కేసీఆర్ ముసలోడైండు.. ఇక రాజకీయ సన్యాసమే
ABN , First Publish Date - 2023-03-03T04:03:15+05:30 IST
‘కేసీఆర్ ముసలోడైండు.. రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిన వేళైంది. తెలంగాణ ప్రజలు సైతం కేసీఆర్‌కు బై.. బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.
బై.. బై.. కేసీఆర్.. ఎన్నికల్లో మా నినాదం
కేటీఆర్ సీఎం అంటూ బీఆర్‌ఎస్‌లో ఒత్తిడి
గ్యాస్ ధర పెంచి మహిళలకు మోదీ షాక్
నిరసనలకు బీఆర్‌ఎస్ పిలుపు బూటకం
మంత్రి రామారావు.. పెద్ద డ్రామా రావు
హాత్ సే హాత్ జోడో యాత్రలో రేవంత్
శేషజీవితాన్ని ఫామ్‌హౌ్‌సలో గడపండి
బై.. బై.. కేసీఆర్.. మా నినాదం ఇదే
హాత్ సే హాత్ జోడో యాత్రలో రేవంత్
భీమదేవరపల్లి/సైదాపూర్/సిద్దిపేట, మార్చి 2(ఆంధ్రజ్యోతి): ‘‘కేసీఆర్ ముసలోడైండు.. రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిన వేళైంది. తెలంగాణ ప్రజలు సైతం కేసీఆర్‌కు బై.. బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. వచ్చే ఎన్నికలకు ఇదే కాంగ్రెస్ నినాదం’’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్.. తన శేష జీవితాన్ని ఫామ్‌హౌ్‌సలో చక్కగా గడపాలని ఆకాంక్షించారు. అధికారం.. కేసీఆర్ అయ్యా, తాత ఇచ్చిన ఆస్తి కాదని, ఆయన్ను మార్చడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా గురువారం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని సర్దార్ సర్వాయి పాపన్న గుట్టలను సందర్శించారు. హనుమకొండ జిల్లా కొత్తకొండలోని శ్రీవీరభద్రస్వామి దేవాలయంలో రేవంత్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. చివరిగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎ్‌సను బీఆర్‌ఎ్‌సగా మార్చి తెలంగాణలోని 4 కోట్ల ప్రజలను కేసీఆర్ మోసం చేశారని దుయ్యబట్టారు. దేశంలో బైరాగిలా తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని బీఆర్‌ఎస్ లీడర్లే కేసీఆర్‌పై ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. కేంద్రంలోని మోదీ సర్కార్.. గ్యాస్ ధరలు పెంచి మహిళలకు షాక్ ఇచ్చిందని దుయ్యబట్టారు. తొమ్మిదేళ్లలో 18 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోదీ.. 100లక్షల కోట్ల అప్పులు చేసి అదానీ, అంబానీలకు దోచిపెట్టారని ధ్వజమెత్తారు. గ్యాస్ ధరల పెంపునకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ ఇచ్చిన నిరసన పిలుపు ఒక బూటకమని, మంత్రి రామారావు ఒక డ్రామా రావులా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయన్నారు. ప్రతీ విషయానికి పక్క దేశాలు, రాష్ట్రాలతో పోలికలు పెట్టే కేసీఆర్.. ఆ రాష్ట్రాల్లో మాదిరిగా పెట్రోల్‌పై వ్యాట్ ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించారు.
2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం
‘‘మిడ్‌మానేరు రిజర్వాయర్ నిర్మాణంలో కేసీఆర్ బంధువు జోగినపల్లి రవీందర్‌రావు భూములు కోల్పోగా, ఆయన కొడుకు సంతో్‌షరావు, కూతురు సౌజన్యకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ, ప్లాటు ఇచ్చారు. మరి గౌరవెల్లి రిజర్వాయర్‌లో భూములు కోల్పోయిన వారి ఆడబిడ్డలకు పరిహారం, ప్లాట్లు ఎందుకు ఇవ్వడం లేదు. సడ్డకుడి బిడ్డకు ఒక న్యాయం, గిరిజన పేద ఆడబిడ్డలకు మరో న్యాయమా?’’ అని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తిని మోయాల్సిన అవసరం లేదని, కాంగ్రె్‌సను గెలిపించి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుందామని అన్నారు. 2024 జనవరి 1వ తేదీన ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే రూ.500కే సిలిండర్, సొంతింటి నిర్మాణానికి రూ.5లక్షల సాయం, ఆరోగ్యశ్రీలో రూ.5లక్షల విలువైన చికిత్సలు, రూ.2లక్షల వరకు రుణమాఫీ అమలు చేయడంతోపాటు 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాల పునర్విభజన చేపట్టి ముక్కలైన ప్రాంతాలను ఒక్కటి చేస్తామని పేర్కొన్నారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ సుద్దపప్పు అని, తన ఇంటికే పలుమార్లు సీఎం వచ్చినా ఏనాడూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రయత్నించలేదని ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో జాతీయ స్థాయిలో కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు ఉంటుందని, రాష్ట్ర స్థాయిలో మాత్రం ఏ పార్టీతో పొత్తు ఉండదని ఆయన స్పష్టం చేశారు. కాగా, తెలంగాణలో హాత్ సే హాత్ జోడో యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే ఇక్కడి బీజేపీ నేతలను అమిత్‌షా ఢిల్లీకి పిలిపించుకొని గడ్డిపెట్టి పంపించారని రేవంత్ ఎద్దేవా చేశారు. ఎంపీగా గెలిచి తెలంగాణకు, కరీంనగర్‌కు బండి సంజయ్ ఒక్క రూపాయి కూడా తేలేదని విమర్శించారు. ఈసారి సంజయ్‌కు డిపాజిట్ కూడా దక్కకుండా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. దళితబంధు, డబుల్ బెడ్‌రూం ఇళ్లు అందిన లబ్ధిదారులందరూ కారు గుర్తుకే ఓటెయ్యాలని, రాని వాళ్లు మాత్రం కాంగ్రె్‌సకు ఓటెయ్యాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సూచించారు. హరీశ్‌రావు కుట్రలో భాగంగానే హుస్నాబాద్‌ను మూడు ముక్కలు చేశారని ధ్వజమెత్తారు. ఒక పారిశ్రామిక వేత్త కోసం తోటపల్లి రిజర్వాయర్‌ను రద్దు చేశారని ఆరోపించారు.