America FIRE Shooting :అమెరికాలో కాల్పుల బీభత్సం.. తెలుగు గుండెపై తూటా

ABN , First Publish Date - 2023-01-24T04:31:01+05:30 IST

అమెరికాలో దోపిడీ దొంగలు తెలుగు విద్యార్థులపై జరిపిన కాల్పుల్లో ఒకరు మృతిచెందగా.. మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. వీరితో ఉన్న ఇంకో తెలుగు విద్యార్థి కాల్పుల ఘటన నుంచి క్షేమంగా బయటపడ్డారు.

America FIRE Shooting :అమెరికాలో కాల్పుల బీభత్సం.. తెలుగు గుండెపై తూటా

షికాగోలో దోపిడీ దొంగల కాల్పులు

బెజవాడ విద్యార్థి దేవాశిష్‌ దుర్మరణం

సంగారెడ్డి వాసి సాయిచరణ్‌కు గాయాలు

ఇద్దరూ ప్రభుత్వ వర్సిటీ విద్యార్థులే

ఘటనా స్థలిలో వైజాగ్‌ విద్యార్థీ.. క్షేమం

వారాంతంలో షికాగోలో వేర్వేరు చోట్ల

33 మందిపై దాడి.. 8 మంది మృతి

వాషింగ్టన్‌/రామచంద్రాపురం, జనవరి 23: అమెరికాలో దోపిడీ దొంగలు తెలుగు విద్యార్థులపై జరిపిన కాల్పుల్లో ఒకరు మృతిచెందగా.. మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. వీరితో ఉన్న ఇంకో తెలుగు విద్యార్థి కాల్పుల ఘటన నుంచి క్షేమంగా బయటపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన నందెపు దేవాశిష్‌(23) హైదరాబాద్‌లో ఉంటూ పైచదువుల కోసం అమెరికా వెళ్లారు. తెలంగాణలోని సంగారెడ్డి రామచంద్రాపురం పట్టణం, ఎల్‌ఐజీకి చెందిన కొప్పాల సాయిచరణ్‌(22) కూడా ఈ నెల 11న అమెరికాలో ఎంఎస్‌ చేసేందుకు వెళ్లారు. వీరిద్దరూ షికాగోలోని గవర్నర్‌ స్టేట్‌ యూనివర్సిటీలో చదువుతున్నారు. వీరిద్దరూ లక్ష్మణ్‌ అనే మరో స్నేహితుడితో కలిసి.. ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌కు అవసరమైన రూటర్‌ కోసం వాల్‌మార్ట్‌కు బస్సులో బయల్దేరారు. ఆ సమయంలోనే ఒక నల్లజాతి వ్యక్తి వారిని అనుసరించాడు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం ఆదివారం సాయంత్రం 6.55 గంటలకు వాల్‌మార్ట్‌ బస్టాప్‌ వద్ద బస్సు దిగి నడుచుకుంటూ వెళ్తుంటే మరో నలుగురు నల్లజాతివారు కారులో ఈ ముగ్గురి వద్దకు వచ్చారు. వారిని ఆపి తుపాకీతో బెదిరించి సెల్‌ఫోన్లు ఇవ్వాలని అడిగారు. వెంటనే వీరు తమ ఫోన్లు నేల మీద పెట్టేశారు. ఆ సమయంలో సాయిచరణ్‌.. ‘మీకు ఫోన్లు ఎందుకు.. మా దగ్గర డబ్బు ఉంది, కావాలంటే తీసుకోండి’ అని చెప్పాడు.

అయితే, ఆ సమయంలో ముగ్గురు విద్యార్థుల్లో ఒకరు వారి చేతుల్లో ఉన్నవి ‘టాయ్‌గన్స్‌ (బొమ్మ తుపాకులు)’ అనడంతో ఆ దుండగులు వీరిపై కాల్పులు జరిపినట్టు సమాచారం. ఆ కాల్పుల్లో ఒక తూటా సాయిచరణ్‌ పొట్ట భాగంలోకి దూసుకుపోగా.. మరో తూటా దేవాశిష్‌ కుడిభుజం కింది భాగంలోకి దూసుకుపోయింది. తూటా గాయం తగలగానే సాయిచరణ్‌ నోట్లోంచి రక్తం రావడం మొదలైంది. దేవాశిష్‌ మాత్రం బాగానే ఉన్నాడు. కాల్పులు జరగగానే దేవాశిష్‌, లక్ష్మణ్‌ ఇద్దరూ 911కు కాల్‌ చేయగా పోలీసులు అంబులెన్స్‌తో సహా వచ్చి వారిని తీసుకుని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే సాయిచరణ్‌ గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. కానీ.. సీపీఆర్‌ చేయడంతో అతడు బతికి బయటపడ్డాడు. ఊపిరితిత్తులకు ఎడమవైపు తూటా గాయమైన అతడికి వైద్యులు శస్త్రచికిత్స చేసి బుల్లెట్‌ను బయటకు తీశారు. అతడి పరిస్థితి విషమించినప్పటికీ చికిత్సతో కోలుకుంటున్నట్టు సమాచారం. మరోవైపు.. పెద్దగా ప్రమాదం లేదని భావించిన దేవాశిష్‌ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ఈ విషయం తెలియగానే షికాగోలో ఉంటున్న దేవాశిష్‌ సోదరి ఆస్పత్రికి చేరుకున్నట్లు సమాచారం. సాయిచరణ్‌ స్నేహితులు సంగారెడ్డిలోని అతని తల్లిదండ్రులు కొప్పాల శ్రీనివా్‌సరావు, లక్ష్మికి ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. కాగా.. తెలుగు యువకులపై కాల్పులు జరిగిన విషయం తెలియగానే తానా ప్రతినిధి హేమ కానూరి ఆస్పత్రికి వెళ్లి అక్కడున్న పోలీసులతో, వైద్యులతో మాట్లాడుతూ యువకుల కుటుంబాలతో సమన్వయం చేస్తున్నారు. కాగా.. ప్రాథమిక సమాచారం ఆధారంగా పోలీసులు నిందితుల కారును ట్రేస్‌ చేయగా.. అది దొంగిలించిన కారు అని తేలింది. జరిగిన ఘటన, నిందితుల ఆనవాళ్లు తదితర అంశాలపై పోలీసులు లక్ష్మణ్‌ను ప్రశ్నించి, వదిలిపెట్టారు.

మరో చోటా కాల్పులు..

ఈ ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలోనే.. అర్ధరాత్రి 2 గంటలకు ఇద్దరు నల్లజాతి వ్యక్తులు యూనివర్సిటీ పార్క్‌కు చెందిన జోర్డాన్‌ నిక్సన్‌(17), అతని స్నేహితుడిపై(18) కాల్పులు జరిపారు. ఈ ఘటనలో జోర్డాన్‌ అక్కడికక్కడే మరణించాడు. దుండగులిద్దరూ తక్కువ ధరకే స్నీకర్స్‌ (కాలిజోళ్లు) విక్రయిస్తామంటూ ఆన్‌లైన్‌లో వీరిని సంప్రదించినట్లు తెలిసింది. వాటిని కొనేందుకు వెళ్లిన సమయంలో జోర్డాన్‌, అతని స్నేహితుడి వద్ద ఉన్న నగదును దోచుకుని, కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. శని, ఆదివారాల్లో షికాగోలో వేర్వేరు చోట్ల 33 మందిపై కాల్పులు జరిగాయని, వారిలో 8 మంది మృతిచెందారని వెల్లడించారు. కాగా.. చైనా లూనార్‌ కొత్త సంవత్సరం సందర్భంగా లాస్‌ ఏంజెలి్‌సలో జరిగిన కాల్పుల్లో 10 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ దారుణానికి 72 ఏళ్ల వయసున్న చైనా జాతీయుడు హూకాన్‌ట్రాన్‌ బాధ్యుడు అని పోలీసులు గుర్తించారు. కాల్పులు జరిపాక, అతను తనను తాను కాల్చుకున్నట్లు తెలిపారు.

Updated Date - 2023-01-24T04:31:02+05:30 IST