విద్యార్థిని కల్లు కాంపౌండ్‌కు తీసుకెళ్లిన టీచర్.. బంధువులు చూడడంతో చివరకు..
ABN , First Publish Date - 2023-01-20T20:51:53+05:30 IST
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి.. ప్రయోజకులను చేయాల్సిన పవిత్రమైన వృత్తిలో ఉన్న ఆ ఉపాధ్యాయుడు (Teacher) బాధ్యత మరిచాడు.
పాల్వంచ: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి.. ప్రయోజకులను చేయాల్సిన పవిత్రమైన వృత్తిలో ఉన్న ఆ ఉపాధ్యాయుడు (Teacher) బాధ్యత మరిచాడు. విలువలకు తిలోదకాలిచ్చి.. బడి సమయంలో బయట తిరగడమే కాకుండా.. కల్లు తాగేందుకు వెళ్లాడు. అంతేకాదు తనకు సహాయకుడిగా ఓ విద్యార్థిని వెంటతీసుకెళ్లాడు. భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా పాల్వంచలో శుక్రవారం జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. పాల్వంచ పట్టణం (PalwanchaTown) పేటచెరువు గ్రామంలో మండలపరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 48మంది విద్యార్థులు చదువుతున్నారు. రోజూలాగానే ఉదయం 9 గంటలకు పాఠశాల ప్రారంభమై యథావిధిగా తరగతులు కొనసాగుతున్నాయి. వెంకటరమణ అనే ఉపాధ్యాయుడు తనతో పాటు ఆరోతరగతి చదువుతున్న ఓ విద్యార్థిని కల్లు కాంపౌండ్‌కు తీసుకెళ్లాడు. కల్లు తాగి మరో బాటిల్ కల్లు తీసుకొని స్నూల్‌కు వస్తుండగా విద్యార్థి బంధువులకు కనబడ్డారు.
పాఠశాల సమయంలో తమ పిల్లాడిని తీసుకొచ్చి ఇక్కడేం చేస్తున్నారని ప్రశ్నించగా.. ఉపాధ్యాయుడు వెంకటరమణ వారిపై వాదనకు దిగడంతో పాటు దుర్భాషలాడాడు. దీంతో విద్యార్ధి బంధువులు పాఠశాల వద్దకు వచ్చి ఉపాధ్యాయుడిని, ప్రధానోపాధ్యాయుడిని నిలదీశారు. పాఠశాలలో ఉండాల్సిన విద్యార్థిని కల్లు కాంపౌండ్‌కు ఎందుకు తీసుకెళ్లాడని, పిల్లలకు పాఠాలు చెప్పి ప్రయోజకనులను చేయాల్సిన ఉపాధ్యాయులే ఇలాంటి పనులు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో విద్యార్థి బంధువులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఆంధ్రజ్యోతి ప్రతినిధి ఉపాధ్యాయుడిని వివరణ అడగ్గా.. తన సహచరుడికి కల్లు తెచ్చేందుకు కల్లు కాంపౌండ్‌కు వెళ్లానని, తనతోపాటు విద్యార్థిని తీసుకువెళ్లడం తప్పేనని ఒప్పుకున్నాడు. కానీ విద్యార్థి బంధువులు తనను దుర్భాషలాడటంతోనే తానూ వారితో వాదనకు దిగాల్సి వచ్చిందని వెంకటరమణ వివరణ ఇచ్చాడు.