమిటీ

రోజువారీ ప్రక్రియ పర్యవేక్షణ దాని బాధ్యత

వర్గీకరణకు కేంద్ర ప్రభుత్వం సానుకూలం

ఏడుగురు న్యాయమూర్తులతో

ధర్మాసనం ఏర్పాటుకు అంగీకారం

కమిటీపై కొందరిది తప్పుడు ప్రచారం: కిషన్‌రెడ్డి

17న అమిత్‌ షా పర్యటన?

హైదరాబాద్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత వచ్చే అంశాన్ని పరుగెత్తించడం, ఆ దిశగా రోజువారీ ప్రక్రియను పర్యవేక్షించడం ఈ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ లక్ష్యం అని వివరించారు. ఎస్సీ వర్గీకరణకు కేంద్రం సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు. సోమవారం బీజేపీ మీడియా సెంటర్‌లో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ప్రధాని మోదీ, గత జూలై 8న వరంగల్‌ పర్యటించిన సందర్భంగా ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ, ఆయన దృష్టికి వర్గీకరణ అంశాన్ని తీసుకెళ్లారని కిషన్‌ రెడ్డి చెప్పారు. అనంతరం ప్రధాని సూచన మేరకు, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అఽధ్యక్షుడు జేపీ నడ్డా కలిసి వర్గీకరణ అంశంమ్మీద ఎమ్మార్పీఎస్‌ నేతలు, మేధావులతో అక్టోబరు 2న సమావేశమయ్యారని చెప్పారు. ఆ తర్వాతే వర్గీకరణ సమస్య పరిష్కారంపై ఏడుగురు జడ్జీలతో ధర్మాసనం ఏర్పాటు చేయాలని సొలిసిటర్‌ జనరల్‌, తుషార్‌ మెహతా సుప్రీం ప్రధాన న్యాయమూర్తిని కోరారని, ఇందుకు అనుగుణంగా ధర్మాసనం ఏర్పాటుకు అంగీకరించారని చెప్పారు.

ఎస్సీ వర్గీకరణకు కేంద్రం సానుకూలంగా ఉందని, ఇది న్యాయమైన, ధర్మమైన అంశం అని సుప్రీంకోర్టులో చెప్పనున్నట్లు పేర్కొన్నారు. వర్గీకరణ అన్నది మూడు దశాబ్దాలుగా జరుగుతున్న శాంతియుత పోరాటమని, వర్గీకరణ ఆలస్యానికి కాంగ్రెస్‌ పార్టే మొదటి ముద్దాయి అని విమర్శించారు. 2004లో యూపీ యే అధికారంలోకి రాగానే ఈ అంశాన్ని అటకెక్కించిందని, కమిటీల పేరుతో కోల్డ్‌స్టోరేజీలో ఉంచారన్నారని విమర్శించారు. దళితుడిని సీఎం చేస్తామని ప్రకటించి, వారికి వెన్నుపోటు పొడిచిన చరిత్ర సీఎం కేసీఆర్‌ది, బీఆర్‌ఎస్‌ పార్టీది అని విమర్శించారు. కేసీఆర్‌ తర్వాత, బీఆర్‌ఎస్‌ పార్టీకి ఆయన కుమారుడు కేటీఆర్‌, ఆ తర్వాత కేటీఆర్‌ కుమారుడు పార్టీకి అధ్యక్షుడు అవుతారని, అదో కుటుంబ పార్టీ అని విమర్శించారు.

17న అమిత్‌ షా పర్యటన..?

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఈనెల 17న రాష్ట్ర పర్యటనకు వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఆయన, పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి. అమిత్‌ షా 17న వస్తారా? లేక మరోరోజు వస్తారా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదని పేర్కొన్నాయి. ఆయన పర్యటన ఖరారయితే, నల్గొండ, గద్వాల, వరంగల్‌, రాజేంద్రనగర్‌ నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగసభలకు హాజరవుతారు. ఒకవేళ అమిత్‌షాకు వీలుకాకపోతే, పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా చేతుల మీదుగా మేనిఫెస్టో విడుదల చేయించాలని పార్టీ ముఖ్యనేతలు భావిస్తున్నారు.

Updated Date - 2023-11-14T03:10:10+05:30 IST