కంటోన్మెంట్‌కు మంచిరోజులు!
ABN , First Publish Date - 2023-01-06T03:37:48+05:30 IST
కేంద్ర ప్రభుత్వం కంటోన్మెంట్ వాసులకు శుభవార్త చెప్పింది.
జీహెచ్‌ఎంసీలో విలీనానికి కేంద్రం ప్రతిపాదన..
ప్రత్యేక కమిటీని నియమించిన కేంద్ర ప్రభుత్వం
సికింద్రాబాద్ కంటోన్మెంట్..! దేశంలోని 62 కంటోన్మెంట్లలో అతి పెద్దది. నగరానికి సమీపంలోనే ఉన్నా.. ఏళ్లుగా వనరుల లేమి, సమస్యలతో సతమతమవుతున్న ప్రాంతం. స్థలం ఉన్నా.. ఇళ్ల నిర్మాణానికి, ఎత్తుపై పరిమితులు..! హైటెక్ సిటీ అని చెప్పుకొంటున్నా.. ఆంక్షలు, పరిమితులతో వెనుకబాటు. గాఫ్ రోడ్లలో ఆంక్షలు, మూసివేతలు..! ఈ పరిస్థితి ఇక దూరం కానుంది. జీహెచ్‌ఎంసీలో కంటోన్మెంట్ విలీనానికి ముందడుగు పడింది.
సికింద్రాబాద్, జనవరి 5(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం కంటోన్మెంట్ వాసులకు శుభవార్త చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ)లో కంటోన్మెంట్ విలీనం కోసం ఎనిమిది మంది ఉన్నతాధికారులతో కమిటీని నియమించింది. అందుకు అనుగుణంగానే కంటోన్మెంట్‌ను జీహెచ్‌ఎంసీలో కలుపుకొనేందుకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ పది రోజుల ముందే రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కేంద్ర కమిటీలో తెలంగాణ రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి కూడా ఉన్నారు. ఈ కమిటీ నెలరోజుల్లో కేంద్రానికి నివేదికను సమర్పిస్తుంది. ఆ తర్వాత.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ సహా.. దేశంలోని ఐదు కంటోన్మెంట్లు సమీప పట్టణ/నగరపాలక సంస్థల్లో విలీనమయ్యే ప్రక్రియ మొదలవుతుంది.
ఇదీ చరిత్ర..
నిజాం ప్రభుత్వం అప్పట్లో ఈ ప్రాంతాన్ని బ్రిటిషర్లకు అప్పగించింది. బ్రిటీష్ సర్కారు.. ఇక్కడ సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం సికింద్రాబాద్ కంటోన్మెంట్ 10 వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో 5,810 ఎకరాల్లో ఆర్మీ స్థావరాలు, కార్యాలయాలు, శిక్షణ కేంద్రాలు, క్వార్టర్లున్నాయి. 420 ఎకరాల్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలున్నాయి. 490 ఎకరాలను బీ-కేటగిరీ కింద ప్రకటించారు. ఇందులో పాత బంగళాలున్నాయి. 2,748 ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వ స్థలాలు, కార్యాలయాలు, మార్కెట్ కొనసాగుతున్నాయి. 400కు పైగా కాలనీలు, 50కి పైగా బస్తీలు/మురికివాడల్లో పౌరులు నివసిస్తున్నారు. డిఫెన్స్‌కు చెందిన 91 ఎకరాలు ఖాళీగా ఉండగా.. కంటోన్మెంట్‌కు చెందిన స్థలాలు 303 ఎకరాల దాకా ఉన్నాయి. ఇవి కాకుండా.. 16 నోటిఫైడ్ పౌర ప్రాంతాలు 238 ఎకరాల్లో ఉన్నాయి. పరిపాలన సౌలభ్యం కోసం కంటోన్మెంట్‌ను 8 వార్డులుగా విభజించారు.
అభివృద్ధికి ఆమడ దూరం
కంటోన్మెంట్లలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగి.. ఉపాధ్యక్షుడు, వార్డు సభ్యులు ఎన్నికైనా.. అభివృద్ధి వారి చేతుల్లో ఉండదు. బడ్జెట్ కేంద్రం నుంచి రావాల్సిందే. అవి రావు..! రాష్ట్రం పైసా విదిల్చదు. సొంతంగా రాబడి వనరులను పెంచుకుని, పన్నులను వసూలు చేసుకుని అభివృద్ధి చేయాల్సిందే..! రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక్కడి ప్రజలకు దక్కేది సంక్షేమ పథకాలు మాత్రమే. రాష్ట్రం కూడా వాడుకుంటుంది కాబట్టి రోడ్ల నిర్మాణానికి, ప్రజల తాగునీటి వసతులకు సహకారం అందిస్తుంది. పైగా.. మిలటరీ అధికారులు ఎప్పుడు రోడ్లను మూసేస్తారో తెలియదు. అందుకే కంటోన్మెంట్ వాసులు తమను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలంటూ ఏళ్ల తరబడి విన్నవిస్తూ వస్తున్నారు. 2020లోనే కేంద్రం పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టిన నేపథ్యంలో.. విలీనానికే కేంద్రం మొగ్గుచూపుతోందని స్పష్టమవుతోంది.
ముఖ్యమంత్రి చొరవ..
కంటోన్మెంట్‌ను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు నుంచి ఆకాంక్షిస్తూ వచ్చారు. మిలటరీ/రక్షణ కార్యాలయాలు, క్వార్టర్లు మినహా.. సాధారణ పౌరులు నివసించే ప్రాంతాలను విలీనం చేసుకునేందుకు తాము సిద్ధమంటూ గత నెల 14న రక్షణ శాఖకు లేక పంపారు. ఇప్పటికే పలు కంటోన్మెంట్ల నుంచి ఇలాంటి ప్రతిపాదనలు రావడంతో.. రక్షణశాఖ వేగంగా స్పందించింది. అంతకు ముందు కేంద్రం ఈ ప్రక్రియపై సుమిత్‌బో్‌స కమిటీతో అధ్యయనం చేయించింది. ఆయన చేసిన ప్రధాన సూచనల్లో కంటోన్మెంట్లలోని పౌర ప్రాంతాలను సమీప స్థానిక సంస్థల్లో విలీనం చేయాలన్నారు. ఆ మేరకు కేంద్రం 2020లో కంటోన్మెంట్ సవరణ చట్టాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. తాజాగా ఎనిమిది మంది ఉన్నతాధికారుల కమిటీని నియమించింది. సికింద్రాబాద్ సహా.. ఐదు కంటోన్మెంట్లను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని, విలీనానికి చర్యలు తీసుకోనున్నారు. ఈ కమిటీ ఈనెల 9న వర్చువల్‌గా తొలిసారి భేటీ కానుంది. ఈ భేటీలోనే సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసే ప్రక్రియ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కమిటీ ముఖ్యంగా కంటోన్మెంట్లలోని ఆస్తులు, బోర్డు ఉద్యోగులు, పెన్షనర్లు, నిధులు, పౌర సేవలు, చరాస్తులు, స్టోర్స్, రోడ్ల నిర్వహణ, ట్రాఫిక్, రికార్డులు తదితర అంశాలపై కమిటీ క్షుణ్ణంగా అధ్యయనం చేయనుంది.
తొలుత సివిల్ నోటిఫైడ్ ప్రాంతాల విలీనం
సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో సివిల్ ఏరియాలుగా నోటిఫై చేసిన 16 ప్రాంతాలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసుకోవాలంటూ కేంద్ర రక్షణ శాఖ నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. 16 సివిల్ ఏరియాలను మాత్రమే కాకుండా, పౌరులు నివసిస్తున్న అన్ని ప్రాంతాలను విలీనం చేసుకోవాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి ఉంది. దీని వల్ల అభివృద్ధికి మార్గం సుగమమవుతుందనేది బీఆర్‌ఎస్ సర్కారు ఆలోచనగా తెలుస్తోంది. రక్షణ శాఖ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా స్పందించే సూచనలు కనిపిస్తున్నాయి.