ఎంబీబీఎస్‌, బీడీఎస్‌లో స్పోర్ట్స్‌ కోటా

ABN , First Publish Date - 2023-01-05T01:00:36+05:30 IST

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో స్పోర్ట్స్‌ కోటా అమలు చేయాలని రాష్ట్రప్రభుత్వానికి, కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీకి హైకోర్టు

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌లో స్పోర్ట్స్‌ కోటా

హైదరాబాద్‌, జనవరి 4(ఆంధ్రజ్యోతి): ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో స్పోర్ట్స్‌ కోటా అమలు చేయాలని రాష్ట్రప్రభుత్వానికి, కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీకి హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీచేసింది. ఈ కోర్సుల్లో స్పోర్ట్స్‌ కోటాను ఎత్తేస్తూ 2020లో జీవో నెంబర్‌ 2ను రాష్ట్రప్రభుత్వం జారీచేసింది. స్టాట్యుటరీ రూల్స్‌ మార్చకుండా ప్రభుత్వం జీవో జారీచేయడం చెల్లదని పేర్కొంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ అభినందన్‌కుమార్‌ షావిలి, జస్టిస్‌ పీ. కార్తీక్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున ధర్మేష్‌ డీకే జైస్వాల్‌ వాదనలు వినిపించారు. 2017లో రాష్ట్రప్రభుత్వం జీవో నెంబర్‌ 114 ద్వారా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన చట్టబద్ధమైన నిబంధనలను రూపొందించిందని, అందులో స్పోర్ట్స్‌ కోటా అభ్యర్థులకు 0.5 శాతం రిజర్వేషన్‌ ఉందని తెలిపారు. సదరు రూల్స్‌ను మార్చకుండా ప్రభుత్వం 2020లో స్పోర్ట్స్‌ కోటాను ఎత్తేసిందని పేర్కొన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. జీవో నెంబర్‌ 2లో స్పోర్ట్స్‌ కోటాను ఎత్తేయడానికి సంబంధించిన ఆదేశాలను కొట్టేసింది. పిటిషనర్‌లు స్పోర్ట్స్‌ కోటాలో తమకు సీట్లు కేటాయించాలని కోరుతూ రెండు వారాల్లో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలని ధర్మాసనం పేర్కొంది.

Updated Date - 2023-01-05T01:00:38+05:30 IST