Share News

PM modi : రాష్ట్ర బీజేపీలో శల్య సారథ్యం

ABN , Publish Date - Dec 28 , 2023 | 03:14 AM

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఓడించడం ద్వారా ప్రధాని నరేంద్రమోదీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు సొంతపార్టీలోని ఇద్దరు ముగ్గురు సీనియర్‌ నేతలు కుట్ర పన్నారని..

PM modi : రాష్ట్ర బీజేపీలో శల్య సారథ్యం

తెలంగాణలోని ఇద్దరు-ముగ్గురు నేతలపై పార్టీ అధిష్ఠానానికి ముఖ్యనేతల ఫిర్యాదు

లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను

ఓడించి మోదీ ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్ర

అభ్యర్థులపై తప్పుడు ప్రచారం చేయడం

ద్వారా కేడర్‌లో గందరగోళానికి యత్నం

ఇతర పార్టీలతో చేతులు కలుపుతున్న వైనం

ఫిర్యాదులపై స్పందించిన బీజేపీ అధిష్ఠానం

శల్య సారథ్యాలపై ఢిల్లీ పెద్దల సీరియస్‌

జహీరాబాద్‌ లేదా మెదక్‌ నుంచి లక్ష్మణ్‌ పోటీ?

హైదరాబాద్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఓడించడం ద్వారా ప్రధాని నరేంద్రమోదీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు సొంతపార్టీలోని ఇద్దరు ముగ్గురు సీనియర్‌ నేతలు కుట్ర పన్నారని.. కొంతమంది ముఖ్యనేతలు బీజేపీ అధినాయకత్వం దృష్టికి తీసుకువెళ్లారు. సదరు సీనియర్‌ నేతలు పైకి పార్టీకోసం పనిచేస్తున్నట్లుగా కనిపిస్తూ.. అంతర్గతంగా ఇతర పార్టీల ముఖ్యనేతలతో చేతులు కలుపుతున్నారని, పార్టీలో సభ్యత్వమే లేనివారు సైతం ఆ నాయకుల అండతో తామే బీజేపీ అభ్యర్థులమంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారనే విషయమై తప్పుడు ప్రచారం చేస్తూ పార్టీ కేడర్‌లో తీవ్ర గందరగోళం సృష్టిస్తున్నారని.. ఇది పార్టీ విజయావకాశాలను దెబ్బతీయడమే అవుతుందని ఆవేదన వెలిబుచ్చారు. ఈ తప్పుడు ప్రచారాలకు కళ్లెం వేయకుంటే పార్టీ అభ్యర్థులకు ఇబ్బందికర పరిస్థితి తప్పదని అధిష్ఠానం వద్ద స్పష్టం చేశారు.

దీంతో ఈ అంశాన్ని పార్టీ అధినాయకత్వం సీరియ్‌సగా తీసుకుంది. అభ్యర్థుల ఖరారుపై తప్పుడు ప్రచారం చేసినవారి పేర్లను.. అలా ప్రచారం చేయించుకున్నవారి పేర్లను అసలు పరిగణనలోకి తీసుకోబోమని పార్టీ ముఖ్య నేతలకు హామీ ఇచ్చింది. పార్టీ సభ్యత్వమే లేనివాళ్లు తాము బీజేపీ నుంచి పోటీచేస్తున్నామంటూ ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని.. దేశంలో ఎక్కడా ఇలాంటి విచిత్ర పరిస్థితి లేదని బీజేపీ అగ్రనేత ఒకరు రాష్ట్రపార్టీ ముఖ్యుల వద్ద విస్మయం వ్యక్తంచేసినట్టు సమాచారం. ‘‘మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇలాంటి గందరగోళమే సృష్టించారు. ఇప్పుడు మరోసారి అలాంటి ప్రయత్నం చేస్తుంటే మేం చూస్తూ ఊరుకోవాలా? మీరే అభ్యర్థులను నిర్ణయిస్తే ఇక మేమెందుకు?’’ అని.. ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్‌ నేతలను పార్టీ జాతీయ అగ్రనేత ఒకరు నిలదీసినట్లు సమాచారం. మరోవైపు, బీజేపీలో టిక్కెట్టు రాకపోతే కాంగ్రె్‌సలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్న కొందరు నేతలు కూడా పార్టీని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నట్టు పార్టీ ముఖ్యనేత అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు.

జహీరాబాద్‌ లేదా మెదక్‌ నుంచి లక్ష్మణ్‌ పోటీ?

బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయనున్నట్లు పార్టీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో లోక్‌సభ సభ్యులను బరిలోకి దింపిన పార్టీ.. సార్వత్రిక ఎన్నికల్లో రాజ్యసభ సభ్యులందరినీ బరిలోకి దింపాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా లక్ష్మణ్‌ను జహీరాబాద్‌ లేదా మెదక్‌ నుంచి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీవర్గాలు తెలిపాయి. ఒకవేళ లక్ష్మణ్‌ పోటీ చేయకపోతే జహీరాబాద్‌ నుంచి అధికార ప్రతినిధి రచనారెడ్డి, శాస్త్రవేత్త ఎల్లారెడ్డితో పాటు మేడపాటి ప్రకాశ్‌రెడ్డి, సుభా్‌షరెడ్డి, ఆలె భాస్కర్‌లలో ఒకరికి టిక్కెట్టు దక్కే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. అవసరమైతే, ఎమ్మెల్యే రాజాసింగ్‌ను బరిలోకి దింపినా ఆశ్చర్యపోనక్కర్లేదని వారు వివరించారు. కాగా.. ముగ్గురు సిటింగ్‌ ఎంపీలకు ఇప్పటికే లోక్‌సభ టిక్కెట్లు ఖరారైనట్లు సమాచారం. కేంద్రమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి-సికింద్రాబాద్‌ నుంచి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ కరీంనగర్‌ నుంచి.. ధర్మపురి అర్వింద్‌ నిజామాబాద్‌ నుంచి మరోసారి పోటీ చేయడం దాదాపు ఖాయమని బీజేపీ ముఖ్యనేత ఒకరు వెల్లడించారు. ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావుకు టికెట్‌ అంశం ఇంకా పెండింగ్‌లో ఉందని ఆయన తెలిపారు.

Updated Date - Dec 28 , 2023 | 03:14 AM