స్పీకర్ ప్రసాద్‌కుమార్
ABN , Publish Date - Dec 14 , 2023 | 03:38 AM
తెలంగాణ శాసనసభకు తొలిసారి దళిత నేత సభాపతి కానున్నారు. మాజీ మంత్రి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్ ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది.
శాసన సభాపతిగా తొలిసారి దళిత నేత
ఎన్నిక ఏకగ్రీవం!... నేడు బాధ్యతల స్వీకరణ
అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించిన అధికార, విపక్షాలు
నామినేషన్ దాఖలులో పాల్గొన్న సీఎం, మంత్రులు
ఎంపీటీసీ నుంచి శాసనసభ అధిపతి వరకు..
గడ్డం ప్రసాద్‌కుమార్ 21 ఏళ్ల రాజకీయ ప్రస్థానం
సీఎం, స్పీకర్ ఇద్దరూ వికారాబాద్ జిల్లా నుంచే
హైదరాబాద్, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ శాసనసభకు తొలిసారి దళిత నేత సభాపతి కానున్నారు. మాజీ మంత్రి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్ ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. వాస్తవానికి అధికార పక్షం నిర్ణయించిన స్పీకర్ అభ్యర్థే ఏకగ్రీవంగా ఎన్నికవడం సంప్రదాయంగా వస్తోంది. దాన్ని అనుసరించి ప్రతిపక్ష బీఆర్‌ఎస్, మజ్లిస్, సీపీఐ ప్రసాద్ కుమార్‌కు మద్దతు ప్రకటించాయి. అధికార కాంగ్రెస్ పార్టీ స్పీకర్ అభ్యర్థిగా ప్రసాద్ కుమార్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుసేన్, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించారు. వారి సమక్షంలోనే ప్రసాద్ కుమార్ తన నామినేషన్‌ను అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
గడువు ముగిసే సమయానికి (సాయంత్రం 5 గంటలు) ప్రసాద్‌కుమార్ నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో ఆయన ఏకగ్రీవ ఎన్నిక ఖరారైంది. షెడ్యూల్ ప్రకారం ఎన్నిక గురువారం కావడంతో అదే రోజున ప్రసాద్ కుమార్ ఎన్నికను లాంఛనంగా ప్రకటించనున్నారు. సీఎం హోదాలో సీఎల్పీ కార్యాలయానికి వచ్చిన రేవంత్... ప్రసాద్ కుమార్‌కు శాలువా కప్పి సత్కరించారు. అక్కడి నుంచి సీఎల్పీ కార్యాలయం ప్రధాన ద్వారం వద్దకు రేవంత్, భట్టి, శ్రీధర్‌బాబు, రాజనర్సింహ తదితరులు చేరుకున్నారు. కేటీఆర్, కూనంనేని వారికి జత కలవగా... అందరూ కలిసి అసెంబ్లీ కార్యదర్శి ఛాంబర్‌కు వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ తొలి స్పీకర్ బీసీ సామాజిక వర్గానికి చెందిన మధుసూధనాచారి కాగా.. మలి స్పీకర్‌గా పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యవహరించారు. ఉమ్మడి రాష్ట్రంలో దళిత సామాజిక వర్గం నుంచి ప్రతిభా భారతి (1999-2004) ఒక్కరే స్పీకర్‌గా వ్యవహరించారు. ఇన్నేళ్ల తర్వాత దళిత సామాజిక వర్గానికి స్పీకర్ పదవి దక్కింది.
సీఎంకు గుత్తా సత్కారం
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి బుధవారం సీఎం రేవంత్‌రెడ్డికి శాలువా కప్పి సత్కరించారు. మండలి సందర్శనకు వచ్చిన రేవంత్‌ను గుత్తా తన ఛాంబర్‌కు ఆహ్వానించారు. రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, సీతక్క, కొండా సురేఖకు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.